ఎయిర్‌హోస్టెస్ నుంచి హీరోయిన్‌గా...
రాజమహేంద్రవరం : తెలుగు చిత్రపరిశ్రమలో తనకు గుర్తింపు వచ్చిందని హీరోయిన్ రిచా పనాయ్ అన్నారు. సునీల్ హీరోగా నటించిన ‘ఈడు గోల్డ్ ఎహే’ సినిమా పాట విడుదల సందర్భంగా రాజమహేంద్రవరం వచ్చిన ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... ‘మా సొంతూరు లక్నో. చదువుకునే సమయంలో సినిమాలపై ఆసక్తి కలిగింది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్‌హోస్టెస్ పనిచేసేదాన్ని. మనసులో ఉన్న కోరికతో సినిమాల్లో ప్రయత్నం చేశా.
మలయాళం సినిమా ‘వాడమల్లి’లో తొలి అవకాశం వచ్చింది. తెలుగులో తొలిసారిగా అల్లరి నరేష్ హీరోగా నటించిన యముడికి మొగుడు చిత్రంలో నటించాను. ఆ తర్వాత చందమామ కథలు, మనసును మాయ చేయకే ఉన్నాయి. లవకుశ విడుదలవ్వాలి. డబ్బు అనేది అందరికీ అవసరమే. కాని మంచి పాత్ర వస్తే దానిమాట పక్కనపెడతా. ‘ఈడు గోల్డ్ ఎహే’ సినిమాలో మంచిపాత్ర చేశాను. డ్రీమ్ రోల్ అంటూ ఏమీ లేదు. గుర్తింపు వచ్చే ఏ పాత్ర అయినా చేస్తా. నంబర్ వన్ హీరోయిన్‌గా స్థిరపడతా.
ఎంతో ఇష్టపడి చేసిన సినిమా ‘ఈడు గోల్డ్ ఎహే’
విలేకరుల సమావేశంలో హీరో సునీల్
అశోకా థియేటర్‌లో పాట విడుదల
తాను నటించిన సినిమాలన్నింటిలో ‘ఈడు గోల్డ్ ఎహే’ ఎంతో ఇష్టపడి చేశానని హీరో సునీల్ అన్నారు. ఆ చిత్రం ఆడియో విడుదల సందర్భంగా రాజమహేంద్రవరంలోని షెల్టాన్ హోటల్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ సినిమా యూనిట్ పాల్గొంది. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ మర్యాద రామన్న తర్వాత అంతటి మంచి సినిమా ‘ఈడు గోల్డ్ ఎహే’ అన్నారు. హాస్యం, థ్రిల్, క్రైంతో కూడుకుని కుటుంబ మొత్తాన్ని ఆహ్లాదపరిచేలా కథ ఉంటుందన్నారు.
హీరోయిన్ రిచాపనాయ్ మాట్లాడుతూ ఈ చిత్రంతో తనకు పేరు, గుర్తింపు వస్తుందన్నారు. దర్శకుడు వీరు పోట్ల మాట్లాడుతూ రూ.10 కోట్లతో ఈ సినిమా తీశామని, పెద్ద సినిమాల కోవలోనే విలువలు ఎక్కడా తగ్గకుండా తెరకెక్కించామన్నారు. సహాయ నటుడు బెనర్జీ, విలన్ చరణ్ మాట్లాడారు. అనంతరం రాత్రి అశోక థియేటర్‌లో మూడో పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సందర్బంగా హీరో సునీల్‌ను వింటేజ్ క్రియేషన్స్ నిర్వాహకుడు జేకే రామకృష్ణ పూలమాలలతో అభినందించారు.