తప్పుల తడక
కడప ఎడ్యుకేషన్: నాలుగో కేటగిరీ(రహదారి సౌకర్యం లేని) పాఠశాలల జాబితా జిల్లా యంత్రాంగాన్ని నవ్వులపాలు చేసింది. ఇంటి అద్దె అలవెన్సు 12 శాతం ఉన్న పాఠశాలల్లోనే 4వ కేటగిరీ వాటిని ఎంపిక చేయాలని జీఓ నంబర్ 43 చెబుతున్నా దానిని ఖాతర్ చేయకుండా 14.5 శాతం, 20 శాతం హెచ్‌ఆర్‌ఏ ఉన్న పాఠశాలలను సైతం ఈ విభాగం కింద చేర్చి పంచాయతీరాజ్ ఎస్‌ఈ అందరిని ఆశ్చర్యచకితులను చేశారు. రహదారి అసలేలేని పల్లెలు జాబితాలో కనిపించకపోగా ఇటీవల తారురోడ్డు వేసిన గ్రామాలు ప్రత్యక్షం కావడం వివాదాస్పదంగా మారింది. వారం రోజుల పాటు జిల్లాస్థాయి అధికారులంతా తర్జనభర్జన పడి చివరికి తప్పుల తడక జాబితాను విడుదల చేయడం ఉపాధ్యాయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.
పాత సీసాలో కొత్తసారా:
2015లో విడుదల చేసిన జాబితాలోని 55 పాఠశాలల్లో కేవలం ఐదింటిని తొలగించి మూడింటిని కొత్తగా చేర్చారు. పాత జాబితా నుంచి చక్రాయపేట మండలం మారేళ్లమడక, ముద్దనూరు మండలం చింతకుంట, పొద్దుటూరు మండలం ఎర్రగుంటపల్లె, వేంపల్లి మండలం ఎగువతువ్వపల్లె, అలిరెడ్డిపల్లె పాఠశాలలను తీసివేసి చక్రాయపేట మండలం ఉక్కుశిలవాండ్లపల్లె, పెండ్లిమర్రి మండలం తువ్వపల్లె, రాజంపటే మండలం ఏకిరిపల్లెలను కొత్తగా చేర్చారు. దీంతో 55 పాఠశాలలు ఉన్న జాబితా 53కి దిగింది. ఇంతకుమించి జాబితాలో పెద్దమార్పులు లేనందున పాతసీసాలో కొత్తసారా పోశారని ఉపాధ్యాయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
జీవోకు విరుద్ధంగా:
విద్యాశాఖ విడుదల చేసిన 43 నంబర్ జీవో ప్రకారం అన్ని వాతావరణాల్లో వెళ్లలేని రహదారులను గుర్తించి ఆ మార్గంలో ఉన్న పాఠశాలలను నాలుగో కేటగిరీ కింద చేర్చాలని ఉంది. ఇది కూడా 12శాతం ఇంటి అద్దె అలవెన్సు కలిగిన పాఠశాలలను మాత్రమే తీసుకోవాలని ఉంది. అయితే పంచాయతీరాజ్ ఎస్సీ శనివారం రాత్రి విడుదల చేసిన నాలుగో కేటగిరీ జాబితా జీవో నంబర్ 43కు విరుద్ధంగా ఉందనే విమర్శలు ఉన్నాయి. రాయచోటి మండలం దూలవారిపల్లె, రాజంపేట మండలం చెర్లోపల్లె, యానాదికాలనీ, బద్వేల్ మండలం రఘనాథపురం 14.5 శాతం హెచ్‌ఆర్‌ఏ ఉండగా చెన్నూరు మండలం శివాలపల్లె 20 శాతం హెచ్‌ఆర్‌ఏ కింద ఉంది.
వీటిని కూడా నిబంధనలకు విరుద్ధంగా నాలుగో కేటగిరీ కింద చేర్చడంలో జిల్లా యంత్రాంగం నవ్వులపాలైంది. జిల్లాలోని 44 మండలాలకు కలిపి 4వ కేటగిరీ కింద 27 పాఠశాలలను గుర్తించగా రాయచోటి ప్రాంతంలోని 6 మండలాల్లోనే 26 పాఠశాలలను జాబితాలో చేర్చారు. రహదారి సౌకర్యం లేని పల్లెలు అధికంగా ఉన్న చక్రాయపేట మండలంలో ఒకేఒక్క పాఠశాల జాబితాలో ఉంది.తారురోడ్డు ఉన్నవి సైతం నాలుగో కేటగిరీలో కనిపించడంపై బాధిత ఉపాధ్యాయులు న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు తెలిసింది.
పైకి ఎగిసి... అంతలోనే తగ్గి...
ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ మొదలుకాకముందే పంచాయతీరాజ్ అధికారులు నాలుగో కేటగిరీ జాబితాను విడుదల చేయాల్సి ఉంది. ఈ మేరకు కర్నూల్, అనంతపురం, చిత్తూరు జిల్లాల అధికారులు పదిరోజుల కిందటే జాబితాను విడుదల చేశారు. కడప పీఆర్ అధికారులు మాత్రం మొత్తం 988 గ్రామాలకు తారురోడ్డు సౌకర్యం లేదని నిర్ధారించి ఆ జాబితానే విద్యాశాఖకు పంపించారు. దీనిని తగ్గించాలని విద్యాశాకాధికారులు వారం రోజులపాటు ఎంత పోరాడినా జాబితాను మార్చే ప్రసక్తి లేందంటూ పంచాయతీరాజ్ ఎస్సీ భీష్మించుకుని కూర్చొన్నారు. కలెక్టర్ జోక్యం చేసుకున్నా ఆయన పద్ధతిలో ఏమాత్రం మార్పురాలేదు. 988 గ్రామాలతో నాలుగో కేటగిరి జాబితా విడుదలైతే ఉద్యమం తప్పదని ఉపాధ్యాయ సంఘ నేతలు హెచ్చరించడంతో ఎట్టకేలకు శనివారం రాత్రి కేవలం 53 పాఠశాలలతోనే నాలుగో కేటగిరీ జాబితాను ఎస్సీ విడుదల చేశారు.
న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం
రహదారి సౌకర్యం లేని మారుమూల ప్రాంతాలను పరిగణలోకి తీసుకోవాలని తాము కలెక్టర్, డీఈఓల ద్వారా పంచాయతీరాజ్ ఎస్సీకి వినతిపత్రం అందజేశాం. ఆయన వీటిని రీ ఎక్జామ్ చేయలేమంటూ వెనక్కి తిప్పి పంపించారు. ఇప్పుడు మాత్రం జీవో నంబర్ 43కు విరుద్ధంగా వ్యవహరించారు. మాకు జరిగిన అన్యాయం, తాజా జాబితాలోని అవకతవకలపై ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం.
– నాగేశ్వరావు, ఉపాధ్యాయుడు, కల్లూరుపల్లెతాండ, చక్రాయపేట మండలం.