డేంజర్ జోన్స్ | road accidents in basara turning points | Sakshi
Sakshi News home page

డేంజర్ జోన్స్

Published Sat, Jun 11 2016 4:44 AM | Last Updated on Mon, Sep 4 2017 2:10 AM

డేంజర్ జోన్స్

డేంజర్ జోన్స్

అడుగడుగునా మృత్యుఘంటికలు    
ప్రాణాలు బలిగొంటున్న మూలమలుపులు  
కాగితాల్లోనే ఫోర్‌లేన్ రహదారి

బాసర మహాపుణ్య క్షేత్రం. చదువుల తల్లి సరస్వతి దేవిని దర్శించుకోవడానికి,అక్షరాభ్యాసం కోసం నిత్యం వేలాది మంది భక్తులు, వందలాది వాహనాల్లో రాత్రిపగలు రాకపోకలు సాగిస్తుంటారు. ఆదిలాబాద్ జిల్లావాసులు మినహా మిగతా తెలంగాణలోని మొత్తం జిల్లాల ప్రజలు రోడ్డు మార్గం ద్వారా నిజామాబాద్ జిల్లా మీదుగానే బాసరకు వెళ్లాలి. రహదారులు ఇరుకుగా, అధికంగా మూలమలుపులు ఉండటం, కాల్వలు, కల్వర్టులు, ఎత్తుపళ్లాలు ప్రమాదకరంగా ఉన్నారుు. ఫలితంగా ప్రమాదాలు జరిగి అనేక మంది మృత్యువాత పడుతున్నారు. ఈ మార్గంలో ప్రమాదం జరగని గ్రామం లేదంటే   ఆశ్చర్యం కలగక మానదు. జానకంపేట నుంచి యంచ వరకు రూ.50 కోట్ల వ్యయంతో  ఫోర్‌లేన్ రోడ్డు కోసం  రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయించింది. కానీ,  మోక్షం లభించలేదు. ఫోర్‌లేన్ రహదారి పూర్తరుుతే ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది.

నవీపేట : దక్షిణ భారతంలో సరస్వతి అమ్మవారు కొలువైన ఏకైక ఆలయం ఆదిలాబాద్ జిల్లా బాసరలో ఉంది. అమ్మవారిని దర్శించుకోవడానికి నిత్యం వేలాది మంది వెళ్తుంటారు. ప్రత్యేక రోజుల్లో లక్షలాది మంది సరస్వతి మాతను దర్శించుకుంటారు. ఈ ఆలయానికి ప్రధాన మార్గం నవీపేట మీదుగా వెళుతుంది. వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. రోజూ వందలాది వాహనాలు వెళ్తున్నాయి. బాసరకు రైలు మార్గం ఉన్నప్పటికీ అధిక సంఖ్యలో భక్తులు రహదారి వెంబడే వస్తున్నారు. ఈ దారిలో ఎన్నో మూలమలుపులు ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.

ప్రమాదకర మలుపులు..
బాసర పుణ్య క్షేత్రానికి వచ్చే భక్తులకు అక్కడి వరకు విస్తరించుకున్న రహదారి వెంబడి ఉన్న మలుపులు భయానికి గురి చేస్తున్నాయి. నిజామాబాద్, జానకంపేటలను దాటాక నవీపేట మండలంలోని అబ్బాపూర్(ఎం), అభంగపట్నం, నవీపేట, నాగేపూర్, ఫకీరాబాద్, మిట్టాపూర్, యంచల మీదుగా బాసరకు ప్రధాన రహదారి ఉంది. నవీపేట మండలంలోని వివిఈ గ్రామాల వద్ద మలుపులున్నాయి. ఈ మలుపుల వద్దే ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మూలమలుపులను గమనించే సరికే ప్రమాదం జరిగిపోతోంది. రహదారి వెంబడి ఉన్న అన్ని గ్రామాల పరిధిలో జరిగిన వేరువేరు రోడ్డు ప్రమాదాలలో ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మరెందరో గాయాలపాలయ్యారు. ఫలానా ఊరు దగ్గర ప్రమాదమే జరగలేదు అన్న గ్రామమే లేదు.

