
సరికొత్తగా..
జిల్లాలో అభివృద్ధిని పరుగెత్తిస్తాం
నర్సంపేట ఆస్పత్రి అప్‌గ్రేడ్‌కు ప్రతిపాదనలు
సూక్ష్మసేద్యం సాగు విస్తీర్ణం పెంచేందుకు ప్రణాళికలు
పాకాలలో పర్యాటక అభివృద్ధికి నిధులు
హరితహారం కింద 1.8కోట్ల మొక్కలు
వ్యవసాయ ప్రాధాన్యత కలిగిన వరంగల్ రూరల్ జిల్లాను అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లేందుకు నూతన సంవత్సరంలో సరికొత్త ప్రణాళికలతో ముందుకు వెళ్లనున్నట్లు కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. గణనీయ స్థాయిలో సాగు ఉన్న ఈ జిల్లాలో సూక్షసూద్యాన్ని పెంచడంతో పాటు పర్యాటక రంగాల్లో అభివృద్ధి దిశగా కృషి చేయనున్నట్లు వెల్లడించారు. జిల్లాలో ఏర్పాటు చేయనున్న టెక్స్‌టైల్ పార్కుకు భూమి సేకరిస్తున్న క్రమంలోనే మరికొన్ని పరిశ్రమల కోసం అవసరమైన భూమితో ల్యాండ్ బ్యాంకు ఏర్పాటుచేస్తామని తెలిపారు. కొత్త సంవత్సరంలో అడుగిడుతున్న సందర్భంగా జిల్లా అభివృద్ధిపై తన విజన్‌ను కలెక్టర్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ‘సాక్షి’ ఇంటర్వూ్యలో వెల్లడించారు. ఈ మేరకు కలెక్టర్ చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే...
జనవరి నెలాఖరులోగా సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాం. రాష్ట్రంలోనే అత్యధికంగా వరంగల్ రూరల్ జిల్లాలో సాదాబైనామా దరఖాస్తులు 1,00,699 వచ్చాయి. వీటిల్లో ఇప్పటికే 80శాతం పరిశీలన పూర్తయింది. ఇక ప్రభుత్వం నిబంధనలు సడలించడంతో ‘కుడా’ పరిధిలోకి వచ్చే 70గ్రామాల నుంచి వచ్చిన 19,426 దరఖాస్తులను పరిష్కరిస్తాం. యాసంగికి సాగుకు సంబంధించి వ్యవసాయశాఖ అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది. జిల్లాలో సూక్ష్మ సేద్యం చాలా తక్కువగా ఉంది. ఉద్యానశాఖ పరిధిలో 35వేల హెక్టార్లకు గాను కేవలం 15వేల హెక్టార్లలోనే సూక్ష్మ సేద్యం జరుగుతోంది. దీనిని 100శాతానికి తీసుకొస్తాం. పరకాలలో ఏర్పాటు చేయనున్న ఆగ్రోస్ సెంటర్‌కు ఇప్పటికే ఎనిమిది ఎకరాల భూమి కేటాయించాం.
హరితహారం కింద రానున్న జూన్‌లో జిల్లావ్యాప్తంగా 1.8కోట్ల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేశాం.
