మన్యంపై ఖాకీ పడగ | red alert | Sakshi
Sakshi News home page

మన్యంపై ఖాకీ పడగ

Published Fri, Jul 29 2016 12:09 AM | Last Updated on Tue, Oct 16 2018 2:39 PM

మన్యంపై ఖాకీ పడగ - Sakshi

మన్యంపై ఖాకీ పడగ

సాక్షి, విశాఖపట్నం/పెదబయలు : మన్యంలో పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ) వారోత్సవాలు గురువారం ప్రశాంతంగా ప్రారంభమైనా మన్యంలో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. అడవి మొత్తం పోలీసుల కవాతులో ప్రతిధ్వనిస్తోంది. ఎన్నడూలేని విధంగా ఈసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ఇటు పోలీసులు, అటు గిరిజనులు కంటిమీద కునుకు లేకుండా గుడుపుతున్నారు. మరోవైపు వారోత్సవాల కారణంగా పోలీసుల తనిఖీలు ముమ్మరం చేశారు.  మారుమూల ప్రాంతాలకు రవాణా సౌకర్యం నిలిచిపోవడంతో స్థానికులు అవస్థలు పడుతున్నారు.  తొలిరోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని జిల్లా పోలీసు అధికారులు వెల్లడించారు.
 
మన్యమంతా పోలీసు బలగాలే 
పీఎల్‌జీఏకి ఒకరోజు ముందు సాక్షాత్తూ రాష్ట్ర డీజీపీ వచ్చి తమ సిబ్బందిని హెచ్చరించడం, మావోయిస్టులు హింసాత్మక ఘటనలకు పాల్పడవచ్చనే సంకేతాలున్నాయని చెప్పడంతో భారీగా పోలీసు బలగాలను మోహరించారు.  ఎక్కడ చూసినా పోలీసులే కనిపిస్తున్నారు. ఏజెన్సీ ముఖద్వారాల్లో కాపుకాసి వచ్చి, పోయే ప్రతి వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తున్నారు. ద్విచక్ర వాహనాలు దగ్గర్నుంచి బస్సుల వరకూ దేనినీ వదిలిపెట్టడం లేదు. ప్రయాణికుల సామాగ్రిని క్షుణ్ణంగా సోదా చేస్తున్నారు. అనుమానం వస్తే గుర్తింపు కార్డులు అడిగి వివరాలు సేకరిస్తున్నారు.
 
స్థానికుల అవస్థలు 
పీఎల్‌జీఏ జరుగుతున్నప్పుడల్లా ఏజెన్సీలో గిరిజనులు అవస్థలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. ఈసారి కూడా అదే కనిపిస్తోంది. ప్రత్యేక బలగాలు అనుమానితుల ఇళ్లను సైతం సోదా చేస్తున్నాయి. గిరిజనులకు సహరిస్తున్నారనే అనుమానం ఉన్న ప్రాంతాలను చుట్టుముట్టాయి. దీంతో గిరిజనులు భయంతో వణికిపోతున్నారు. బయటకు వెళ్లకుండా ఇళ్లకే పరిమితమవుతున్నారు. మొదటి రోజే కాబట్టి  తిండి తిప్పలకు ఇబ్బంది లేకపోయినా ఇదే విధంగా రాబోయే రోజులు కూడా ఉంటే గిరిజనులు అల్లాడిపోవాల్సిందే. మరోవైపు పాడేరు డిపో నుంచి వెళ్లే ఆర్టీసీ బస్సులను మారుమూల గ్రామాలకు రద్దు చేశారు. జీపులు, ఆటోలను సైతం వెళ్లనివ్వడం లేదు. దీంతో గిరిజనులు కిలోమీటర్ల దూరం కాలినడకనే వెళ్లాల్సి వస్తోంది.
 