నవీపేట, నాగేపూర్, మిట్టాపూర్‌లలో..
ప్రధానంగా నవీపేట, నాగేపూర్, మిట్టాపూర్‌లలోని మలుపుల వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆయా గ్రామాల్లోని మలుపుల వద్ద ఏటా పదుల సంఖ్యలో ప్రమాదాలబారిన పడుతున్నారు. నాగేపూర్ మూల మలుపు మరింత డేంజర్‌గా మారింది. ఒక్కసారిగా యూటర్న్ తీసుకోవాల్సిన పరిస్థితులు ఉండడంతో.. ఈ దారిపై అవగాహనలేని డ్రైవర్లు వాహన వేగాన్ని అదుపు చేయలేకపోతున్నారు. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎదురెదురుగా వాహనాలు అంతే వేగంతో వస్తే రక్తపుటేరులు పారుతున్నాయి. ఇటీవల నాగేపూర్ మూలమలుపు వద్ద రెండు వేరువేరు ప్రమాదాలలో అయిదుగురికి మించి ప్రాణాలు కోల్పోయారు.

 నవీపేట మూలమలుపు వద్ద వాహనాలను అదుపు చేసే ప్రయత్నంలో భారీ లోడ్‌తో వెళ్తున్న వాహనాలు అదుపుతప్పి బోల్తా పడుతున్నాయి. ఆ సమయంలో రోడ్డుపై ఎవరైనా ఉంటే అంతే.. మిట్టాపూర్ దగ్గర రోడ్డు ఎత్తుపల్లాలుగా ఉండడంతో అవతలి వైపు నుంచి వాహనాలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏటవాలు వైపు దిగే ప్రయత్నంలో వాహనాలు అదుపు తప్పి ఎదురుగా వచ్చే వాహనాలను ఢీకొంటున్నాయి. బైక్‌లపై వచ్చే భక్తులు పదుల సంఖ్యలో ఇక్కడ ప్రాణాలు కోల్పోయారు.

 కాలువలు, కల్వర్టులతో..
బాసర రహదారి వెంబడి నిజాంసాగర్ ప్రధాన, ఉప కాలువలు ఉన్నాయి. నవీపేటలో రహదారికి సమాంతరంగా డి -50 ప్రధాన కాలువ ఉండగా.. మిగిలిన ప్రాంతాలలో ఆ కాలువ ఉప కాలువలు, కల్వర్టులు ఉన్నాయి. రోడ్డు కింది నుంచి కాలువలు ఉండడంతో రోడ్డుకు ఇరువైపులా కల్వర్టులు నిర్మించారు. ఎదురుగా భారీ వాహనాలు వస్తే.. రోడ్డు దిగే ప్రయత్నం చేయగా వాహనదారులు ఈ కల్వర్టులను ఢీకొని ప్రమాదాలబారిన పడుతున్నారు. మూడేళ్ల క్రితం నాగేపూర్ శివారులో కల్వర్టును ఢీకొని ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. అలాగే ఏడేళ్ల కిందట బాన్సువాడ నుంచి నవీపేట వైపు వస్తున్న ఆటో అబ్బాపూర్(ఎం) దగ్గర కాలువలో పడిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఈ కాలువల వద్ద ఎలాంటి ప్రమాద హెచ్చరికల బోర్డు, స్పీడ్ బ్రేకర్లు లేవు. అభంగపట్నం, అబ్బాపూర్(ఎం) గ్రామాలలోనూ స్పీడ్ బ్రేకర్లు లేవు.

ట్రాఫిక్ సమస్య..
బాసర భక్తులకు మూలమలుపులు ప్రమాదాలను తెచ్చిపెడుతుండగా.. మండల కేంద్రంలోని రైల్వేగేటు, మేకల సంతలు ట్రాఫిక్‌కు అంతరాయాన్ని కలిగిస్తున్నాయి. దూర ప్రాంతాల నుంచి వాహనాలపై వచ్చే భక్తులు నవీపేటలో గేటు పడితే ఐదారు నిమిషాలు ఆగాల్సిందే. రైళ్ల రాకపోకలు పెరగడంతో ఒక్కోసారి క్రాసింగ్ ఉంటుంది. అప్పుడు పదినిమిషాల వరకు ఆగాల్సి వస్తుంది. రైలు వెళ్లగానే గేటుకు ఇరువైపులా ఆగిన వాహనదారులు ఒక్కసారిగా ముందుకు వెళ్లేందుకు పోటీపడుతున్నారు.

ఈ సమయంలో ఒక్కోసారి స్వల్ప ఘర్షణలు జరుగుతున్నాయి. రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మిస్తే తమకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని స్థానికులు పేర్కొంటున్నారు. అలాగే మండల కేంద్రంలోని బాసర రహదారికి ఆనుకుని ప్రతి శనివారం మేకల సంత జరుగుతుంది. ఆ సమయంలో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. ఇక్కడి సంత ప్రాంగణాన్ని నవీపేట శివారులోని ఆశానగర్‌కు తరలించాలని గతంలో కలెక్టర్‌గా పనిచేసిన క్రిస్టీనా జెడ్ చోంగ్తూ జారీ చేసిన ఆదేశాలు బుట్టదాఖలే అయ్యాయి.

