మనోజ్‌ నుంచి నాకు ప్రాణ హాని.. సీపీకి మోహన్ బాబు లేఖ | Mohan Babu Gives Complaint Letter To Rachakonda CP On His Son Manchu Manoj, More Details Inside | Sakshi
Sakshi News home page

Mohan Babu: మనోజ్‌, మౌనిక నుంచి రక్షణ కల్పించండి.. సీపీకి మోహన్ బాబు లేఖ

Published Mon, Dec 9 2024 9:05 PM | Last Updated on Tue, Dec 10 2024 10:15 AM

Mohan Babu Complaint Letter To Rachakonda CP His Son Manoj

తనయుడు మంచు మనోజ్‌పై టాలీవుడ్ నటుడు మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. తన కుమారుడు మనోజ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని రాచకొండ సీపీకి లేఖ రాశారు. అంతేకాకుండా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తానని లేఖలో మోహన్ బాబు ప్రస్తావించారు. మంచు మనోజ్, మౌనిక నుంచి తనకు రక్షణ కల్పించాలని లేఖ ద్వారా రాచకొండ సీపీని కోరారు.

ఇల్లు విడిచి పెట్టి వెళ్లాడు
ఇంకా ఏమన్నారంటే.. నేను జల్‌పల్లిలో 10 ఏళ్లుగా నివసిస్తున్నాను. నాలుగు నెలల కిందట నా చిన్న కొడుకు మనోజ్‌ ఇంటిని విడిచిపెట్టి వెళ్లాడు. మనోజ్ కొందరు సంఘ వ్యతిరేకులతో కలిసి నా ఇంటి వద్ద కలవరం సృష్టించాడు. మాదాపూర్‌లోని నా కార్యాలయంలోకి 30 మంది వ్యక్తులు చొరబడి సిబ్బందిని బెదిరించారు. 

బెదిరింపులు
మనోజ్, మౌనిక నా ఇంటిని దౌర్జన్యంగా ఆక్రమించుకొని ఉద్యోగులను బెదిరిస్తున్నారు. నా భద్రత, విలువైన వస్తువులు, ఆస్తుల విషయంలో భయంగా ఉంది. నాకు హాని కలిగించే ఉద్దేశంతో ఉన్నారు. నా నివాసాన్ని శాశ్వతంగా ఖాళీ చేయమని బెదిరించారు. సంఘ విద్రోహులుగా మారి నా ఇంట్లో ఉన్న వారికి ప్రాణహాని కలిగిస్తున్నారు. 

ప్రాణ హాని
చట్టవిరుద్ధంగా నా ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు మనోజ్, మౌనికలు ప్లాన్ చేశారు. నేను దాదాపు 78 ఏళ్ల సీనియర్ సిటిజన్‌ను. మనోజ్, మౌనిక, వీరి సహచరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. నా ఆస్తుల నుంచి మనోజ్, మౌనికలను తొలగించండి. నా భద్రత కోసం అదనపు సిబ్బందిని కేటాయించండి. నా ఇంట్లో ఎలాంటి భయం లేకుండా గడిపేందుకు రక్షణ కల్పించండి అని మోహన్‌బాబు లేఖలో కోరారు.

(ఇది చదవండి: పోలీసులకు ఫిర్యాదు చేసిన టాలీవుడ్ హీరో మంచు మనోజ్)

ప్రాణహాని ఉంది.. మంచు మనోజ్

ఇదిలా ఉంటే మంచు మనోజ్ తన కుటుంబానికి ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను ఇంట్లో ఉండగా పదిమంది గుర్తు తెలియని వ్యక్తులు ఇంటికి వచ్చి తమపై దాడి చేశారని ఫిర్యాదులో వెల్లడించారు. వారిని పట్టుకునే ప్రయత్నంలో తనకు గాయాలైనట్లు పోలీసులకు తెలిపారు. ఆదివారం ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న మనోజ్ ఆ వివరాలు కూడా పోలీసులకు సమర్పించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement