అస్వస్థతతో రిమాండ్ ఖైదీ మృతి
-
వివిధ కేసుల్లో నిందితుడు
-
గంజాయి అక్రమ రవాణాలో ఇటీవలే చిక్కాడు
రాజమహేంద్రవరం క్రైం :
గంజాయి కేసులో అరెస్టయి రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్‌లో ఉన్న ఖైదీ గురువారం అస్వస్థతతో మృతి చెందాడు. అనపర్తి గ్రామానికి చెందిన గొలుగూరి వెంకట సత్యనారాయణ రెడ్డి(63)ని ఈనెల 24వ తేదీన గంజాయి కేసులో రాజమహేంద్రవరం పోలీసులు అరెస్ట్ చేశారు. 26వ తేదీన రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్‌కు తరలించారు. సత్యనారాయణకు వైద్య సదుపాయం అందించాలని కోర్టు ఆదేశించడంతో అతనిని 27వ తేదీ మధ్యాహ్నం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రిలోని ఖైదీల వార్డుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం తెల్లవారు జామున 4.38 గంటలకు గుండె పోటుతో సత్యనారాయణరెడ్డి మృతి చెందాడు. పోస్టు
మార్టం అనంతరం మృతదేహాన్ని అతని బంధువులకు అప్పగించారు. త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఛాతిపై గాయం
గొలుగూరి వెంకట సత్యనారాయణ రెడ్డి ఛాతిపై చిన్న గాయాన్ని గుర్తించారు. మృతుడి వంటిపై పలు గాయాలు ఉండడంతో అనుమానాలకు తావిస్తోంది. దీనిపై నిందితుడి బంధువులు నోరు మెదపడం లేదు.
బెయిల్‌పై బయటకు వచ్చి..
గొలుగూరి వెంకట సత్యనారాయణ రెడ్డి వివిధ కేసుల్లో నిందితుడు. గంజాయి కేసులే కాకుండా కిడ్నాప్ కేసు కూడా ఇతనిపై నమోదైంది. జగ్గంపేట పోలీసు స్టేషన్‌లో నమోదైన గంజాయి అక్రమ రవాణా కేసులో 2008లో సత్యనారాయణరెడ్డికి 14 ఏళ్ల జైలు శిక్ష విధిం చారు. సొంత బావమరదిని కిడ్నాప్ చేసిన కేసులో ఇతను ప్రధాన నిందితుడు. 2012 జూలై 6న అనపర్తి పోలీసు స్టేషన్‌లో ఈ కేసు నమోదైంది. Výæంజాయి కేసులో ఎనిమిదేళ్ల జైలు శిక్ష అనంతరం బెయిల్‌పై విడుదలైన అతను మళ్లీ అదే వ్యాపారం చేపట్టాడు. ఈ నెల 24వ తేదీన కడియం మండలం జేగురుపాడు వద్ద అక్రమంగా గంజాయిని పుచ్చకాయలు, తవుడు బస్తాల మాటున తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. రెండు ఐషర్ వ్యాన్‌లు, ఒకలారీ, రెండు కార్లను, రెండు కేజీల చొప్పున 158 పాలి థిన్ ప్యాకెట్లలో ఉన్న రూ. 1.50 కోట్ల విలువ చేసే 4 టన్నుల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సత్యనారాయణ రెడ్డి గుంటూరు జిల్లా నర్సరావుపేటమండలం రామిరెడ్డిపేటకు చెంది న పాములపర్తి శ్రీనివాసరావు అనే మధ్యవర్తి ద్వారా హైదరాబాద్‌లోని చౌహాన్‌కు గంజాయి పంపిస్తున్నాడు. ఈ కేసులో నర్సరావుపేటకు చెందిన షేక్ సుభాని, రాజమహేంద్రవరం బొమ్మూరు కాలనీకి చెందిన చోడవరపు రాజేష్, మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.