ఈనెలాఖరు నాటికి టెండర్లు పూర్తి.. - గోపాల్ రెడ్డి, డీఈఈ, ఆర్‌అండ్‌బీ, బోధన్
యంచ నుంచి ఫకీరాబాద్‌కు నాలుగు లేన్ల రోడ్డు వేస్తాం. దానికి నిధులు మంజూరయ్యాయి. అన్ని సర్వేలు పూర్తయ్యాయి. జాతీయ రహదారికి ప్రతిపాదనలు పంపడంతో ఆలస్యమైంది. ఈనెల చివరికల్లా టెండర్లు పూర్తవుతాయి. వచ్చే నెలలో పనులను ప్రారంభిస్తాం. వర్షాలు ఆటంకం కలిగించకుంటే సకాలంలో పనులు పూర్తి చేస్తాం. కల్వర్టులు వెడల్పు పెంచుతాం. అన్ని మలుపుల వద్ద హెచ్చరిక బోర్టులు ఏర్పాటు చేస్తాం.

ప్రమాదాల నివారణకు చర్యలు - వెంకటేశ్వర్‌రావు, నిజామాబాద్ రూరల్ సీఐ
బాసర రహదారి వెంబడి ప్రమాదాలను నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులతో సమీక్షిస్తాం. రహదారి వెంట ఉన్న ముళ్ల పొదలను తొలగిస్తాం. గుంతలను పూడ్చివేయిస్తాం. ఓవర్ టేక్‌ల విషయంలో వాహనదారులకు అవగాహన కల్పిస్తాం. రహదారి వెంట రాత్రింబవళ్లు పోలీస్ పహారా ఉంటుంది. వాహనదారులు పోలీసులకు సహకరించాలి.

నాలుగు లేన్ల రోడ్డుకు మోక్షమెప్పుడో?
జానకంపేట నుంచి యంచ వరకు రూ. 50 కోట్ల వ్యయంతో నాలుగు లేన్ల రోడ్డు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయించింది. రోడ్లు, భవనాల శాఖ అధికారులు సర్వే పనులు పూర్తి చేశారు. మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో రహదారి పక్కన ఉన్న దుకాణ సముదాయాలకు హద్దులను నిర్ధారించారు. నాలుగు లేన్ల రోడ్డుతో ప్రమాదాలు తగ్గుతాయని భావిస్తున్నారు. అయితే జాతీయ రహదారిని ఇదే రోడ్డు వెంబడి విస్తరించాలనే ప్రతిపాదన ఉండడంతో ఈ పనులకు ఇంతకాలం మోక్షం లభించలేదు. కానీ మెదక్ - బాన్సువాడ - బోధన్- ఫకీరాబాద్ మీదుగా భైంసాకు జాతీయ రహదారి ఖరారయ్యింది. దీంతో ఇకనైనా పనులు ప్రారంభించాలని భక్తులు కోరుతున్నారు.

ఏడాది కాలంలో నవీపేట మండలంలో జరిగిన ప్రమాదాల వివరాలిలా ఉన్నాయి.

2015 జూన్ 17న నాగేపూర్ మూలమలుపు వద్ద జరిగిన ప్రమాదంలో గడ్‌చాందకు చెందిన యువకుడు మృత్యువు పాలయ్యాడు.

2015 సెప్టెంబర్ 16న అభంగపట్నం శివారులో జరిగిన ప్రమాదంలో ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్ట్‌లో పని చేసే ఇద్దరు యువకులు మృతి చెందారు.

2015 అక్టోబర్ 14న నాగేపూర్ మూలమలుపు వద్ద జరిగిన ప్రమాదంలో భైంసాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు అకాల మరణం పొందారు.

2015 నవంబర్17న నవీపేట శివారులో జరిగిన ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందాడు.

2016 మార్చి 24న నాగేపూర్ మూలమలుపు వద్ద జరిగిన ప్రమాదంలో మండలంలోని మద్దెపల్లికి చెందిన ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు.

2016  ఏప్రిల్ 29న నాగేపూర్ మూలమలుపు వద్ద జరిగిన ప్రమాదంలో ధర్మాబాద్‌కు చెందిన యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.

2016  జూన్ 7న ఫకీరాబాద్ దగ్గర ట్రాలీ ఆటో, బైక్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మృత్యువాతపడ్డారు.

2016 జూన్ 8న ఫకీరాబాద్ దగ్గర జరిగిన లారీ, ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement