
సీఎం చంద్రబాబుకు రిషితేశ్వరి తండ్రి లేఖ
గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో ఆత్మహత్యకు పాల్పడిన రిషితేశ్వరి కేసులో నిందితులకు శిక్ష పడే వరకూ తన పోరాటం కొనసాగిస్తానని తండ్రి మురళీ కృష్ణ స్పష్టం చేశారు. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఆయన గురువారం లేఖ రాశారు. తన కూతురు రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో అనేక అనుమానాలున్నాయని పేర్కొన్నారు. రిషితేశ్వరిని మరికొందరు సీనియర్లు వేధించారని ఆరోపణలున్నా.. ఎటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేదన్నారు.
ఈ కేసులో ప్రిన్సిపాల్ బాబురావు పాత్ర కన్పిస్తున్నా.. అతనిపై కేసు ఎందుకు నమోదు చేయడంలేదని లేఖలో ప్రశ్నించారు. కేసును లోతుగా దర్యాప్తు చేసి అసలు విషయాలను బయటకు తేవాలన్నారు. ఆర్థికసాయం కోసం కేసులో ఎవరితో రాజీ పడే ప్రసక్తే లేదని లేఖ ద్వారా చంద్రబాబుకు తెలిపారు.
లేఖలో రిషితేశ్వరి తండ్రి మురళీ కృష్ణ ప్రధానంగా ప్రస్తావించినవి..
*ప్రిన్సిపాల్ బాబూరావు పాత్ర కన్పిస్తున్నా.. అతనిపై కేసు ఎందుకు నమోదు చేయలేదు?
*ఫ్రెషర్స్ డే రోజు బాబూరావు ఉద్దేశపూర్వంకగానే రిషితేశ్వరికి శ్రీనివాస్ తో అవార్డు ఇప్పించారు
*రిషితేశ్వరితో అసభ్యంగా ప్రవర్తించిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?
*రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకున్న గది వద్దకు ముందుగా ప్రిన్సిపాల్ బాబు వెళ్లారు
*పోలీసులకు సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని ఎందుకు తరలించారు?
*బాలసుబ్రహ్మణ్యం కమిటీ నివేదికలో ర్యాగింగ్ జరిగిందని తేల్చినప్పటికీ బాబురావుపై ఎందుకు కేసు నమోదు చేయలేదు?
*గతంలో బాబూరావుపై బీఆర్కే ఫ్యాకల్టీ డేవిడ్ రాజు గవర్నర్ కు ఫిర్యాదు చేసినప్పటికీ ఎందుకు లోతైన విచారణ జరగలేదు?
*పోలీసులు చార్జిషీటు వేయకముందే వీటిపై విచారణ జరిపి ప్రిన్సిపాల్ బాబూరావుపై కేసు నమోదు చేయాలి
*సిట్టింగ్ జడ్జితో కేసును విచారించాలి