అవిశ్రాంత సవారీ.. | rolemodel of youth | Sakshi
Sakshi News home page

అవిశ్రాంత సవారీ..

Published Sat, Sep 24 2016 7:12 PM | Last Updated on Thu, Mar 28 2019 6:14 PM

అవిశ్రాంత సవారీ.. - Sakshi

అవిశ్రాంత సవారీ..

సిరిసిల్ల :  ఉరుకులు... పరుగుల జీవితంలో శారీరక శ్రమ తగ్గిపోతోంది. సరైన వ్యాయామం లేక మానసిక ప్రశాంతత కొరవడుతోంది. ఈ తరుణంలో సైకిల్‌ సవారీతో నిరంతరం ఉల్లాసంగా ఉత్సాహంగా గడొచ్చని నిరూపిస్తున్నారు సిరిసిల్లకు చెందిన పలువురు రిటైర్డ్‌ ఉద్యోగులు. ఆరు పదుల వయసు దాటినా 20 ఏళ్ల యువకుల్లా ఎక్కడికి వెళ్లినా సైకిల్‌పై సవారీ చేస్తూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. వ్యాయామంలో భాగంగా సైకిల్‌పై సంచరిస్తూ అందరినీ పలకరిస్తున్నారు. రోజూ సైకిల్‌ తొక్కడమే తమ ఆరోగ్య రహస్యమని చెబుతున్న రిటైర్డు ఉద్యోగులపై ప్రత్యేక కథనం.. 
 
ఏళ్ల తరబడి సైకిల్‌పై.. 
ఒకటి.. రెండు రోజులో కాదు.. ఏళ్లకు ఏళ్లుగా సైకిల్‌ తొక్కుతూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు సిరిసిల్ల రిటైర్డు ఉద్యోగులు. ఇందులో కొందరు ఆర్థికంగా స్థిరపడి కార్లు, బైక్‌లు, మోపెడ్‌లు ఉన్నా వాటికి దూరంగా ఉంటూ సైకిల్‌పైనే ప్రయాణంచేస్తున్నారు. మార్కెట్‌లో కూరగాయల నుంచి కిరాణ సామగ్రి దాకా అన్నింటికీ సైకిలే. నిత్యం ఉదయం గంటసేపు సైకిల్‌ తొక్కుతూ యువకుల్లా ఉత్సాహంగా గడుపుతున్నారు. సిరిసిల్లలో పాతిక మంది రిటైర్డు ఉద్యోగులు ఎవరికి వారు తీరిక వేళల్లో సైకిల్‌ తొక్కుతూ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు శ్రమిస్తున్నారు.
 
యువతకు ఆదర్శం..
ఏ చిన్న పనైనా.. కొద్దిపాటి దూరమైనా బైక్‌పై వెళ్తున్న ఈ రోజుల్లో యువతకు సిరిసిల్ల రిటైర్డు ఉద్యోగులు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఏ పని అయినా సైకిల్‌పై వెళ్లి చేసుకుంటున్నారు. 60 ఏళ్ల వయసులోనూ అలుపెరగడకుండా సైకిల్‌ తొక్కుతూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. 30 ఏళ్లు దాటగానే అనారోగ్యం బారిన పడుతున్న నేటితరం యువతకు అవిశ్రాంత సైకిలిస్టులు ఆదర్శంగా ఉన్నారు. సైకిల్‌ తొక్కడంతో చెమట వస్తుందని, గుండెవేగం పెరిగి శరీరంలోని అన్ని భాగాలకు రక్తప్రసరణ బాగా జరుగుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. మోకాళ్లు, మడిమెల, కీళ్లనొప్పులు ఉండి వాకింగ్‌ చేయలేని వారికి సైతం సైకిల్‌ తొక్కమని డాక్టర్లు సలహా ఇస్తున్నారు. ఈ నేపథ్యంతో సిరిసిల్ల వీధుల్లో సైకిల్‌ సవారీతో రిటైర్డు ఉద్యోగులు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
 
15 ఏళ్ల వయసు నుంచి..
– అబ్దుల్‌ అజీమ్‌(75), పోస్టుమెన్‌
15 ఏళ్ల వయసు నుంచి నేను సైకిల్‌ తొక్కుతున్నా. నాకు పది మంది పిల్లలు. 1965లో పోస్టల్‌ శాఖలో చేరా. 2010లో రిటైర్‌ అయ్యాను. ఉద్యోగంలో ఉండగా.. నిత్యం సైకిల్‌పైనే ఉత్తరాలను పంచేవాడిని. అదే అలవాటుతో ఇప్పటికీ సైకిల్‌ తొక్కుతూనే ఉన్నాను. సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నా. 
 
మనవడి సైకిల్‌ తొక్కుతున్నా.. 
– మాణిక్‌రావు లక్ష్మీనారాయణ(68), రిటైర్డు ఉద్యోగి
మా మనవడి సైకిల్‌ నేను తొక్కుతున్న. రోజూ ఉదయం గంట సైకిల్‌ తొక్కుత. 2009లో ఉద్యోగ విరమణ చేశా. వ్యాయామం కోసం సైకిల్‌ తొక్కమని డాక్టర్లు చెప్పారు. మూడేళ్లుగా సైకిల్‌ తొక్కుతున్నా. మా అబ్బాయి ఆస్ట్రేలియాలో ఉంటడు. మా మనవడి సైకిల్‌ను వాడుకుంటున్నా. ఉల్లాసంగా ఉంది.
 
సైకిల్‌పైనే బడికి..
– నర్సింగోజు సుదర్శన్‌(69), రిటైర్డు టీచర్‌
నేను 2005లో సిరిసిల్ల మండలం తంగళ్లపల్లిలో స్కూల్‌ అసిస్టెంట్‌గా రిటైర్డు అయ్యాను. సైకిల్‌పైనే బడికి వెళ్లేవాడిని. ఇప్పుడు బయటకు సైకిల్‌పైనే వెళ్తా. ఆరోగ్యంగా ఉండేందుకు సైకిల్‌ తొక్కడం  మంచిది. 12 ఏళ్లుగా సైకిల్‌ తొక్కుతున్నా. బజారులో ఏ పని ఉన్నా.. సైకిల్‌పైనే వెళ్లి చేసుకుని వస్తా. నేను చిన్నప్పుడు సైకిళ్లు రిపేర్లు చేశా. 
 
కారు, స్కూటర్‌ ఉన్నా..
–గుడ్ల రవి(60), రిటైర్డు ఉపాధ్యాయుడు
నాకు కారుంది. స్కూటర్‌ ఎప్పటి నుంచో ఉంది. ఆరోగ్యం కోసం రోజూ సైకిల్‌ తొక్కుతా. ఉదయం వ్యాయామంలో భాగంగా సిరిసిల్ల వీధుల్లో సైకిల్‌ తొక్కుతా. కొందరు కొత్తగా చూశారు. కానీ నాకు అలవాటైంది. ఐదేళ్లుగా సైకిల్‌పైనే వ్యాయామం చేస్తున్నాను. పార్కింగ్‌ సమస్య ఉండదు. పెట్రోల్‌ అవసరం లేదు. అన్నింటికీ సైకిలే బెటర్‌.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement