దారి చూపిన సూరీడు
-
టైపింగ్‌లో తొలితరం గురువు వీవీఎస్‌పీ
-
ఓ వైపు రైల్వే ఉద్యోగిగా.. మరో వైపు టైపు శిక్షకుడిగా..
-
ఇంటి వద్దే శిక్షణ కేంద్రం ఏర్పాటు
-
విద్యార్థులకు వేగం, నైపుణ్యంతో కూడిన పాఠాలు
-
ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వరంగల్ యువకులు
నాటి కాలంలో ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు తక్కువగా ఉండేవి. పదో తరగతి పాస్ అయిన తర్వాత ఐటీఐ, ఒకేషనల్ కోర్సులు పూర్తి చేస్తే వెంటనే ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేవి. దీంతో చాలా మంది విద్యార్థులు టెన్త్ పూర్తి చేయగానే వృత్తివిద్యను అభ్యసించే వారు. ఈ క్రమంలో సమాజంలో తనతోపాటు నలుగురు బాగుపడాలనే ఉద్దేశంతో ఓ రైల్వే ఉద్యోగి తనకు వచ్చిన టైపింగ్‌ను పలువురికి పరిచయం చేశారు. ఇంటినే శిక్షణ కేంద్రంగా మార్చి ఉదయం, సాయంత్రం వేళల్లో వారికి మేలైన తర్ఫీదు ఇచ్చారు. ఆయన పర్యవేక్షణలో శిక్షణ పొందిన వరంగల్ యువకులు ఉన్నతస్థాయిలో ఉద్యోగాలు చేస్తూ ప్రశాంతంగా జీవిస్తున్నారు. తొలితరం టైపింగ్ గురువుగా పేరొందిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి వేదాంతం వెంకట సూర్యప్రకాశం(వీవీఎస్)పై స్ఫూర్తిదాయక కథనం.
– సాక్షి, హన్మకొండ
ప్రస్తుతం నగర, పట్టణ ప్రాంతాల్లో ప్రతీ ఇంటిలో కంప్యూటర్లు సాధారణమయ్యాయి. అప్పట్లో టైపు నేర్చుకోవడం అనేది కామన్. పదో తరగతి పూర్తి చేసిన వారిలో చాలామంది తప్పనిసరిగా టైపు నేర్చుకునేవారు. టైపు చేయడం వచ్చి ఉంటే ఉద్యోగం గ్యారంటీ అనే భరోసా ఉండేది. ఇలాంటి సమయంలో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన వేదాంతం వెంకటసూర్యప్రకాశం రైల్వే ఉద్యోగిగా వరంగల్‌కు వచ్చారు. 1966 నుంచి 1994 వరకు ఆయన కాజీపేట లోని రైల్వే డీజిల్ లోకోషెడ్‌లో స్టెనోగా పనిచేశారు. ఈ క్రమంలో తనకు వచ్చిన టైపింగ్‌ను మరికొందరికి అందజేయాలనే ఉద్దేశంతో ఆయన తన ఇం టిలోనే ఆసక్తి ఉన్న విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు.
ఉదయం.. సాయంత్రం వేళల్లో శిక్షణ
70వ దశకంలో వరంగల్ యువతను ప్రభుత్వ కొలువుల వైపు మళ్లించిన దేవుడిగా వేదాంతం వెంకట సూర్యప్రకాశం నిలుస్తారని చెప్పవచ్చు. కాజీపేటలో ఓ వైపు విధులు నిర్వర్తిస్తూనే మరోవైపు ఆయన ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రతి రోజు నాలుగు బ్యాచ్‌లకు శిక్షణ ఇచ్చేవారు. ఒక్కో బ్యాచ్‌లో 60 మంది టైప్ నేర్చుకునే వారు. ప్రతీ రోజు 240 మందికి ప్రకాశం పంతులు శిక్షణ ఇచ్చేవారు. ఇందుకోసం తన ఇంటినే శిక్షణ కేంద్రంగా మార్చుకున్నారు. మెుదటి బ్యాచ్lతెల్లవారుజామున 4:00 గంటల నుంచి ఉదయం 10:00 గంటల వరకు ఉండేది. అనంతరం తన రైల్వే విధులకు వెళ్లేవారు. అక్కడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం 6:00 గంటల నుంచి రాత్రి 11:00 గంటల వరకు నిర్విరామంగా శిక్షణ తరగతులు నిర్వహించేవారు. సుమారు 24 ఏళ్ల పాటు వరంగల్‌లో ఆయన ఎంతోమందికి శిక్షణ ఇచ్చారు. 1994లో కాజీపేట నుంచి సికింద్రాబాద్‌కు బదిలీ అయ్యే వరకు ఆయన ఇదే జీవన విధానాన్ని అవలంబించారు.
ఉన్నత సంస్థల్లో ఉద్యోగాలు..
ప్రైవేట్ ఉద్యోగాలు లేకS.. చేసేందుకు ఉపాధి పనులు దొరకక నాటి కాలంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న యువతకు ప్రకాశం మాస్టారు నేనున్నాననే భరోసా కల్పించారు. టైపింగ్ నేర్చుకుంటే ప్రభుత్వ ఉద్యోగాలు సులువుగా సాధించవచ్చని ఎంతో మంది యువకులకు అవగాహన కల్పించి శిక్షణ ఇచ్చారు. ఈ క్రమంలో ఆయన దగ్గర టైపింగ్ శిక్షణ పొందిన వరంగల్‌కు చెందిన 1500 మంది ప్రభుత్వ ఉద్యోగాలు పొందడం గమనార్హం. ఇందులో ఎంతోమంది ప్రస్తుతం ఉన్నత స్థానాల్లో, ఉన్నత సంస్థల్లో పనిచేస్తున్నారు. రాష్ట్రపతి భవన్, ప్రధానమంత్రి కార్యాలయం, సీబీఐ కార్యాలయంతోపాటు పలు కీలకమైన శాఖల్లో వారు విధు లు నిర్వరిస్తున్నారు. ప్రకాశం మాస్టర్ దగ్గర శిక్షణ తీసుకున్న వారిలో ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగాలు పొందడంతో అప్పట్లో ఆయన పేరు మార్మోగింది.
గురువుకు సన్మానం
వృత్తిలో భాగంగా కాజీపేట నుంచి సికింద్రాబాద్‌కు బదిలీపై వెళ్లిన ప్రకాశం పంతులు 2001లో ప్రైవేట్ సెక్రటరీ హోదాలో రైల్వేలో ఉద్యోగ విరమణ పొందారు. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్‌లోనే నివాసముంటున్నారు. ఆయన వద్ద శిక్షణ పొందిన వారిలో వరంగల్, సికింద్రాబా ద్‌లో కలిపి దాదాపు రెండు వేల మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. అయితే తమ భవిష్యత్‌కు బాటలు వేసి.. తమను ఉన్నతస్థాయికి చేర్చేందుకు కృషి చేసిన ప్రకాశం పంతులు సేవలను పూర్వ విద్యార్థులు గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న శిషు్యలంతా ఈ ఏడాది జులైలో జరిగిన గురుపౌర్ణమి సందర్భంగా ప్రకాశం పంతులు దంపతులను సికింద్రాబాద్‌లో ఘనంగా సన్మానించారు. తమను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషిచేసిన మాస్టారు సేవలను వారు కొనియాడారు.
పట్టుదల ఉండాలి
నేను శిక్షణ ఇచ్చిన విద్యార్థుల్లో ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగాలు పొందడం సంతోషంగా ఉంది. ఇప్పటివరకు నేను వేలాది మందికి శిక్షణ ఇచ్చాను. ఇందులో అంకితభావం ఉన్న వారు ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. వారి విజయాల్లో నా శిక్షణ ప్రభావం పదిశాతం ఉంటే.. మిగిలిన తొంభై శాతం వారి పట్టుదలే కారణం. గురువు పాఠాలు చెబితే శిషు్యడికి సరిగా అర్థం కావడం అన్నది శిక్షణకు సంబంధించి ముఖ్యమైన విషయం. వరంగల్‌కు చెందిన నా శిషు్యలు చాలా మంది ఉన్నత సంస్థల్లో ఉద్యోగాలు చేస్తుండడం ఆనందంగా ఉంది.
– వేదాంతం వెంకటసూర్య ప్రకాశం, రైల్వే రిటైర్డ్ ఉద్యోగి
సార్ వల్లే ఈ స్థాయికి వచ్చా..
మేము గతంలో కాజీపేటలో నివాసముండేవాళ్లం. నేను సెయింట్ గ్యాబ్రియల్స్ స్కూల్‌లో చదువుకున్నాను. కొంతమంది మిత్రుల ద్వారా నేను ప్రకాశం సార్ గురించి తెలుసుకున్నాను. రోజు ఉదయమే ఆయన ఇంటికి వెళ్లి సార్ దగ్గర టైప్ నేర్చుకున్నాను. నాతో పాటు నేర్చుకున్న వాళ్లందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. ప్రస్తుతం నేను హైదరాబాద్‌లోని ఇన్‌కంట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో స్టెనోగా పనిచేస్తున్నాను. నా మిత్రులు కొందరు ప్రధాన మంత్రి, రాష్ట్రపతి కార్యాలయాల్లో పనిచేస్తున్నారు. ఇంకొందరు పొరుగు రాష్ట్రాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రకాశం సార్ వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను.
– పి. అనిల ఫణికుమార్, స్టెనో, ఇన్‌కంట్యాక్స్ డిపార్ట్‌మెంట్, హైదరాబాద్