బళ్లారి రూరల్: విమ్స్ ఆవరణలోని ప్రభుత్వ దంతవైద్య కళాశాల విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిన ఘటన శుక్రవారం వెలుగు చూసింది. కౌల్‌బజార్ పోలీసులు తెలిపిన వివరాలు... బెంగళూరుకు చెందిన పద్మావతి(23) బళ్లారిలోని విమ్స్ ఆవరణలోని ప్రభుత్వ దంతవైద్య కళాశాలలో ఫైనలియర్ చదువుతూ హాస్టల్‌లో ఉంటోంది. బుధవారం ముగిసిన ఫైనలియర్ పరీక్షలు కూడా రాసింది.
ప్రాక్టికల్ పరీక్షలు జరగాల్సి ఉంది. ఫైనలియర్ పాసైతే హౌస్‌సర్జన్‌గా ప్రవేశం పొందవచ్చు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి హాస్టల్ కొత్తభవనం పైనుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకొంది. అయితే పద్మావతి కొంతకాలంగా మానసిక అస్వస్థతతో బాధపడుతోందని పోలీసులు తెలిపారు. పద్మావతికి తోడుగా తల్లి కూడా హాస్టల్‌లో ఉంటోంది. తల్లిని కొబ్బరిబొండాం తెమ్మని చెప్పి పంపి ఆమె ఆత్మహత్యకు పాల్పడింది.
కొబ్బరి బొండాం తెచ్చిన తల్లి కూతురు కోసం హాస్టల్ అంతా గాలించింది. చివరికి భవనం కింద పద్మావతి మృతదేహాన్ని కనుగొన్నారు. తమకు అందిన సమాచారంతో పోలీసులు వెళ్లి పరిశీలించి కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. దంత వైద్యవిద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది పద్మావతి మృతదేహాన్ని చూసి భోరున విలపించారు.
ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com
Comments
Please login to add a commentAdd a comment