కలిసి వస్తున్న వర్షాలు 
పోలీసులను, స్థానికులను మన్యంలో కురుస్తున్న భారీ వర్షాలు  ఇబ్బందులకు గురిచేస్తుంటే   మావోయిస్టులకు మాత్రం ఉపయోగపడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా అక్కడి వాగులు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని గిరిజన గ్రామాలకు వీటిని దాటి వెళ్లడం తప్ప వేరే మార్గం లేదు. దీంతో కూంబింగ్‌ పార్టీ బలగాలు ఆయా గ్రామాలకు వెళ్లలేకపోగా కనీసం సమాచారం కూడా తెలిసే అవకాశం ఉండటం లేదు. ఇదే అదునుగా మావోయిస్టులు ఆయా గ్రామాల్లో పీఎల్‌జీఏ వారోత్సవాలను జరిపిస్తున్నారు.
ఫోటోరైటప్‌28ఏఆర్‌కె83,84..   ఏవోబిలో ముస్తాబైన స్థూపాలు
 
ఏవోబీలో స్థూపాలు ముస్తాబు
ఆంధ్రా – ఒడిశా సరిహద్దు గ్రామాల్లో మావోల  పీఎల్‌జీఏ వారోత్సవాల సందర్భంగా   స్థూపాలు అరుణవర్ణంతో ముస్తాబయ్యాయి. ఏవోబీ గ్రామాల్లో   కొన్ని  చోట్ల కొత్తగా భారీ   స్థూపాలు ఏర్పాటు చేశారు.   పాత స్థూపాలు ఉన్న  ప్రాంతాల్లో ఇప్పటికే  రంగులు వేసి     రవి, ఆనంద్, శరత్, ఆజాద్, కమల, గణపతి, అలాగే సఖీల,  విజయ్, శ్వేత, జీవన్‌  పేర్లను స్థూపాల్లో  రాసి  ఆవిష్కరణకు  సిద్ధం  చేశారు.    వారం  రోజుల పాటు జరిగే  వారోత్సవాల్లో  అమర వీరుల జోహార్లు అర్పించనున్నారు.      వారోత్సవాలు  ఎలాగైన నిలువరించాలని  పోలీసు బలగాలు మోహరించాయి. అలాగే   గతంలో కంటే భారీగా జనసమీకరణ చేసి వారోత్సవాలు నిర్వíß ంచాలని మావోలు పట్టుదలతో ఉన్నారు. దీంతో ఏవోబిలో  యుద్ధవాతావరణం అలముకుంది.     మావోలకు  ఎలాంటి సహాకారం అందించరాదని ఇప్పటికే  వారం రోజుల  నుంచి   పోలీసులు మారుమూల ప్రాంతాలకు వెళ్లే వ్యాపారులు, వాహనదారులకు  ఆదేశాలు  జారీ చేశారు.  మావోలకు ఎలాంటి సహాయం అందించినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరికల నడుమ   సంతలకు వెళ్లడానికి  వ్యాపారులు జంకుతున్నారు. 
 
చెరువూరులో స్థూపం
పీఎల్‌జీఎ వారోత్సవాల్లో తొలిరోజు మావోయిస్టులు విశాఖ–ఒడిశా సరిహద్దుల్లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఒడిశా సరిహద్దులోని అన్నవరం వద్ద చెరువూరులో అమరవీరుల స్ధూపాన్ని ఆవిష్కరించారు. ఏజెన్సీలోని కొన్ని గ్రామాల్లో రాళ్లు పేర్చి స్థూపాలు నిర్మించడంతో పాటు, పాత వాటికి రంగులు వేశారు. అయితే వాటిని ప్రారంభించలేదు. మారుమూల ప్రాంతాల్లో కరపత్రాలు వెదజల్లారు.  మావోయిస్టులు చేస్తున్న అన్ని చర్యలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, ప్రతి సమాచారం తమ వద్ద ఉందని,పరిస్థితి తమ ఆధీనంలోనే ఉందని పోలీసు ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి వెల్లడించారు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement