
మహిళ హత్యకు గురైన ముషక్‌మహల్ ఇదే...
అత్తాపూర్: మహిళపై లైంగికదాడికి పాల్పడి, ఆపై కిరాతకంగా హత్య చేసిన ఘటన రాజేంద్రనగర్ ఠాణా పరిధిలో ఆదివారం వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం...అత్తాపూర్‌లో ముషక్‌మహల్ అనే పురాతన భవనం ఉంది. శిథిలావస్థకు చేరిన ఈ భవనం నుంచి ఆదివారం దుర్వాసన రావడంతో స్థానికులకు అనుమానం వచ్చి పరిశీలించగా.. వివస్త్ర అయిన ఓ మహిళ శవం కనిపించింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు.
మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఉంది. కుడి చేయి సగం నరికేసి, మెడ, దవడ భాగం అతుక్కొని ఉన్నాయి. ఎడమ కాలిపై గాయం ఉంది. మృతురాలి పక్కనే ఒక బండరాయి పడి ఉంది. దుండగులు బండరాయితో ఆమె తల, కాలిపై కొట్టి చంపినట్టు పోలీసులు భావిస్తున్నారు. చుట్టు పక్కల గాలించగా మృతురాలి దుస్తులు లభించాయి. ముషక్‌మహల్ పైకి ఎక్కే మెట్లపై మద్యం సీసాలు పగులగొట్టి ఉన్నాయి.
దీంతో గుర్తు తెలియని వ్యక్తులు ఆమెపై లైంగికదాడికి పాల్పడి, అనంతరం హత్య చేసి ఉంటారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మృతదేహం కుళ్లిపోయి, ముఖం గుర్తు పట్టలేని విధంగా ఉండటంతో నాలుగైదు రోజుల క్రితమే ఈ హత్య జరిగి ఉంటుందంటున్నారు. డాగ్‌స్కా్వడ్‌ను రప్పించగా... పోలీసు జాగిలం ఘటనా స్థలం నుంచి సమీపంలోని పొలాల్లోకి వెళ్లి ఆగింది. మృతురాలిని స్థానికులు గుర్తు పట్టలేకపోవడంతో.. ఆమె ఎవరనేది తెలుసుకొనేందుకు అన్ని పోలీసుస్టేషన్లకు ఫొటోలను పంపారు. మృతురాలు ఎవరనేది తెలిస్తే .. హత్య మిస్టరీ వీడుతుందని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.