క్లబ్‌ల మూత.. అద్దె ఇళ్ల వేట
Published Tue, Jul 25 2017 11:29 PM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM
జిల్లాలోని క్లబ్‌లలో పేకాట బంద్
నిర్వాహకుల్లో స్థావరాల కలవరం
నివాస గృహాల్లో జూద శిబిరాలు
రోజుకు రూ.1.50 లక్షల వరకు అద్దె చెల్లిస్తున్న వైనం
పోలీసుల దాడులకూ వెరవని జూదరులు
భీమవరం: జిల్లాలోని క్లబ్‌లు మూతపడటంలో జూద నిర్వాహకులు అద్దె ఇళ్ల వేటలో పడ్డారు. దీంతో నివాస గృహాలు పేకాట స్థావరాలుగా మారుతున్నాయి. పేకాటపై పోలీసులు దాడులు చేస్తున్నా ఏ మాత్రం పట్టించుకోని జూదగాళ్లు యథేచ్ఛగా తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. క్లబ్‌లు మూసివేసిన నేపథ్యంలో నివాస గృహాలు, రెస్ట్‌హౌస్‌ల్లో పేకాట ఆడుకునేందుకు రోజుకు లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
జిల్లాలో 15 వరకు అనుమతి పొందిన క్లబ్‌లు
జిల్లాలో భీమవరం, ఏలూరు, పాలకొల్లు, నరసాపురం, తణుకు, కొవ్వూరు, తాడేపల్లిగూడెం, నారాయణపురం తదితర ప్రాంతాల్లో సుమారు 15 వరకు అనుమతి పొందిన రిక్రియేషన్ క్లబ్‌లు ఉన్నాయి. వీటిలో చాలా చోట్ల బెట్టింగ్‌లు లేకుండా పేకాట ఆడుకోవడానికి కోర్టు అనుమతిచ్చింది. అలాగే క్లబ్‌ల్లో వివిధ రకాల స్పోర్ట్స్ నిర్వహిస్తుంటారు. కొన్ని క్లబ్‌ల్లో డైరెక్ట్‌గా నగదు పెట్టి పేకాట ఆడకపోయినా క్వాయిన్స్‌ను ఉపయోగించి బెట్టింగ్‌లు నిర్వహించి అనంతరం సాయంత్రం క్లబ్‌లు మూసివేసే సమయంలో కౌంటర్ నుంచి సొమ్ములు తీసుకుని వెళ్లిపోవడం పరిపాటిగా మారింది. క్లబ్‌ల్లో పేకాట వంటి జూదంతోపాటు మద్యం సేవించడం సర్వసాధారణమైంది.
కొత్త ఎస్పీ రాకతో పేకాట బంద్
జిల్లా ఎస్పీగా రవిప్రకాష్ గతనెలలో బాధ్యతలు స్వీకరించప్పటి నుంచి క్లబ్‌ల్లో పేకాట బంద్ అయింది. దీంతో అర్ధరాత్రి వరకు తెరచి ఉంచే క్లబ్‌లు రాత్రి 8 గంటలకే మూతపడుతున్నాయి. ఎస్పీ ఆదేశాలతో పోలీసులు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో జూద శిబిరాలపై దాడులు చేసి లక్షలాది రూపాయలు స్వాధీనం చేసుకోవడమేగాక పేకాటరాయుళ్లును అరెస్టుచేసి కోర్టులో హాజరుపరుస్తున్నారు. దీనిలో భాగంగానే భీమవరం పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న కొమరాడ గ్రామంలో పేకాట శిబిరంపై దాడిచేసి లక్షల రూపాయలు స్వాధీనం చేసుకోవడం, ఏలూరులో రెవెన్యూ అధికారులను అరెస్టు చేయడం చర్చనీయాంశంగా మారడంతో క్లబ్‌ల నిర్వహకులు తాత్కాలికంగా క్లబ్బుల్లో పేకాట నిలిపివేశారు. ఎలాగైనా ఎస్పీని ప్రసన్నం చేసుకుని గతంలో మాదిరిగా క్లబ్‌ల్లో పేకాటలు నిర్వహించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. కొందరు అధికారపార్టీ ప్రజాప్రతినిధులు తెరవెనుక చక్రం తిప్పుతున్నట్టు తెలుస్తోంది.
పెద్ద మొత్తంలో అద్దె చెల్లింపు
క్లబ్‌ల్లో పేకాట కార్యకలాపాలు నిలిచిపోవడంతో కొందరు నిర్వాహకులు పట్టణాలు, గ్రామాల్లో సైతం విశాలమైన భవనాలను అద్దెకు తీసుకుని పేకాట స్థావరాలుగా మారుస్తున్నారు. భీమవరం వంటి పట్టణంలో ఇల్లు లేదా రెస్ట్‌హౌస్‌లకు రోజుకు అద్దె రూ.50 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు చెల్లిస్తున్నట్టు తెలిసింది. పెద్ద మొత్తంలో నగదు చేతులు మారుతుండటంతో అద్దె చెల్లించడానికి వెనుకంజ వేయడం లేదని సమాచారం. రహస్యంగా నిర్వహించే ఇటువంటి స్థావరాల నిర్వహణపై పోలీసు సిబ్బంది ప్రోత్సాహం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. కొందరు రాజకీయ నాయకులు, పెద్ద వ్యాపారులు, డాక్టర్లు వంటి ఉన్నత వర్గాల వారు పేకాట శిబిరాలను తెరవెనుక నుంచి నడిపిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎస్పీ రవిప్రకాష్ ఇటువంటి స్థావరాల నిర్వహణపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
Advertisement
Advertisement