ఆహార పొట్లాలు పంపిణీ చేస్తున్న సునీతారెడ్డి తదితరులు
నర్సాపూర్ రూరల్: నర్సాపూర్ మండలంలోని తుజాల్‌పూర్, తిరుమలాపూర్ గ్రామాల్లో శనివారం అధికారులు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో తుజాల్‌పూర్‌లో 10 పూరిగుడిసెలు, 5 పెంకుటిల్లు కూలిపోయాయి. తిరుమలాపూర్‌లో చెరువు అలుగు నీరు ఇళ్లల్లోకి రావడంతో 15 కుటుంబాలు అవస్థలు పడుతున్నారు.
రెవెన్యూ అధికారులు తుజాల్‌పూర్‌లోని పాఠశాల, తిరుమలాపూర్ గ్రామ పంచాయతీలో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి వంట చేసి పెట్టేందుకు ప్రయత్నిస్తున్నా... ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. మాజీ మంత్రి సునీతారెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకుడు సంతోష్‌రెడ్డి సీడ్స్ ఆఫ్‌హోప్ సేవాస ంస్థ ద్వారా ఆహార పొట్లాలు, పాలు, బిస్కెట్లు, బ్రెడ్, బెడ్‌షీట్లు అందజేశారు.
రెండు రోజుల పాటు పునరావాస కేంద్రాల్లో ఉంటున్న వారికి పాలు, బిస్కెట్లు, బ్రెడ్, పులిహోర ప్యాకెట్లు అందేసినట్లు సీడ్స్‌ఆప్ హోప్ చైర్మన్ అమూల్య తెలిపారు.
సునీతారెడ్డి మాట్లాడుతూ అధికారంలో ఉన్న నాయకులు రెండు గ్రామాల ప్రజలను చూసిన దాఖలాలు లేవన్నారు. అధికారంలో ఉన్న నాయకులు చేయాల్సిన పని తాము చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో నర్సాపూర్ సర్పంచ్ రమణారావు, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ అంజనేయులుగౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మల్లేశ్, మాజీ సర్పంచ్ అశోక్, రెడ్డిపల్లి సర్పంచ్ భరత్‌గౌడ్, బాబు, రాజేష్, ముజాయిద్‌ఖాన్, తదితరులు పాల్గొన్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : డీడీ శ్రీధర్
మండలంలోని తిరుమలాపూర్, తుజాల్‌పూర్ గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని సాంఘీక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీధర్, తహసీల్దార్ ప్రతాప్‌రెడ్డి, ఎంపీడీఓ శ్రవణ్‌కుమార్ సూచించారు. ఆ గ్రామాలను వారు సందర్శించిన సందర్భంగా మాట్లాడారు. తిరుమలాపూర్‌లో చెరువు ప్రమాదంగా ఉండటంతో కట్టకు ఒక వైపు కాలువ తవ్వించి నీటిని దారి మళ్లించారు. పునరావాస కేంద్రాల్లో ఉంటున్న వారికి రెవెన్యూ సిబ్బంది భోజనంతో పాటు వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు.