NEET-2017
-
ఆయుష్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ
ఆన్లైన్ దరఖాస్తుకు ఈ నెల 29 వరకు గడువు సాక్షి, హైదరాబాద్: ఆయుష్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 2017–18 వైద్య విద్యా సంవత్సరానికి ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో ఆయుర్వేద, హోమియోపతి, నేచురోపతి కోర్సుల్లో చేరేందుకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. నీట్– 2017లో అర్హత సాధించిన అభ్యర్థులే దరఖాస్తు చేసుకోవాలని కోరింది. దరఖాస్తులను గురువారం ఉదయం 11 గంటల నుంచి ఈ నెల 29న సాయంత్రం 5 గంటల వరకు స్వీకరిస్తారు. వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చని రిజిస్ట్రార్ తెలిపారు. -
గురుకుల విద్యార్థులు.. కాబోయే డాక్టర్లు
- నీట్లో 84 మందికి అత్యుత్తమ ర్యాంకులు - సీఎంను కలసిన గురుకుల కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో చదువుకున్న 84 మంది విద్యార్థులు వైద్యులు కాబోతున్నారు. నీట్–2017 ఫలితాల్లో వారంతా మంచి ర్యాంకులు సాధించి.. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులకు ఎంపికయ్యే అర్హత సాధించారు. సోమవారం గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్.. సీఎం కేసీఆర్‌ను కలసి ఈ వివరాలను నివేదించారు. ఈ విద్యార్థుల్లో 55 మంది ఎస్సీ, 9 మంది ఎస్టీ విద్యార్థులు ఎంబీబీఎస్‌లో సీట్లు దక్కించుకోనుండగా... 15 మంది ఎస్సీ, ఐదుగురు ఎస్టీ విద్యార్థులు బీడీఎస్‌లో సీట్లు పొందనున్నారు. ప్రత్యేకంగా శిక్షణ నీట్ కోసం ‘ఆపరేషన్ బ్లూ క్రిస్టల్ ప్రోగ్రాం (ఓబీపీఎస్)’ పేరిట రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లోని 100 మంది చురుకైన విద్యా ర్థులను ఎంపిక చేసి శిక్షణ ఇచ్చారు. ఇందులో 84 మంది నీట్లో మంచి ర్యాంకులు సాధిం చడం గమనార్హం. ఈ విజయంపై ప్రవీణ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పెట్టడంపై సీఎం‡కు కృతజ్ఞతలు తెలి పారు. ‘బ్లూ క్రిస్టల్ ప్రోగ్రామ్’ మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు 140 మంది వైద్య విద్య కోర్సుల కు ఎంపికైనట్లు తెలిపారు. మరెన్నో ప్రతిష్టాత్మక సంస్థల్లో సీట్లు దేశంలోని పలు ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లోనూ గురుకుల విద్యార్థులు ప్రవేశాలు పొందుతున్నారు. ఈ ఏడాది 12 మంది విద్యార్థులు ఢిల్లీ యూనివర్సిటీలో, ఆరుగురు టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో ప్రవేశం పొందారని గురుకుల విద్యాసంస్థల సొసైటీ వెల్లడించింది. ముఖ్యమంత్రి అభినందనలు గురుకుల విద్యార్థులు పెద్దసంఖ్యలో డాక్టర్లు కాబోతుండటం గర్వంగాఉందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులను, వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి ప్రోత్సహించిన ప్రవీణ్‌కుమార్‌ను అభినందించారు. విద్యార్థులు సాధించిన ఈ విజయాలు మరిన్ని గురుకులాలు స్థాపించేందుకు ప్రేరణ ఇస్తున్నాయన్నారు. -
మళ్లీ మెరిసిన అమ్మాయిలు
-
మళ్లీ మెరిసిన అమ్మాయిలు
నీట్–2017 రాష్ట్ర స్థాయి ర్యాంకుల్లోనూ ప్రతిభ... ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీ కోసం ఏపీ ర్యాంకులు విడుదల సాక్షి, అమరావతి: జాతీయ స్థాయిలో ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీ కోసం 2017 మే 7న నీట్ ప్రవేశ పరీక్ష జరిగినప్పటి నుంచి రాష్ట్ర స్థాయి ర్యాంకుల కోసం ఎదురు చూసిన ఆంధ్రప్రదేశ్ అభ్యర్థుల ఉత్కంఠకు తెరపడింది. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఆదివారం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో వైస్‌చాన్స్‌లర్ టి.రవిరాజు, రిజిస్ట్రార్ డా.అప్పలనాయుడుతో కలసి రాష్ట్ర స్థాయి ర్యాంకులు విడుదల చేశారు. 2017–18 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం 65 వేల మంది పైచిలుకు అభ్యర్థులు నీట్ ప్రవేశ పరీక్ష రాయగా, 32,292 మంది అర్హత సాధించారు. అంటే 50 శాతం మంది అర్హత సాధించినట్టు స్పష్టమైంది. జాతీయ స్థాయిలో 14వ ర్యాంకు సాధించిన వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన నర్రెడ్డి మన్వితకు రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు దక్కింది. మన్విత నీట్లో 685 మార్కులు (99.99844 పర్సెంటైల్) సాధించింది. 678 మార్కులతో జాతీయ స్థాయిలో 36వ ర్యాంకు సాధించిన పావులూరి సాయి శ్వేత రాష్ట్ర స్థాయిలో రెండవ ర్యాంకును సొంతం చేసుకుంది. 675 మార్కులు సాధించిన బాలాంత్రపు ఫణిశ్రీ లాస్యకు మూడవ ర్యాంకు దక్కింది. టాప్ టెన్‌లో కూడా ఐదుగురు అమ్మాయిలు ర్యాంకులు దక్కించుకోవడం గమనార్హం. నేడు దరఖాస్తులకు నోటిఫికేషన్ నేడు (సోమవారం) ఎంబీబీఎస్ సీట్ల భర్తీ ప్రక్రియకు సంబంధించి దరఖాస్తుల ఆహ్వానానికి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వీసీ డా.రవిరాజు, రిజిస్ట్రార్ అప్పలనాయుడు విలేకరుల సమావేశంలో తెలిపారు. నోటిఫికేషన్‌ను బట్టి ఆన్లైన్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆ తర్వాత వెబ్ ఆప్షన్లకు తారీఖులు ఇస్తామని, జూలై 4వ వారంలో మొదటి విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో తొలివిడత కౌన్సెలింగ్ జులై 30తో పూర్తి చేసి ఆగస్ట్ 1 నుంచి తరగతులు ప్రారంభిస్తామన్నారు. అనంతరం కౌన్సెలింగ్ ప్రక్రియ సైతం ఆగస్ట్ 30లోగా పూర్తి చేసి సెప్టెంబర్ 1నుంచి తరగతులు ఉంటాయని, ఆ తర్వాత అడ్మిషన్లు జరగవని స్పష్టం చేశారు. ర్యాంకుల్లో స్వల్ప మార్పులు జరగొచ్చు తాజాగా విడుదల చేసిన రాష్ట్ర స్థాయి ర్యాంకులే తుది ర్యాంకులు కావని, కొద్దిగా మార్పులు జరిగే అవకాశమున్నట్టు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ అధికారులు చెప్పారు. ప్రస్తుతానికి ఏపీ నుంచి పరీక్ష రాసిన అభ్యర్థుల వివరాలు మాత్రమే తీసి మార్కుల ఆధారంగా ర్యాంకులు కేటాయించారు. ఇదిలా ఉండగా నాన్లో కల్ కోటా కింద తెలంగాణ అభ్యర్థులెవరికైనా ఇంతకంటే మంచి మార్కులు వచ్చి, ఇక్కడ చేరాలనుకుంటే తాజాగా ప్రకటించిన ర్యాంకుల్లో కొద్దిగా మార్పులు చోటుచేసుకుంటాయి. కాబట్టి కచ్చితమైన ర్యాంకులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తర్వాతే తెలిసే అవకాశమున్నట్టు చెప్పారు. కాగా, తెలంగాణలో సుమారు 44 వేల మందికి పైగా నీట్ ప్రవేశ పరీక్ష రాయగా, 27,075 మంది అర్హత సాధించినట్టు అధికారులు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర స్థాయి ర్యాంకుల జాబితాను ఆ రాష్ట్రానికి సీడీలో పంపినట్లు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ అధికారులు చెప్పారు. నేడు ర్యాంకులు ప్రకటించే అవకాశం ఉంది. -
నేడు ఏపీ నీట్ మెడికల్ ర్యాంకుల విడుదల!
విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): నీట్–2017 మెడికల్ లోకల్ (ఏపీ) ర్యాంకులను డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆదివారం విడుదల చేయనుంది. ఈ ఫలితాలను రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాసరావు చేతుల మీదుగా విడుదల చేయించేందుకు వర్సిటీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 2017 నీట్ మెడికల్ పరీక్షను సీబీఎస్ఈ (సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) నిర్వహించి గతనెల 23వ తేదీన ర్యాంకులు విడుదల చేసిన విషయం విదితమే. అయితే సీబీఎస్ఈ రాష్ట్రానికి సంబం«ధించిన ర్యాంకులు ఇవ్వాల్సి ఉంది. శనివారం రాత్రి ఏపీ ర్యాంకులతో కూడిన సీడీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి అందింది. వాస్తవానికి శనివారం రాత్రి లోకల్ (ఏపీ)ర్యాంకులు విడుదల చేయాల్సి ఉండగా, ఫలితాలకు సంబంధించిన సీడీ ఆలస్యంగా అందడంతో ఆదివారానికి వాయిదా వేశారు. ఏపీ అభ్యర్థులకు సంబంధించిన ర్యాంకులను సీబీఎస్ ఈ ప్రకటించి అందజేసినంత మాత్రాన అదే ఫైనల్ కాదని, ర్యాంకులు పొందినవారిలో చాలా మంది అభ్యర్థులు తమ వద్ద ఉన్న ధ్రువపత్రాలు స్థానిక హోదా నిరూపించకపోతే కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అర్హులు కారని వర్సిటీ అధికారులు చెబుతున్నారు. వీటన్నిటిని అధిగమించేందుకు ఆన్లైన్లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకోసం మరో రెండుమూడు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేసి తుది మెరిట్‌లిస్టును ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ప్రకటిస్తుంది. -
నీట్–2017కు రంగం సిద్ధం..విజయానికిదే మార్గం
జాతీయ స్థాయిలో ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్, డెంటల్ కళాశాలల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన.. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)–2017కు రంగం సిద్ధమైంది. పరీక్ష తేదీ సైతం వెల్లడైంది. ఈ పరీక్ష ద్వారా 2017–18లో జాతీయ స్థాయిలో అందుబాటులో ఉన్న ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీ చేపట్టనున్నారు. ఒకట్రెండు రోజుల్లో నీట్ – 2017 పూర్తి ప్రకటన విడుదలకు సీబీఎస్ఈ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో నీట్–2017లో విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలపై విశ్లేషణ.. నీట్‌ను 2013లో తొలిసారి.. 2016లో పూర్తి స్థాయిలో మరోసారి నిర్వహించినా.. అప్పటికే పలు రాష్ట్రాల్లో ప్రత్యేక ఎంట్రన్స్‌లు ముగియడంతో విద్యార్థులకు 2016లో నీట్ నుంచి ఉపశమనం లభించింది. అయితే.. 2017 నుంచి ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశించాలంటే నీట్లో ఉత్తీర్ణతను తప్పనిసరి చేశారు. నీట్ విషయంలో గతంలో ఎదురైన వ్యతిరేకతకు ప్రధాన కారణాల్లో పరీక్ష మాధ్యమం కూడా ఒకటి. ఈ నేపథ్యంలో నీట్–2017 ను ఇంగ్లిష్, హిందీతోపాటు తెలుగులో కూడా రాసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఆందోళన వీడి.. నీట్‌కు సంబంధించి పరీక్ష స్వరూపం, సిలబస్ విషయంలో తెలుగు విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. అయితే విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు. కారణం.. మారిన ఇంటర్మీడియెట్ బోర్డ్ సిలబస్ ప్రకారం.. నీట్లో పేర్కొన్న అంశాలను సులువుగా అధిగమించే అవకాశం ఉంది. అదే విధంగా పరీక్షలోనూ ఎంసెట్‌తో పోల్చితే అదనంగా ఇరవై ప్రశ్నలు ఉంటాయి. మూడు గంటల్లో సమాధానాలు రాయాలి. