33 వారాల పాపకు పునర్జన్మ | reborn to girl with 33 weeks | Sakshi
Sakshi News home page

33 వారాల పాపకు పునర్జన్మ

Published Fri, Oct 9 2015 2:03 AM | Last Updated on Tue, Aug 14 2018 3:33 PM

33 వారాల పాపకు పునర్జన్మ - Sakshi

33 వారాల పాపకు పునర్జన్మ

- పుట్టుకతోనే మూసుకుపోయిన రెండు నాసికా రంధ్రాలు
- ‘నాసల్ ఎండోస్కోపి’తో పునరుద్ధరించిన ‘కేర్’ వైద్యులు
 
సాక్షి, హైదరాబాద్: పుట్టుకతోనే రెండు నాసికా రంధ్రాలు మూసుకుపోయిన 33 వారాల శిశువుకు కేర్ ఆస్పత్రి వైద్యులు పునర్జన్మ ఇచ్చారు. ముక్కు రంధ్రాలు లేకపోవడంతో నోటి ద్వారా అతికష్టం మీద శ్వాస తీసుకుంటున్న పాపకు ‘నోసల్ ఎండోస్కోపి’ ద్వారా కొత్త ఊపిరి పోశారు. గురువారం బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ విష్ణుస్వరూప్‌రెడ్డి శస్త్రచికిత్స వివరాలను తెలిపారు. చాంద్రాయణగుట్ట బార్కస్‌కు చెందిన గర్భిణి నెల రోజుల క్రితం నైస్ ఆస్పత్రిలో 1.10 కేజీల బరువున్న ఆడ శిశువు(షరీపా ఫాతిమా)కు జన్మనిచ్చింది. అయితే పాపకు పుట్టుకతోనే రెండు నాసికా రంధ్రాలు మూసుకుపోయి ఉండటంతో స్థానిక వైద్యులు వెంటిలేటర్ సహాయంతో నోటి ద్వారా కృత్రిమ శ్వాసను అందించారు. మెరుగైన చికిత్స కోసం కేర్ ఆస్పత్రికి తరలించారు. ఈఎన్‌టీ వైద్యనిపుణుడు డాక్టర్ విష్ణుస్వరూప్‌రెడ్డి పాపకు పలు వైద్యపరీక్షలు చేసి ఊపిరితిత్తులకు శ్వాసను అందించే రెండు నాసికా రంధ్రాలు లోపలి భాగంలో నాళాలకు ఎముక అడ్డుగా రావడంతో మూసుకుపోయినట్లు గుర్తించారు. ప్రతి ఏడు వేల మందిలో ఒక్కరికి మాత్రమే ఇలాంటి సమస్య తలెత్తుతుంది.
 
 అది కూడా ఒక రంధ్రం మూసుకుపోయి మరో రంధ్రం తెరచి ఉంటుంది. కానీ ఈ పాపకు రెండు రంధ్రాలు మూసుకుపోయాయి. నాసికారంధ్రాలకు అడ్డుగా ఉన్న ఎముకకు శ్వాస తీసుకునేందుకు వీలుగా రంధ్రం చేసేందుకు ప్రత్యేకంగా ఓ డ్రిల్లర్‌ను వైద్యులు రూపొందించారు. 4 వారాల క్రితం పాపకు ‘నాసల్ ఎండో స్కోపి’ పద్ధతిలో నాళానికి అడ్డుగా ఉన్న ఎముకకు రంధ్రం చేసి మూసుకుపోయిన నాసిక రెండు నాళాలను తెరిచారు. తాత్కాలికంగా ఓరల్ ఎయిర్‌వేస్ లైఫ్ సేవింగ్ పైప్స్‌ను అమర్చామని, 6 వారాల తర్వాత పైపులను తొలగించనున్నట్లు విష్ణుస్వరూప్‌రెడ్డి తెలిపారు. ఆ తర్వాత పాప ముక్కు ద్వారా స్వేచ్ఛగా ఊపిరి తీసుకుంటుందన్నారు. ఈ తరహా శస్త్రచికిత్స దేశంలోనే మొదటిదని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement