బీ కేటగిరీ సీట్లకు ‘బ్యాంక్ గ్యారంటీ ఏడాదే’
నాలుగేళ్ల నుంచి ఏడాదికికుదిస్తూ సర్కారు ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీల్లో బీ కేటగిరీ వైద్య సీట్లు పొందిన విద్యార్థులకు ఊరట లభించింది. మొదటి ఏడాది ఫీజుతోపాటు ఎంబీబీఎస్‌కు నాలుగేళ్లు, బీడీఎస్‌కు మూడేళ్లు బ్యాంకు గ్యారంటీ చూపాలని ప్రైవేటు మెడికల్ కళాశాల యాజమాన్యాలకు అనుగుణంగా గతంలో జారీ చేసిన జీవోను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం మరో జీవో జారీ చేసింది. ఒక ఏడాదికి మాత్రమే గ్యారంటీ చూపితే సరిపోతుందని తాజా జీవోలో స్పష్టం చేసింది. నాలుగేళ్ల బ్యాంకు గ్యారంటీపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత రావడం తెలిసిందే.
దీంతో ఈ విషయంపై వైద్య మంత్రి లక్ష్మారెడ్డి ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వం వైపు నుంచి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. బీ కేటగిరీ సీట్ల భర్తీ సందర్భంగా గతంలో విడుదల చేసిన జీవోలో మార్పులు చేయాల్సిన అవసరముందని అధికారులు తెలపడంతో ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించి అత్యవసరంగా ‘ఏడాదికే బ్యాంకు గ్యారంటీ’ని కుదిస్తూ సవరింపు ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీచేశారు.
దీంతో బుధవారం రాత్రి ‘ప్రతి ఏడూ వచ్చే ఏడాది ట్యూషన్ ఫీజును వైద్య కళాశాలలు బ్యాంకు గ్యారంటీగా స్వీకరించొచ్చు’ అని సవరిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. తెలంగాణలోని ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీల్లో 35 శాతం బీ కేటగిరీ సీట్లకు ప్రైవేటు యాజమాన్యాల నేతృత్వంలో కౌన్సెలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ నెలాఖరు నాటికి బ్యాంకు గ్యారంటీ ఇవ్వ డానికి గడువు విధించడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనలో మునిగిపోయారు.
ప్రభుత్వ తాజా నిర్ణయంతో వారంతా ఊపిరిపీల్చుకున్నారు. మరోవైపు ఈ నెలాఖరు నాటికి బ్యాంకు గ్యారంటీకి పెట్టిన గడువు తేదీని పెంచాలని విద్యార్థులు కోరుతున్నారు. ఈ వారంలో సెలవులు ఉండటంతో బ్యాంకు గ్యారంటీ తీసుకోవడం కష్టమని అంటున్నారు. దీనిపై మంత్రి స్పందిస్తూ ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాలతో మాట్లాడతానని చెప్పారు.