నీట్–2017కు రంగం సిద్ధం..విజయానికిదే మార్గం
జాతీయ స్థాయిలో ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్, డెంటల్ కళాశాలల్లో
ప్రవేశాలకు ఉద్దేశించిన.. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్
(నీట్)–2017కు రంగం సిద్ధమైంది. పరీక్ష తేదీ సైతం వెల్లడైంది.
ఈ పరీక్ష ద్వారా 2017–18లో జాతీయ స్థాయిలో అందుబాటులో
ఉన్న ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీ చేపట్టనున్నారు. ఒకట్రెండు
రోజుల్లో నీట్ – 2017 పూర్తి ప్రకటన విడుదలకు సీబీఎస్‌ఈ కసరత్తు
చేస్తోంది. ఈ నేపథ్యంలో నీట్–2017లో విజయానికి
అనుసరించాల్సిన వ్యూహాలపై విశ్లేషణ..
నీట్‌ను 2013లో తొలిసారి.. 2016లో పూర్తి స్థాయిలో మరోసారి నిర్వహించినా.. అప్పటికే పలు రాష్ట్రాల్లో ప్రత్యేక ఎంట్రన్స్‌లు ముగియడంతో విద్యార్థులకు 2016లో నీట్ నుంచి ఉపశమనం లభించింది. అయితే.. 2017 నుంచి ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశించాలంటే నీట్‌లో ఉత్తీర్ణతను తప్పనిసరి చేశారు. నీట్ విషయంలో గతంలో ఎదురైన వ్యతిరేకతకు ప్రధాన కారణాల్లో పరీక్ష మాధ్యమం కూడా ఒకటి. ఈ నేపథ్యంలో నీట్–2017 ను ఇంగ్లిష్, హిందీతోపాటు తెలుగులో కూడా రాసుకునే అవకాశం కల్పిస్తున్నారు.
ఆందోళన వీడి..
నీట్‌కు సంబంధించి పరీక్ష స్వరూపం, సిలబస్ విషయంలో తెలుగు విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. అయితే విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు. కారణం.. మారిన ఇంటర్మీడియెట్ బోర్డ్ సిలబస్ ప్రకారం.. నీట్‌లో పేర్కొన్న అంశాలను సులువుగా అధిగమించే అవకాశం ఉంది. అదే విధంగా పరీక్షలోనూ ఎంసెట్‌తో పోల్చితే అదనంగా ఇరవై ప్రశ్నలు ఉంటాయి. మూడు గంటల్లో సమాధానాలు రాయాలి. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఇప్పటి నుంచే విజయం దిశగా అడుగులు వేయాలి.
ఏఐపీఎంటీ పరీక్ష మాదిరిగానే..
నీట్‌కు సన్నద్ధమయ్యే క్రమంలో విద్యార్థులు ముందుగా గత ఆల్ ఇండియా ప్రీ మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏఐపీఎంటీ) పరీక్షలు, వాటిలో అడిగిన ప్రశ్నలు, వెయిటేజీ లాంటి అంశాలను పరిశీలించాలి. కారణం.. నీట్‌ను కూడా ఏఐపీఎంటీ విధానంలోనే నిర్వహిస్తారు. ఇక నీట్ సిలబస్, పరీక్షలో వెయిటేజీ అంశాలను పరిగణనలోకి తీసుకుంటే గతేడాది నీట్–2లో ఇంటర్మీడియెట్ రెండేళ్ల టాపిక్స్‌కు సంబంధించి సమాన వెయిటేజీ కల్పించారు. బోటనీ, జువాలజీలతో సంయుక్తంగా పేర్కొనే బయాలజీ నుంచి బోటనీకి కొంత ఎక్కువ ప్రాధాన్యం లభించింది. ఒకవైపు ఇంటర్మీడియెట్ పరీక్షలు.. మరోవైపు నీట్ నేపథ్యంలో ఈ రెండు పరీక్షలకు ఉమ్మడిగా ప్రిపరేషన్ సాగించాలి.
ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం..ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీల్లో ప్రాక్టీస్
బేస్డ్ లెర్నింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. అప్లికేషన్ ఓరియెంటేషన్, కాన్సెప్ట్ బేస్డ్ అప్రోచ్‌తో ప్రిపరేషన్ సాగించాలి. ఫిజిక్స్‌లో ఎలక్ట్రో మాగ్నటిజం, ఏసీ సర్క్యూట్స్, రే ఆప్టిక్స్, మోడ్రన్ ఫిజిక్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. కెమిస్ట్రీకి సంబంధించి కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీ డే లైఫ్, ఈథర్స్ అండ్ నార్మన్‌క్లేచర్, క్లీనింగ్ ఏజెంట్స్, క్లీనింగ్ యాక్షన్స్, బయలాజికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ మెగ్నీషియం అండ్ కాల్షియం, ఎస్–బ్లాక్ ఎలిమెంట్స్‌పై పట్టు సాధించాలి.
బయాలజీలో.. హ్యూమన్
ఫిజియాలజీ, మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ ఫిజియాలజీ, హ్యూమన్ ఇన్సులిన్ అండ్ వ్యాక్సిన్ ప్రొడక్షన్, ట్యాక్సానమీ, నెర్వస్ సిస్టమ్, క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్, ప్లాంట్ ఫిజియాలజీ, బయోటెక్నాలజీ అప్లికేషన్స్, ఎకలాజికల్ సక్సెషన్, ఎకలాజికల్/ఎన్విరాన్‌మెంటల్ ఇష్యూస్‌పై పట్టు సాధించాలి.
నీట్–2017 పరీక్ష విధానం
అర్హత: ఇంటర్మీడియెట్ బైపీసీలో గ్రూప్ సబ్జెక్టుల్లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
వయోపరిమితి: డిసెంబర్ 31 నాటికి 17 –25 ఏళ్లు ఉండాలి.
పరీక్ష విధానం: ఇందులో మొత్తం నాలుగు విభాగాలుంటాయి. అవి.. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ (బోటనీ + జువాలజీ).
మొత్తం ప్రశ్నల సంఖ్య – 180 (ఒక్కో విభాగం నుంచి 45 ప్రశ్నలు). ప్రతి ప్రశ్నకు నాలుగు మార్కుల చొప్పున మొత్తం 720 మార్కులుంటాయి. నెగెటివ్ మార్కింగ్ కూడా అమల్లో ఉంది. తప్పు సమాధానానికి ఒక మార్కు కోత విధిస్తారు.
పరీక్ష వ్యవధి: మూడు గంటలు.
పరీక్ష తేది: మే 7, 2017
ఫిజిక్స్ ప్రశ్నలను న్యూమరికల్ అప్రోచ్‌తో ప్రాక్టీస్ చేయాలి. కొన్ని ప్రశ్నలు గణాంక సహిత సమాచారం ఆధారంగా పరిష్కరించేలా ఉంటాయి. వీటి విషయంలో న్యూమరికల్ అప్రోచ్ కలిసొస్తుంది. అదేవిధంగా కాన్సెప్ట్స్, బేసిక్ ఫార్ములాలపై పట్టు సాధించి అప్లికేషన్ ఓరియెంటేషన్‌తో ప్రిపరేషన్ సాగించడం వల్ల మరిన్ని మార్కులు సొంతం చేసుకోవచ్చు.
– డా. సీహెచ్ రామకృష్ణ,
ఆర్‌కేస్ ఫ్రేమ్స్ ఆఫ్ ఫిజిక్స్