గురుకుల విద్యార్థులు.. కాబోయే డాక్టర్లు
గురుకుల విద్యార్థులు.. కాబోయే డాక్టర్లు
Published Tue, Jul 4 2017 3:20 AM | Last Updated on Tue, Sep 5 2017 3:06 PM
- నీట్‌లో 84 మందికి అత్యుత్తమ ర్యాంకులు
- సీఎంను కలసిన గురుకుల కార్యదర్శి ప్రవీణ్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో చదువుకున్న 84 మంది విద్యార్థులు వైద్యులు కాబోతున్నారు. నీట్–2017 ఫలితాల్లో వారంతా మంచి ర్యాంకులు సాధించి.. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులకు ఎంపికయ్యే అర్హత సాధించారు. సోమవారం గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్.. సీఎం కేసీఆర్‌ను కలసి ఈ వివరాలను నివేదించారు. ఈ విద్యార్థుల్లో 55 మంది ఎస్సీ, 9 మంది ఎస్టీ విద్యార్థులు ఎంబీబీఎస్‌లో సీట్లు దక్కించుకోనుండగా... 15 మంది ఎస్సీ, ఐదుగురు ఎస్టీ విద్యార్థులు బీడీఎస్‌లో సీట్లు పొందనున్నారు.
ప్రత్యేకంగా శిక్షణ
నీట్ కోసం ‘ఆపరేషన్ బ్లూ క్రిస్టల్ ప్రోగ్రాం (ఓబీపీఎస్)’ పేరిట రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లోని 100 మంది చురుకైన విద్యా ర్థులను ఎంపిక చేసి శిక్షణ ఇచ్చారు. ఇందులో 84 మంది నీట్‌లో మంచి ర్యాంకులు సాధిం చడం గమనార్హం. ఈ విజయంపై ప్రవీణ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పెట్టడంపై సీఎం‡కు కృతజ్ఞతలు తెలి పారు. ‘బ్లూ క్రిస్టల్ ప్రోగ్రామ్’ మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు 140 మంది వైద్య విద్య కోర్సుల కు ఎంపికైనట్లు తెలిపారు.
మరెన్నో ప్రతిష్టాత్మక సంస్థల్లో సీట్లు
దేశంలోని పలు ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లోనూ గురుకుల విద్యార్థులు ప్రవేశాలు పొందుతున్నారు. ఈ ఏడాది 12 మంది విద్యార్థులు ఢిల్లీ యూనివర్సిటీలో, ఆరుగురు టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో ప్రవేశం పొందారని గురుకుల విద్యాసంస్థల సొసైటీ వెల్లడించింది.
ముఖ్యమంత్రి అభినందనలు
గురుకుల విద్యార్థులు పెద్దసంఖ్యలో డాక్టర్లు కాబోతుండటం గర్వంగాఉందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులను, వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి ప్రోత్సహించిన ప్రవీణ్‌కుమార్‌ను అభినందించారు. విద్యార్థులు సాధించిన ఈ విజయాలు మరిన్ని గురుకులాలు స్థాపించేందుకు ప్రేరణ ఇస్తున్నాయన్నారు.
Advertisement
Advertisement