మృతదేహంతో రాస్తారోకో
నరసాపురం: నరసాపురంలో శ్రీ చైతన్య టెక్నో స్కూల్ బస్ ఢీకొని అనిల్‌కుమార్ అనే యువకుడు మృతిచెందగా బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ మంగళవారం పట్టణంలోని 216 జాతీయ రహదారిపై దళిత సంఘాల నాయకులు, సీపీఎం నేతలు రాస్తారోకో చేశారు. నాయకులను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. వివరాలిలా ఉన్నాయి.. గతనెల 22న జరిగిన ప్రమాదంలో అనిల్‌కుమార్ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలంటూ దళిత, సీపీఎం నాయకులు పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని నేరుగా పాఠశాల భవనం వద్దకు తీసుకువచ్చి ఆందోళన చేశారు. మధ్యాహ్నం వరకూ ఆందోళన చేసినా ఎవరూ స్పందించకపోవడంతో మృతదేహాన్ని నరసాపురం–పాలకొల్లు మార్గంలో 216 జాతీయ రహదారిపైకి తీసుకువచ్చి రాస్తారోకో చేపట్టారు. బాధిత కుటుంబానికి రూ.25 లక్షలు పరిహారమివ్వాలని డిమాండ్ చేశారు. రాస్తారోకోతో వాహనాలు భారీగా నిలిచిపోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. సీపీఎం నేత కవురు పెద్దిరాజు, దళిత సంఘాల నేతలు వంగలపూడి యేషయా, ముసూడి రత్నం, కారుమంచి జీవరత్నం తదితరులను బలవంతంగా జీప్ ఎక్కించి పోలీస్‌స్టేషన్ కు తరలించారు. కొద్దిసేపటికి టీడీపీ నాయకులు రంగంలోకి దిగి మృతుల బంధువులతో చర్చలు జరిపారు. చర్చలు సఫలం కావడంతో మృతదేహాన్ని తరలించారు.