నాటాల్సిన మొక్కలకు అదనంగా పది శాతం అంటే 1.25కోట్ల మొక్కలను జిల్లాలోని మొత్తం 66 నర్సరీల ద్వారా సిద్ధం చేయిస్తున్నాం.మిషన్ భగీరథ ద్వారా శాయంపేట మండలంలోని 25గ్రామాలకు ఈ నెలాఖరులోగా తాగునీరు అందిస్తాం. మార్చి 31లోగా పరకాల నియోజకవర్గంలోని 150గ్రామాలకు నీరందిస్తాం. ఏడాది చివరిలో నర్సంపేట, వర్ధన్నపేట నియోజకవర్గాలకు నీరందిస్తాం. ఈ పనులపై నిరంతర పర్యవేక్షణ చేస్తున్నాం.గీసుకొండ–సంగెం మండలాల్లో ఏర్పాటుచేయనున్న టెక్స్‌టైల్ పార్క్ కోసం సేకరించిన భూమిని టీఎస్‌ఐఐసీకి అప్పగించాం. పార్క్‌కు సంబంధించి డీపీఆర్ తయారవుతోంది. కేంద్ర టెక్స్‌టైల్ మంత్రిత్వ శాఖ అనుమతులతో పార్క్, శిక్షణ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. రైతులు ముందుకొస్తే రెండో దశ భూసేకరణ చేసి ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. మరోవైపు ఆత్మకూరు మండలం గూడెప్పాడ్‌లో ఉన్న వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేయనున్నాం. ఇందులో రైతు శిక్షణ కేంద్రాలతో పాటు రైతులతో స్టాల్స్ ఏర్పాటు చేయిస్తాం. శాయంపేట మండలంలో రూ.1.33కోట్ల కేంద్రప్రభుత్వ నిధులతో జాతీయ చేనేత అభివృద్ధి పథకం కింద డైయింగ్, హ్యాండ్లూమ్ యూనిట్ అధునాతన టెక్నాలజీతో ఏర్పాటవుతోంది. అదేవిధంగా చేనేత కార్మికులను ప్రోత్సహించేలా జిల్లాలో ఉన్న 15వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు ప్రతీ వారం చేనేత వస్త్రాలు ధరించేలా ప్రోత్సహిస్తున్నాం. పాకాల సరస్సు వద్ద ఎకో టూరిజం, పర్యాటక అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో ఆరు కాటేజీలు, ఒక రెస్టారెంట్, మరో బోట్ యూనిట్, జింకల పార్క్, వాహనాల పార్కింగ్ ఏర్పాటుచేయనున్నాం. అదేవిధంగా వరంగల్ నుంచి పాకాల మీదుగా ఇల్లెందు వెళ్లే రోడ్డు మరింత అభివృద్ధి కానుంది.
మిషన్ కాకతీయ పథకం కింద రెండో దశ చెరువుల పనులు పూర్తి కాకపోవడంతో వాటిపై దృష్టి సారించాం. ఇవి పూర్తయ్యాక వచ్చే సంవత్సరం మాడో దశకు వెళ్తాం. నర్సంపేట ఆస్పత్రిని అప్‌గ్రేడ్ చేసేందుకు ప్రతిపాదనలు పంపడం జరిగింది. అదేవిధంగా 15మండలాల్లోని 17పీహెచ్‌సీల్లో ప్రసవాల సంఖ్య పెంచేందుకు కృషి చేస్తున్నాం. జననీ సురక్ష యోజన పథకం కింద రూ.వెయ్యి ఇస్తారని, అదే ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తే రూ.20–30వేలు ఖర్చ వుతాయనే విషయాన్ని గ్రామీణుల్లో అవగాహన కల్పిస్తున్నాం. ఈ జనవరి నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ ద్వితీయ విద్యార్థులకు ఎంసెట్ శిక్షణ ఇవ్వనున్నాం. ఈనెల 2వ తేదీన డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో భారీ జాబ్‌మేళా ఏర్పాటుచేశాం. 500 నుంచి 800మందికి యువతకు ఉద్యోగాలు కల్పించడమే ఈ మేళా లక్ష్యం. అదేవిధంగా ధర్మసాగర్‌లో రాష్ట్రస్థాయి ‘నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్’ ఏర్పాటు చేసి అందులో వికలాంగ యువతకు ఉచిత శిక్షణ ఇచ్చి ప్లేస్‌మెంట్ చూపడంతో పాటు రూ.5వేల ఉపకార వేతనం ఇస్తారు. దీనిపై మొబిలైజేషన్ క్యాంపులు నిర్వహిస్తున్నాం.