పశ్చిమగోదావరిలో రోడ్డు ప్రమాదం: 9 మందికి గాయాలు
కృష్ణాజిల్లా నూజివీడు మండలం లైన్‌తండాకు చెందిన కొందరు కూలీలు పనుల కోసం రెండురోజుల కిందట ఏలూరు మండలం చొదిమెళ్ల వచ్చారు. అక్కడ పనులు ముగిసిన అనంతరం వారంతా తిరిగి సొంత ఊరు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. తొమ్మిది మంది తమ బంధువు వడిత్యా నాగరాజు ఆటోలో బయలుదేరారు. ఆటో దుగ్గిరాల డెంటల్ కాలేజీ సమీపంలోకి వచ్చేసరికి ఎదురుగా లారీ వెళ్తుంది. లారీ డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో వెనుక ఉన్న ఆటో ఢీకొట్టింది.
దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న బాణోతు సంకురమ్మ, వడిత్యా రాధ, వడిత్యా నరసింహులు, బాణోతు చిలకమ్మ, వడిత్యా బుజ్జి, ఆటో డ్రైవర్ వడిత్యా నాగరాజు, వడిత్యా స్వామి , వడిత్యా ప్రసాద్, వడిత్యా శ్రీను గాయపడ్డారు. వీరిలో మహిళ వడిత్యా బుజ్జి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది బాధితులను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్షతగాత్రులకు చికిత్స అందించిన వైద్యులు తలకు తీవ్ర గాయమైన బుజ్జిని మెరుగైన చికిత్స కోసం విజయవాడ తీసుకువెళ్లాలని బంధువులకు సూచించారు.