ఆక్వా నుంచి రాష్ట్రానికి రూ.16వేల కోట్లు
నెల్లూరు (టౌన్) : రాష్ట్ర ఆర్థిక పరిపుష్టికి ఆక్వా నుంచి రూ.16 వేల కోట్లు ఆదాయం వస్తుందని మాజీ ఎమ్మెల్యే, బీఎంఆర్ సంస్థ అధినేత బీద మస్తాన్‌రావు తెలిపారు. వర్సిటీ మెరైన్ బయోలాజీ విభాగంలో ప్రారంభమైన రెండు రోజుల మెరైన్ అండ్ కోస్టల్ బయో డైవర్సిటీ ఆఫ్ ఇండియ సదస్సు శనివారంతో ముగిసింది. ఈ సదస్సులో బీద మాట్లాడుతూ పెద్ద ఎత్తున ఆదాయం రావడంతోనే బడ్జెట్‌లో ఆక్వా పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.835 కోట్లు కేటాయించిందన్నారు. బ్లాక్ టైగర్ రొయ్యకు అనుకోని విధంగా తెల్లమచ్చ వైరస్ సోకడంతో రైతులు ఆర్థికంగా దెబ్బతిన్నారని చెప్పారు. 2002లో వెనామీ రొయ్య సాగును ప్రథమంగా బీఎంఆర్ సంస్థ తైవాన్ నుంచి దిగుమతి చేసుకుందన్నారు. రిజిస్ట్రార్ శివశంకర్ మాట్లాడుతూ విద్యార్థులు పాఠ్యపుస్తకాలలో విజ్ఞానంతో పాటు నైపుణ్యం అభివృద్ధి పరుచుకున్నప్పుడే ఉద్యోగావకాశాలు మెండుగా వస్తాయని చెప్పారు. నేడు మొబైల్ ప్రయోగాశాల నిర్వహించినా ఒక మెరైన్ బయోలజీ విద్యార్థికి నెలకు రూ.3 లక్షలు ఆదాయం లభిస్తుందన్నారు. కళాశాల ప్రిన్సిపల్ వెంకటరావు, సదస్సు కార్యనిర్వహక కార్యదర్శి విజయ, ఆచార్యులు సుజాత, హరిబాబు, ప్రభుశరన్, డాక్టర్ రేచెల్ కుమారి, డాక్టర్ హనుమారెడ్డి, డాక్టర్ వెంకటరాయులు, పాలకమండలి సభ్యులు కుసుమ, మాల్యాద్రి, చంద్రయ్య పాల్గొన్నారు.