తొలిచెక్కును అందుకున్న సీఎం చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ రుణాల మాఫీకోసం ప్రభుత్వం తాజాగా విరాళాల సేకరణకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే రాజధాని నిర్మాణం కోసమంటూ విరాళాల కోసం ప్రత్యేక అకౌంట్లను నిర్వహిస్తున్న చంద్రబాబు రుణమాఫీకోసం కూడా అదే మార్గం పట్టారు. చిత్తూరు జిల్లా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర షాప్ కీపర్స్ అసోసియేషన్ నుంచి బుధవారం రుణమాఫీకోసం తొలిచెక్కును అందుకున్నారు. తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కోడూరు బాలసుబ్రహ్మణ్యం నేతృత్వంలో ఈ అసోసియేషన్ ప్రతినిధులు క్యాంపు కార్యాలయంలో సీఎంను కలసి రూ.3 లక్షల చెక్కును అందించారు.
కార్యక్రమంలో రాష్ట్ర మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్, అసోసియేషన్ ప్రతినిధులు సురేష్, సంతోష్‌కుమార్, రవి, గిరి తదితరులు పాల్గొన్నారని సీఎం కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. రుణమాఫీకి నిధుల సమీకరణకు ప్రభుత్వం ఎంపీ సుజనాచౌదరి నాయకత్వంలో కమిటీని ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. ఆ కమిటీ పలుమార్గాల్లో నిధుల సేకరణపై దృష్టి సారించింది. తాజాగా రూ.3 లక్షల చెక్కును అందుకోవడం ద్వారా బాబు రుణమాఫీ నిధులకోసం విరాళాల సేకరణకు ద్వారం తెరిచినట్లయ్యింది.
తన జిల్లానుంచే దీన్ని ఆయన ప్రారంభించారు. మరోవైపు రుణమాఫీకోసం అవసరమైతే ప్రజలనుంచి ప్రత్యేకంగా సెస్‌ను వసూలు చేస్తామని వ్యవసాయ మంత్రి పత్తిపాటి పుల్లారావు బుధవారం మీడియాతో చెప్పారు. రాజధాని నిర్మాణం కోసం మంత్రాలయం శ్రీరాఘవేంద్రస్వామి మఠం తరఫున ఆ సంస్థ ప్రతినిధులు రూ.10 లక్షల చెక్కును సీఎంకు అందించారు. మఠం ప్రతినిధులు బుధవారం ఆయన నివాసంలో కలిసి చెక్కును అందించారు.