బ్లడీఫెలోస్..
గిరిజన సంక్షేమ శాఖాధికారులపై మంత్రి రావెల ఆగ్రహం
గుంటూరులో 13 జిల్లాల అధికారులతో సమీక్ష
గుంటూరు వెస్ట్ : ‘రాష్ట్రవ్యాప్తంగా గిరిజన సంక్షేమశాఖలో పరిస్థితులు అధ్వానంగా ఉంటున్నాయి. అధికారులు తమ ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారు. మీపైన మంత్రి, మేనేజింగ్ డెరైక్టర్, ప్రిన్సిపల్ సెక్రటరీ అంటూ అథారిటీ ఉంటుంది. ఆ అథారిటీ వారిచ్చే నిబంధనలను పాటించడం లేదు ’ అంటూ రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి రావెల కిశోర్‌బాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. మీరేమైనా లార్డ్స్... లేక కింగ్స్ అనుకుంటున్నారాఅంటూ మండిపడ్డారు.
విశాఖ జిల్లా పాడేరు డివిజన్ గిరిజన శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టి.మోహన్‌రావు పనితీరుపై మంత్రి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉన్నతాధికారులు ఇచ్చే సూచనలు పాటించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి ఆయనపై బ్లడీఫెలోస్.. అంటూ విరుచుకుపడ్డారు. జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశపు హాలులో సోమవారం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 13 జిల్లాల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన అధికారులు తాము చేపట్టిన పనులను వివరించారు. శ్రీశైలం ఐటీడీఏ అధికారి వెంకటేశ్వర్లు చెంచుల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను వివరిస్తుండగా మంత్రి జోక్యం చేసుకుని చెంచుల్లో అక్షరాస్యత శాతం పెంచాలని, నిరుద్యోగ యువత వివరాలు సేకరించాలని సూచించారు. నిరుద్యోగులకు అవసరమైన స్కిల్ డెవెలప్‌మెంట్‌లో శిక్షణ ఇచ్చి, వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఐటీడీఏ పరిధిలోని ప్రాజెక్టు డెరైక్టర్లు యాక్షన్‌ప్లాన్ తయారుచేసుకుని, వాటిని అమలుచేయాలని సూచించారు.
రూ.1900 కోట్లతో గిరిజనుల అభ్యున్నతి
అనంతరం మంత్రి రావెల విలేకరులతో మాట్లాడుతూ 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఉప ప్రణాళిక కింద రాష్ట్రంలో షెడ్యూల్డు తెగల అభ్యున్నతికి, సంక్షేమానికి రూ.1900 కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నిర్దేంచిన లక్ష్యాల సాధనకు గిరిజన సంక్షేమాధికారులు కృషి చేయాలని ఆదేశించారు. మౌలిక సదుపాయాల కల్పనకు నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నామని వెల్లడించారు. గిరిజన కో ఆపరేటివ్ సొసైటీ (జీసీసీ) టర్నోవర్‌ను రూ.1000 కోట్లకు పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.
ఎన్‌ఆర్‌ఈజీఎస్ నుంచి సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థకు ప్రభుత్వం రూ.150 కోట్లు కేటాయించిందని, ఈ నిధులతో గిరిజన ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. సమావేశంలో గిరిజన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ విద్యాసాగర్, రాష్ట్ర సంచాలకులు డాక్టర్ ఎం.పద్మ, అదనపు సంచాలకుడు వీసీహెచ్ వీరభద్రుడు, గిరిజన సహకార సంస్థ మేనేజింగ్ డెరైక్టర్ ఎ.రవిప్రకాష్, 13 జిల్లాలకు చెందిన డీటీడబ్ల్యూవోలు, ఐటీడీఏ ప్రాజెక్టు డెరైక్టర్లు, గిరిజన శాఖ ఇంజినీర్లు, అసిస్టెంట్ డెరైక్టర్లు పాల్గొన్నారు.