residential students
-
రెసిడెన్షియల్ విద్యార్థులను తీర్చిదిద్దండి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు తీసుకోవాలని, దేశంలోని ప్రతిష్టాత్మక ఉన్నత విద్యా సంస్థల్లో సీట్లు లభించేలా బోధన జరగాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి ఆదేశించారు. అర్హులైన ప్రతి విద్యార్థికి రెసిడెన్షియల్ పాఠశాలల్లో ప్రవేశం దక్కేలా చూడాలన్నారు. గురువారం సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సంక్షేమ హాస్టళ్లు, కళాశాలలు, పాఠశాలలకు గ్రేడింగ్ విధానం రూపొందించాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి నిధుల వ్యయం పెంచాలని, స్టడీ సర్కిళ్ల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువత ఉద్యోగాలు పొందేలా శిక్షణ ఇవ్వాలన్నారు. భూ పంపణీ పథకం లబ్ధిదారులు వ్యవసాయం చేసేలా సహకారం అందించాలని సూచించారు. వ్యవ సాయానికి 24 గంటల విద్యుత్ ఇస్తున్నందున ఈ వేసవిలో 17 వేల మెగావాట్ల డిమాండ్ వచ్చినా తట్టుకునేలా విద్యుత్ అధికారులు ఆ మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. -
జాతీయ అథ్లెటిక్స్‌కు ఖమ్మం విద్యార్థిని
సాక్షి, ఖమ్మం : పట్టణంలోని గురుకుల పాఠశాల విద్యార్థిని గుర్రం మానస జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ మెదక్ పట్టణంలో నిర్వహించిన 63 వ రాష్ట్ర స్థాయి అండర్ 17 అథ్లెటిక్ పోటీలలో విశేష ప్రతిభకనబర్చడం ద్వారా ఆమె ఈ ఘనత సాధించారు. మూడు కిలోమీటర్ల నడక పోటీ విభాగంలో మానస ప్రధమ స్థానంలో నిలిచి, బంగారు పథకం సాధించారు. ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడుకు చెందిన గుర్రం మానస.. ఖమ్మం గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నారు. తెలంగాణా వ్యాప్తంగా సుమారు ఐదు వందల విద్యార్థినీ, విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. షాట్ పుట్, లాంగ్ జంప్, మూడు కిలోమీటర్ల నడక పోటీలలో ఖమ్మం కొత్తగూడెంజిల్లాలకు చెందిన విద్యార్థులు బంగారు పతకాలు సాధించి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారు. జాతీయ పోటీలకు మానస ఎంపిక కావడంపై కుటుంబీకులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. -
గురుకుల విద్యార్థులు.. కాబోయే డాక్టర్లు
- నీట్లో 84 మందికి అత్యుత్తమ ర్యాంకులు - సీఎంను కలసిన గురుకుల కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో చదువుకున్న 84 మంది విద్యార్థులు వైద్యులు కాబోతున్నారు. నీట్–2017 ఫలితాల్లో వారంతా మంచి ర్యాంకులు సాధించి.. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులకు ఎంపికయ్యే అర్హత సాధించారు. సోమవారం గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్.. సీఎం కేసీఆర్‌ను కలసి ఈ వివరాలను నివేదించారు. ఈ విద్యార్థుల్లో 55 మంది ఎస్సీ, 9 మంది ఎస్టీ విద్యార్థులు ఎంబీబీఎస్‌లో సీట్లు దక్కించుకోనుండగా... 15 మంది ఎస్సీ, ఐదుగురు ఎస్టీ విద్యార్థులు బీడీఎస్‌లో సీట్లు పొందనున్నారు. ప్రత్యేకంగా శిక్షణ నీట్ కోసం ‘ఆపరేషన్ బ్లూ క్రిస్టల్ ప్రోగ్రాం (ఓబీపీఎస్)’ పేరిట రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లోని 100 మంది చురుకైన విద్యా ర్థులను ఎంపిక చేసి శిక్షణ ఇచ్చారు. ఇందులో 84 మంది నీట్లో మంచి ర్యాంకులు సాధిం చడం గమనార్హం. ఈ విజయంపై ప్రవీణ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పెట్టడంపై సీఎం‡కు కృతజ్ఞతలు తెలి పారు. ‘బ్లూ క్రిస్టల్ ప్రోగ్రామ్’ మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు 140 మంది వైద్య విద్య కోర్సుల కు ఎంపికైనట్లు తెలిపారు. మరెన్నో ప్రతిష్టాత్మక సంస్థల్లో సీట్లు దేశంలోని పలు ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లోనూ గురుకుల విద్యార్థులు ప్రవేశాలు పొందుతున్నారు. ఈ ఏడాది 12 మంది విద్యార్థులు ఢిల్లీ యూనివర్సిటీలో, ఆరుగురు టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో ప్రవేశం పొందారని గురుకుల విద్యాసంస్థల సొసైటీ వెల్లడించింది. ముఖ్యమంత్రి అభినందనలు గురుకుల విద్యార్థులు పెద్దసంఖ్యలో డాక్టర్లు కాబోతుండటం గర్వంగాఉందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులను, వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి ప్రోత్సహించిన ప్రవీణ్‌కుమార్‌ను అభినందించారు. విద్యార్థులు సాధించిన ఈ విజయాలు మరిన్ని గురుకులాలు స్థాపించేందుకు ప్రేరణ ఇస్తున్నాయన్నారు. -
గురుకుల విద్యార్థులను ఐఏఎస్‌లుగా చేసి చూపిస్తాం
టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐ సొసైటీ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ హైదరాబాద్: సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో చదివే విద్యార్థుల్ని ఐఏఎస్‌లుగా చేసి చూపిస్తామని టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐ సొసైటీ కార్యదర్శి డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐ సొసైటీ, అమిదా ఎడ్యుకేషనల్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత సివిల్ సర్వీస్ ఫౌండేషన్ కోర్సు శిక్షణ కార్యక్రమాన్ని శనివారం గౌలిదొడ్డిలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న విద్యార్థులను ఉన్నత స్థానాల్లో నిలిపేందుకు గురుకుల విద్యాలయాల సంస్థ కృషి చేస్తోందని పేర్కొన్నారు. అత్యుత్తమ సర్వీసులైన సివిల్స్ కల సాకారం చేసేందుకు శిక్షణ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వివరించారు. గురుకుల విద్యాలయాల సంస్థ చేపడుతున్న విద్యాభివృద్ధి కార్యక్రమాలను గుర్తించి అమిదా ఎడ్యుకేషనల్ సొసైటీ సివిల్స్ శిక్షణకు కలిసి రావడం అభినందనీయమన్నారు. ఈ సందర్బంగా శిక్షణకు ఎంపికైన విద్యార్థులకు ఆయన చేతుల మీదుగా మెటీరియల్ ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐ సొసైటీ డిప్యూటీ కార్యదర్శి లక్ష్మయ్య, అమిదా ఎడ్యుకేషనల్ అకాడమీ ప్రతినిధులు ముత్యం, గీత, గౌలిదొడ్డి గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ప్రమోద, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.