‘రవ్వ’ క్షేత్రం వద్ద ఎస్.యానాం వాసుల ఆందోళన
ఊరిలో ప్రతి వారికీ ఉపాధి కల్పించాలని డిమాండ్
మద్దతుగా నిలిచిన వివిధ పార్టీలు, ప్రజాసంఘాలు
పలువురు నాయకులు సహా వంద మంది అరెస్టు
ఉప్పలగుప్తం : రెండు దశాబ్దాలకు పైగా సాగుతున్న చమురు వెలికితీత తమ జీవితాలకు వెతలనే మిగిల్చిందని ఎస్.యానాం వాసులు ఆక్రోశించారు. కేజీ బేసిన్‌లో చమురు సహజవాయు నిక్షేపాలు వెలికితీస్తున్న రవ్వ చమురు క్షేత్రం వద్ద సోమవారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. చమురు సంస్థ కార్యకలాపాల వల్ల గ్రామంలో బడుగు, బలహీనవర్గాల వారికి జీవనోపాధి కరువైందని, రాను రాను వ్యవసాయం కనుమరుగై రైతు కూలీలు, పర్రభూముల్లో మత్స్య సంపద తగ్గిపోయి మత్స్యకారులు పస్తులుండే పరిస్థితి దాపురించిందని ఆందోళనకు సారథ్యం వహించిన బొక్కా వెంకట సుబ్బారావు, లంకే లక్ష్మణరావు, నల్లి ధర్మరాజు అన్నారు. ఈ విషయమై ప్రజా ప్రతినిధులకు, అధికారులకు మొరపెట్టుకుంటున్నా ప్రయోజనం లేక రెండు నెలల వ్యవధిలో రెండు సార్లు కలెక్టర్‌ను కలసి తమ డిమాండ్లు తెలియజేశామన్నారు. అయినా పట్టించుకోకపోవడంతో రవ్వ క్షేత్రంలో కార్యకలాపాలను అడ్డుకోవాలనే ఆందోళన చేపట్టామన్నారు. పెద్ద సంఖ్యలో మహిళలతో పాటు సుమారు మూడు వందల మంది రవ్వ ప్లాంట్ గేట్ ముందు సోమవారం ఉదయం ఆరుగంటల నుంచి ఆందోళన చేపట్టారు.
డిమాండ్లు ఇవే..
‘ఎస్.యానాంలో ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించాలి. లేని పక్షంలో కుటుంబానికి రూ.5 వేల భృతి ఇవ్వాలి. కాలుష్యం వల్ల అనారోగ్యం పాలవుతున్నందున ప్రతి ఒక్కరికీ కార్పోరేట్ ఆసుపత్రిలో వైద్యానికి హెల్త్ కార్డు ఇవ్వాలి. విద్య వైద్యరంగాలకు ప్రాధాన్యతనిచ్చి గ్రామాన్ని మోడల్ విలేజ్‌గా తీర్చిదిద్దాలి’ అన్న ప్రధాన డిమాండ్లతో ఆందోళన జరిగింది. తమ ఆకాంక్షలపై ఎంపీ, ఎమ్మెల్యే, ఆర్డీఓతో పాటు రవ్వ యాజమాన్య సంస్థ స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రజా సంఘాల మద్దతు
ఎస్.యానాం గ్రామస్తుల పోరాటానికి సీపీఎం, ఐద్వా, వ్యవసాయ కార్మికసంఘం, పీడీఎస్‌ఓ, కాంగ్రెస్‌తో పాటు దళిత సంఘాలు మద్దతుగా నిలిచాయి. సీపీఎం జిల్లా కార్యదర్శి దువ్వా శేషుబాబ్జీ మాట్లాడుతూ గ్రామస్తుల వేదనను వినే నాథుడు లేకపోవడం బాధాకరమన్నారు. డివిజన్ కార్యదర్శి మోర్త రాజశేఖర్, వ్యవపాయ కార్మికసంఘం జిల్లా అధ్యక్షుడు కారెం వెంకటేశ్వరరావు, ఐద్వా జిల్లా కార్యదర్శి సీహెచ్ రమణి, పీడీఎస్‌ఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేవు తిరుపతిరావు, కాంగ్రెస్ నేతలు గెడ్డం సురేష్‌బాబు, జోగి అర్జునరావు, చీకట్ల శ్రీను, దళితనాయకుడు ఇసుకపట్ల రఘుబాబు ఆందోళనకు మద్దతు తెలిపారు.
డిమాండ్లు పరిశీలిస్తాం... సెక్షన్ 30 అమల్లో ఉంది
డిమాండ్లను ఉన్నతాధికారులకు తెలియజేస్తామని, సెక్షన్ 30 అమల్లో ఉన్నందున ఆందోళన విరమించాలని తహసీల్దారు ఎస్.సుబ్బారావు చెప్పినా ఆందోళనకారులు వినలేదు. నాయకులు, అధికారులు తమ ముందుకే రావాలని భీష్మించారు. డీఎస్పీ ఎల్ అంకయ్య సూచన మేరకు అమలాపురం సీఐ జి.దేవకుమార్ ఆధ్వర్యంలో పోలీసులు ఆందోళనకారులను లాఠీలతో చెదరగొట్టి పోలీస్‌వాహనాల్లో ఎక్కించారు. ఈ సందర్భంగా పరిస్ధితి ఉద్రిక్తంగా మారింది. నలుగురు సీఐలు, 12 మంది ఎస్సైలతో పాటు భారీగా మోహరించిన పోలీస్ బలగాలు ఆందోళనకారుల శిబిరాన్ని ఖాళీ చేయించాయి. శేషుబాబ్జీ, కారెం వెంకటేశ్వరరావు, రమణి, రేవు తిరుపతిరావు, మోర్త రాజశేఖర్‌లతో పాటు వందమందిని పోలీస్‌లు అరెస్ట్ చేసి అమలాపురం స్టేషన్‌కు తరలించారు.