రాయదుర్గం రూరల్ :
తలదిండులో రూ.2.50 లక్షల నగదు లభ్యమైన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. డి.కొండాపురానికి చెందిన బోయ ఎర్రప్ప, హనుమక్క (70) దంపతులు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తెకు పెళ్లి చేసి మెట్టినింటికి పంపించారు. ఎర్రప్ప కొన్నేళ్ల క్రితం చనిపోయాడు. అప్పటి నుంచి మతిస్థిమితం సరిగా లేని కుమారుడు రాజుతో కలిసి హనుమక్క నివాసం ఉంటోంది. వీరికి 7.60 ఎకరాల మెట్ట పొలం ఉంది. భూమి ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఇంట్లోనే దాచుకునేది. ఆరు నెలల క్రితం కాలు విరిగి మంచానపడింది. అనారోగ్యంతో ఆదివారం మరణించింది. ఆదివారం ఆమె మృతదేహాన్ని బంధువులు ఇంటిలోంచి బయటకు తీశారు. హనుమక్క వాడే తలదిండును కూడా బయటపడేసేందుకని తీసుకొచ్చారు. అయితే అందులో పేపర్ శబ్దం రావడంతో తెరిచి చూశారు. అందులో రూ.2.50 లక్షల నగదు బయటపడింది. అందులో లక్ష రూపాయలు తడిచి, చిరిగిపోయి పనికిరాకుండా పోయాయి. మిగిలిన లక్షన్నర రూపాయలలో పాత రూ.100, రూ.500, రూ.1000 నోట్లు ఉన్నాయి. ఈ మొత్తాన్ని బంధువుల్లో ఒకరైన వన్నూరుస్వామికి గ్రామపెద్దల సమక్షంలో అప్పగించారు.