ఎస్‌ఎస్‌ఏలో అద్దెకార్ల మాయ!
→ నిబంధనలకు విరుద్ధంగా వైట్ బోర్డ్ వాహనాలు
→ అయినా పట్టించుకోని ఉన్నతాధికారులు
→ సొంతకార్లలో అద్దె దర్జా
అనంతపురం ఎడ్యుకేషన్ : ఈ ఫొటోలో ఉన్న కారు ఎస్‌ఎస్‌ఏ ఇంజనీరింగ్ విభాగంలో పని చేస్తున్న ఓ డిప్యూటీ ఇంజనీర్‌ది. ఆయన తన కారునే అద్దె వాహనంగా చూపించి ప్రతి నెలా రూ.24 వేలు తీసుకుంటున్నారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వ కార్యాలయాలకు అద్దెకు తీసుకునే వాహనం కచ్చితంగా ఎల్లో బోర్డు (ట్యాక్సీప్లేట్) అయి ఉండాలి. కానీ ఈ అధికారి వైట్ బోర్డు (ఓన్‌ప్లేట్) వాహనంలో దర్జాగా తిరుగుతున్నారు.
పదిలో నాలుగు వైట్ బోర్డు వాహనాలు
సర్వశిక్ష అభియాన్‌లో మొత్తం పది వాహనాలు ఉన్నాయి. పీఓ, సెక్టోరియల్ ఆఫీసర్లు, డీఈలతో పాటు జిల్లా విద్యాశాఖ అధికారికి కూడా ఎస్‌ఎస్‌ఏ నిధుల నుంచి వాహనం ఏర్పాటు చేశారు. వీటిలో పీఓ, సెక్టోరియల్ ఆఫీసర్లకు మాత్రం ఎల్లో బోర్డు వాహనాలు ఏర్పాటు చేశారు. ఇక డీఈలతో పాటు జిల్లా విద్యాశాఖ అధికారికి ఏర్పాటు చేసిన కారు కూడా వైట్ బోర్డు కల్గినవే ఉన్నాయిl. వైట్ బోర్డు వాహనాలను అద్దెకు వినియోగించకూడదనే నిబంధన ఈ అధికారులకు అందరికీ తెలిసినా అడిగే వారు లేక నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. ఇలా ట్యాక్సీ ప్లేట్ స్థానంలో సొంతకార్లు వాడుతున్న వారిలో కొందరు తామే సొంతంగా వాహనాలను ఏర్పాటు చేసుకోగా, మరికొందరు తమకు అనుకూలంగా ఉన్నవారి పేరిట వాహనాలు కొనుగోలు చేసి ఏర్పాటు చేసుకున్నారు. కొత్త వాహనాలకు నెలనెలా చెల్లించాల్సిన కొనుగోలు కంతు ఈ అద్దెలో సరి చేస్తున్నారు.
కిలోమీటర్లు మించి తిరిగితే ఒట్టు
నెలకు రూ. 24 వేలు ప్రభుత్వం వాహనానికి అద్దె చెల్లిస్తుంది. సదరు వాహనం నెలలో 2,500 కిలోమీటర్లు తిరగాలి. అయితే ఎల్లో బోర్డు వాహనాలు మాత్రం కిలోమీటర్లు పూర్తిగా తిరుగుతున్నా...వైట్ బోర్డు వాహనాలు ఆ మేర తిరగడం లేదు. పైగా సొంత కార్లపై ఉన్న మమకారంతో వాటిని ఎక్కువగా తిప్పేందుకు ఇష్టపడడం లేదని ఆశాఖ సిబ్బందే చెబుతున్నారు. ఎల్లో బోర్డు కల్గిన వాహనాలను సెక్టోరియల్ ఆఫీసర్లు అవసరాన్ని బట్టి అందుబాటులో ఉన్న వాహనాలను క్యాంపులకు తీసుకెళ్తుంటారు. అయితే వైట్ బోర్డు కల్గిన వాహనాలు కార్యాలయం వద్ద ఖాళీగా ఉన్నా, వాటిని పంపడం లేదని కొందరు ఉద్యోగులు వాపోతున్నారు. వైట్‌బోర్డు కల్గిన వాహనాలన్నీ అధికారులవే కావడంతో సిబ్బంది వాటిని అడిగే సాహసం కూడా చేయడం లేదు.
ప్రభుత్వ ఆదాయానికి గండి
ఎల్లో బోర్డు కల్గిన వాహనాలు ప్రతి సంవత్సరం ఇన్సూరెన్స్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ కచ్చితంగా తీసుకోవాలి. ఇందుకు రూ. 18–23 వేలు దాకా ఖర్చవుతుంది. వైట్‌బోర్డు వాహనాలకు ప్రతి ఏడాది ఇన్సూరెన్స్ మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అది కూడా రూ. 6–10 వేలు మాత్రమే. అంటే వైట్‌బోర్డు కల్గిన వాహనాలను వినియోగిస్తూ మరోవైపు ప్రభుత్వ ఆదాయానికి కూడా గండి కొడుతున్నారు.
కొసమెరుపు ఏమిటంటే...
ఎస్‌ఎస్‌ఏలో ప్రతినెలా వాహనాలకు సంబంధించినlఅద్దె బిల్లులను పరిశీలించే బాధ్యతను వైట్‌బోర్డు వాహనాన్ని వినియోగిస్తున్న డీఈకే అప్పగించడం.