రాచకొండలో రిజర్వాయర్లు!
- నేటి నుంచి క్షేత్రస్థాయిలో పర్యటించనున్న నిపుణుల బృందం
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలో విస్తరించిన రాచకొండ గుట్టల్లో పది టీఎంసీల సామర్థ్యంతో రెండు భారీ స్టోరేజి రిజర్వాయర్లు నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రస్తుతం రాజధాని హైదరాబాద్‌కి ప్రస్తుతం కృష్ణా మొదటి, రెండవ, మూడవ దశల ద్వారా నిత్యం 270 మిలియన్ గ్యాలన్ల నీటిని తరలిస్తున్న విషయం విదితమే.
దీనికి అదనంగా పాలమూరు ఎత్తిపోతల పథకం నుంచి తరలించనున్న పది టీఎంసీల నీటిని ఈ జలాశయాల్లో నిల్వ చే సేందుకు ఉన్న అవకాశాలపై అధ్యయనం జరపాలని జలమండలి అధికారులను ఆదేశించినట్లు సమాచారం. సర్కారు ఆదేశాల మేరకు జలమండలి ఇంజినీర్లు సహా పలువురు నిపుణులు శనివారం నుంచి ఐదు రోజుల పాటు రాచకొండ గుట్టలతోపాటు నల్లగొండ జిల్లా మల్కాపురం, నాగారం తదితర ప్రాంతాల్లోని అటవీ, ప్రభుత్వ భూముల్లో క్షేత్రస్థాయి అధ్యయనం జరపనున్నారు. భారీ స్టోరేజి రిజర్వాయర్ల నిర్మాణానికి అవకాశాలను పరిశీలించనున్నట్లు అధికార వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి.
ముంపు సమస్యలు లేకుండా చూడాలి
భారీ రిజర్వాయర్లు నిర్మించేటప్పడు ముంపు సమస్యలు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. 40 గ్రామాలు విస్తరించి ఉండే స్థలంలో రిజర్వాయర్లను నిర్మించాల్సి ఉంటుంది. ఇందుకు అవసరమైన స్థలాలు సేకరించడం కష్టమే. నగరానికి తరలించేందుకు అవసరమయ్యే వ్యయాన్ని పరిగణలోకి తీసుకొని కార్యాచరణ సిద్ధంచేయాలి. - టి.హనుమంతరావు, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్
జంట జలాశయాల ఎగువ ప్రాంతాల్లో నిర్మించాలి
ప్రస్తుతం జలకళలేక వట్టికుండలుగా మారిన జంటజలాశయాలు హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌ల ఎగువ ప్రాంతాల్లో ఈ భారీ స్టోరేజి రిజర్వాయర్లు నిర్మించిన పక్షంలో.. అక్కడి నుంచి నీటిని నేరుగా జంట జలాశయాలకు గ్రావిటీ ద్వారా తరలించే అవకాశం ఉంటుంది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నుంచి లక్ష్మీదేవిపల్లి మీదుగా ఈ స్టోరేజి రిజర్వాయర్లలో నీటిని నింపే ఏర్పాట్లు చేస్తే మంచిది. - శ్యాంప్రసాద్ రెడ్డి, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్