‘స్థానిక’ పోరుకు సై
♦ సిద్దిపేటలో మున్సిపోల్స్ నగారా
♦ ఆశావహుల ఉత్సాహం ఇప్పటి నుంచే
♦ వ్యూహాలు, ప్రతివ్యూహాలు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సిద్దిపేట.. ‘స్థానిక’ పోరుకు సిద్ధమవుతోంది. మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆశావహులు పోటీకి రెట్టింపు ఉత్సాహం చూపుతున్నారు. ఒక్కో వార్డు నుంచి కనీసం పది నుంచి ఆరుగురుకి తగ్గకుండా పోటీ పడే పరిస్థితి ఉంది. ఇదిలా ఉంటే.. ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారులు నోటిఫికేషన్‌కు తుది మెరుగులు దిద్దుతున్నారు. అనుకున్నది అనుకున్నట్లుగా సాగితే ఈ నెల 19, లేదా 20న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు విశ్వసనీయం సమాచారం. ఏప్రిల్ నాలుగు, లేదా 5న పోలింగ్ నిర్వహించే విధంగా నోటిఫికేషన్ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం 34 వార్డులు ఉన్న సిద్దిపేట మున్సిపాల్టీకి మూడేళ్లుగా ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఇదిలా ఉంటే స్థానిక పోరులో భాగంగా ఆయా వార్డులో ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న వారు విందులతో సందడి చేస్తూ ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. మరి కొందరు కోర్టు స్టే తొలగిందన్న విషయం తెలిసినప్పటి నుంచే తాముపోటీ చేయాలనుకుంటున్న వార్డుల్లోనే కలియతిరుగుతూ ప్రజల మద్దతు కూడగట్టుకునే యత్నాలు చేస్తున్నారు. మరికొందరు యువజన, కుల సంఘాలను తమవైపు తిప్పుకునే యత్నాలు చేస్తున్నారు.
ఓటర్ల సంఖ్య పెరిగే అవకాశం
మున్సిపాలిటీలో శివారు గ్రామాలైన ప్రశాంతినగర్, హానుమాన్‌నగర్, గాడిచర్లపల్లి, ఇమాంబాద్, నర్సాపూర్, రంగధాంపల్లి విలీనమైన సంగతి తెలిసిందే. ఈ గ్రామాల విలీనమే ఎన్నికలకు అడ్డంకి మారింది. ఆయా గ్రామాల మాజీ ప్రజాప్రతినిధులు విలీనాన్ని వ్యతిరేకిస్తు హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు స్టే విధించింది. ఈ కారణంగా ఎన్నికలు నిర్వహణకు అడ్డంకిగా మారింది. ఇటీవలే ఉన్నత న్యాయస్థానం సిద్దిపేట మున్సిపాలిటీ ఎన్నికలకు మార్గాన్ని సుగమం చేసిన విషయం తెలిసిందే. అయితే ఆరు గ్రామాలు విలీనమైనప్పటికి రెండు వార్డులే అదనంగా పెంచారు. కాగా గతంలో 32 ఉన్న వార్డులను 34 వార్డులుగా చేశారు. వార్డుల్లో ఓట్ల సంఖ్య 2500 నుంచి 4వేల వరకు పెరిగింది.
అభ్యర్థుల ఎంపికకు అధికార పార్టీ సర్వే?
పోటీకి విపరీతమైన డిమాండ్ ఏర్పడటంతో అధికార టీఆర్‌ఎస్‌కి అభ్యర్థుల ఎంపిక క్లిష్టంగా మారనుంది. ఈ నేపథ్యంలో ఇతర మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్ అమలు చేసే వ్యూహంలాగానే ముందస్తు సర్వేలు చేయించి గెలుపు గుర్రాలకే అవకాశం కల్పించాలని ప్రైవేటు సంస్థలకు సర్వే బాధ్యతలను అప్పగించినట్లు సమాచారం. ఇటీవల సిద్దిపేటలో జరిగిన ఒక సమావేశంలో సైతం హరీశ్‌రావు సర్వే విషయం ప్రస్తావించారు.