గురుకుల విద్యార్థులను ఐఏఎస్‌లుగా చేసి చూపిస్తాం
టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐ సొసైటీ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్
హైదరాబాద్: సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో చదివే విద్యార్థుల్ని ఐఏఎస్‌లుగా చేసి చూపిస్తామని టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐ సొసైటీ కార్యదర్శి డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐ సొసైటీ, అమిదా ఎడ్యుకేషనల్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత సివిల్ సర్వీస్ ఫౌండేషన్ కోర్సు శిక్షణ కార్యక్రమాన్ని శనివారం గౌలిదొడ్డిలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న విద్యార్థులను ఉన్నత స్థానాల్లో నిలిపేందుకు గురుకుల విద్యాలయాల సంస్థ కృషి చేస్తోందని పేర్కొన్నారు. అత్యుత్తమ సర్వీసులైన సివిల్స్ కల సాకారం చేసేందుకు శిక్షణ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వివరించారు.
గురుకుల విద్యాలయాల సంస్థ చేపడుతున్న విద్యాభివృద్ధి కార్యక్రమాలను గుర్తించి అమిదా ఎడ్యుకేషనల్ సొసైటీ సివిల్స్ శిక్షణకు కలిసి రావడం అభినందనీయమన్నారు. ఈ సందర్బంగా శిక్షణకు ఎంపికైన విద్యార్థులకు ఆయన చేతుల మీదుగా మెటీరియల్ ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐ సొసైటీ డిప్యూటీ కార్యదర్శి లక్ష్మయ్య, అమిదా ఎడ్యుకేషనల్ అకాడమీ ప్రతినిధులు ముత్యం, గీత, గౌలిదొడ్డి గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ప్రమోద, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.