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఇప్పటి నుంచే విజయం దిశగా అడుగులు వేయాలి. ఏఐపీఎంటీ పరీక్ష మాదిరిగానే.. నీట్‌కు సన్నద్ధమయ్యే క్రమంలో విద్యార్థులు ముందుగా గత ఆల్ ఇండియా ప్రీ మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏఐపీఎంటీ) పరీక్షలు, వాటిలో అడిగిన ప్రశ్నలు, వెయిటేజీ లాంటి అంశాలను పరిశీలించాలి. కారణం.. నీట్‌ను కూడా ఏఐపీఎంటీ విధానంలోనే నిర్వహిస్తారు. ఇక నీట్ సిలబస్, పరీక్షలో వెయిటేజీ అంశాలను పరిగణనలోకి తీసుకుంటే గతేడాది నీట్–2లో ఇంటర్మీడియెట్ రెండేళ్ల టాపిక్స్‌కు సంబంధించి సమాన వెయిటేజీ కల్పించారు. బోటనీ, జువాలజీలతో సంయుక్తంగా పేర్కొనే బయాలజీ నుంచి బోటనీకి కొంత ఎక్కువ ప్రాధాన్యం లభించింది. ఒకవైపు ఇంటర్మీడియెట్ పరీక్షలు.. మరోవైపు నీట్ నేపథ్యంలో ఈ రెండు పరీక్షలకు ఉమ్మడిగా ప్రిపరేషన్ సాగించాలి. ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం..ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీల్లో ప్రాక్టీస్ బేస్డ్ లెర్నింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. అప్లికేషన్ ఓరియెంటేషన్, కాన్సెప్ట్ బేస్డ్ అప్రోచ్‌తో ప్రిపరేషన్ సాగించాలి. ఫిజిక్స్‌లో ఎలక్ట్రో మాగ్నటిజం, ఏసీ సర్క్యూట్స్, రే ఆప్టిక్స్, మోడ్రన్ ఫిజిక్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. కెమిస్ట్రీకి సంబంధించి కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీ డే లైఫ్, ఈథర్స్ అండ్ నార్మన్క్లేచర్, క్లీనింగ్ ఏజెంట్స్, క్లీనింగ్ యాక్షన్స్, బయలాజికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ మెగ్నీషియం అండ్ కాల్షియం, ఎస్–బ్లాక్ ఎలిమెంట్స్‌పై పట్టు సాధించాలి. బయాలజీలో.. హ్యూమన్ ఫిజియాలజీ, మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ ఫిజియాలజీ, హ్యూమన్ ఇన్సులిన్ అండ్ వ్యాక్సిన్ ప్రొడక్షన్, ట్యాక్సానమీ, నెర్వస్ సిస్టమ్, క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్, ప్లాంట్ ఫిజియాలజీ, బయోటెక్నాలజీ అప్లికేషన్స్, ఎకలాజికల్ సక్సెషన్, ఎకలాజికల్/ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్‌పై పట్టు సాధించాలి. నీట్–2017 పరీక్ష విధానం అర్హత: ఇంటర్మీడియెట్ బైపీసీలో గ్రూప్ సబ్జెక్టుల్లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. వయోపరిమితి: డిసెంబర్ 31 నాటికి 17 –25 ఏళ్లు ఉండాలి. పరీక్ష విధానం: ఇందులో మొత్తం నాలుగు విభాగాలుంటాయి. అవి.. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ (బోటనీ + జువాలజీ). మొత్తం ప్రశ్నల సంఖ్య – 180 (ఒక్కో విభాగం నుంచి 45 ప్రశ్నలు). ప్రతి ప్రశ్నకు నాలుగు మార్కుల చొప్పున మొత్తం 720 మార్కులుంటాయి. నెగెటివ్ మార్కింగ్ కూడా అమల్లో ఉంది. తప్పు సమాధానానికి ఒక మార్కు కోత విధిస్తారు. పరీక్ష వ్యవధి: మూడు గంటలు. పరీక్ష తేది: మే 7, 2017 ఫిజిక్స్ ప్రశ్నలను న్యూమరికల్ అప్రోచ్‌తో ప్రాక్టీస్ చేయాలి. కొన్ని ప్రశ్నలు గణాంక సహిత సమాచారం ఆధారంగా పరిష్కరించేలా ఉంటాయి. వీటి విషయంలో న్యూమరికల్ అప్రోచ్ కలిసొస్తుంది. అదేవిధంగా కాన్సెప్ట్స్, బేసిక్ ఫార్ములాలపై పట్టు సాధించి అప్లికేషన్ ఓరియెంటేషన్‌తో ప్రిపరేషన్ సాగించడం వల్ల మరిన్ని మార్కులు సొంతం చేసుకోవచ్చు. – డా. సీహెచ్ రామకృష్ణ, ఆర్కేస్ ఫ్రేమ్స్ ఆఫ్ ఫిజిక్స్