రిషి వ్యాలీ.. చదువులు జాలీ
రిషి వ్యాలీ.. చదువులు జాలీ
Published Sun, Mar 12 2017 11:16 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
అమలు కానున్న నూతన విద్యావిధానం
ఉపాధ్యాయ సంఘాల హర్షం
భానుగుడి (కాకినాడ సిటీ) : 30 ఏళ్లనాటి విద్యావిధానానికి మళ్లీ మహర్దశ రానుంది. ఒకప్పటి ప్రాచీన విద్యావిధానాన్ని రాష్ట్రమంతటా అమలు చేయాలని ప్రభుత్వం సాహాసోపేత నిర్ణయం తీసుకుంది. రిషివ్యాలీ రివర్ విద్యావిధానానికి కొన్ని మెరుగులు దిద్దనుంది. తొలుత ఎంపిక చేసిన పాఠశాలల్లోను, దశలవారీగా మిగిలిన అన్ని పాఠశాలల్లోను ఈ పద్ధతిని అమలు పర్చనుంది. ఇందుకోసం శిక్షణ కార్యక్రమాలకు విద్యాశాఖ శ్రీకారం చుట్టింది.
ప్రతి మండలానికి రెండు చొప్పున
జిల్లాలో 330 ప్రాథమిక, 414 ప్రాథమికోన్నత, 615 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఇందులో తొలుత ఒకటి, రెండు తరగతులకు ఫైలట్ ప్రాజెక్టుగా రిషివ్యాలీ విధానాన్ని అమలు చేయనున్నారు. అనంతరం మూడు నుంచి ఐదు తరగతులకు ఈ విధానాన్ని కొనసాగిస్తారు. ప్రతి మండలానికి రెండు చొప్పున జిల్లాలో 128 పాఠశాలల్లో ఈ విధానం అమలు కానుంది. ఈ నెల 11న అమరావతిలో రాజీవ్‌విద్యామిషన్ పీవోలు, ఏఎంవోలు రిషివ్యాలీ రివర్ (రిషివ్యాలీ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసోర్సెస్)పై అవగాహన కార్యక్రమానికి హాజరయ్యారు. విద్యాశాఖ ఆదేశాల మేరకు సోమవారం (ఈ నెల 13) నుంచి అన్ని పాఠశాలల ఉపాధ్యాయులకు దశలవారీగా శిక్షణ ఇవ్వనున్నారు. ఈ విద్యావిధానానికి ఆనందలహరి అభ్యసన అనే పేరును ఖరారు చేశారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి పూర్తిస్థాయిలో జిల్లాలోని అన్ని మండలాలకు విస్తరించనున్నారు.
రిషివ్యాలీ రివర్ విద్య అంటే..
రివర్ విద్యలో నాలుగో తరగతి వరకు పాఠ్యపుస్తకాలు ఉండవు. బ్యాగుల మోత కూడా లేదు. కార్డులు, బొమ్మలు, ఆటపాటల ద్వారా విద్యావిధానం సాగుతుంది. విద్యార్థులకు బడి అంటే భయం పోతుంది. డ్రాపౌట్స్ సమస్య నుంచి గట్టెక్కే అవకాశాలున్నాయి. విద్యార్థుల శ్రద్ధంగా చదువుకుంటే సహచరులతో పనిలేకుండా ముందు పాఠాలకు వెళ్లిపోవచ్చు. చదువులో ఏ స్థాయిలో ఉండేది రివర్ విద్య ద్వారా స్పష్టంగా తెలుసుకోవచ్చు. బడికి పిల్లలను ఆకర్శించడమే కాకుండా బడి వాతావారణం సైతం ఈ విద్యావిధానంతో మారనుంది. బృందాలుగా విద్యార్థులు చదువుకోవచ్చు. తద్వారా ఆలోచనలను పంచుకునే వెసులుబాటు అధికంగా ఉంటుంది. వెనుకబడిన చోట, అవసరం ఉన్న చోట విద్యార్థిని ప్రోత్సహించడానికి ఆస్కారం ఉంది.
పక్కరాష్ట్రాల్లో అమలు
తమిళనాడులో ఏబీఎల్ (యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్), కర్ణాటకలో నలి–కలి, కేరళలోని రెండు జిల్లాల్లో ఎప్పుడో ఈ విద్యావిధానాన్ని అమలు చేశారు. మన దేశంలోని 18 రాష్ట్రాలతో పాటు జర్మనీ, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఇథోపియా, ఆఫ్రికా ఐవరీ కోస్ట్, స్విట్జర్లాండ్ దేశాల్లో ఈ విధానం అమలవుతోంది.
శిక్షణ అనంతరం నిర్ణయం
పాఠశాలల ఎంపికకు సంబంధించి విద్యాశాఖాధికారితో శిక్షణ అనంతరం సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటాం. ఈ విద్యావిధానం ద్వారా సరికొత్త ఫలితాలను అందుకునేందుకు సమన్వయంతో ముందుకు వెళతాం. జిల్లావ్యాప్తంగా సదస్సుల ద్వారా ఉపాధ్యాయుల్లో అవగాహనకు కృషిచేస్తాం. - మేకా శేషగిరి, రాజీవ్ విద్యామిషన్ పీవో
ఉత్తమ ఫలితాలు సా«ధ్యమే
రిషివ్యాలీ విద్యావిధానంతో ఉత్తమ ఫలితాలు సాధ్యమే. విద్యార్థుల్లో విషయ చర్చకు ఈ విధానంలో అధిక ప్రాధాన్యం ఇచ్చారు. చేయడం ద్వారా నేర్చుకోవడం వల్లఎక్కువకాలం విద్యార్థికి జ్ఞాపకం ఉండే అవకాశం ఉంది. శిక్షణ అనంతరం పాఠశాలల ఎంపిక, శిక్షణ కార్యక్రమాలపై ప్రణాళిక వివరిస్తాం. - అబ్రహం, డీఈవో
Advertisement