హైదరాబాద్, న్యూస్‌లైన్ : చీటీల పేరుతో టీడీపీ నేత పలువురికి శఠగోపం పెట్టి సుమారు రూ. 5 కోట్లతో పరారైన సంఘటన స్థానిక కుత్బుల్లాపూర్‌లో కలకలం రేపింది. కృష్ణా జిల్లా ఘంటశాల మండలం తాడేపల్లి గ్రామానికి చెందిన సూరపనేని వెంకట శివాజీ బతుకుదెరువు కోసం కొన్నేళ్ల క్రితం ఇక్కడికొచ్చి జీడిమెట్ల డివిజన్ ప్రసూననగర్‌లో నివాసం ఉంటున్నాడు.
చీటీల వ్యాపారం నిర్వహిస్తూ రూ.5 లక్షలు, రూ. 2 లక్షలు చొప్పున వేసి వాటి కాలపరిమితి పూర్తి కాగానే చీటీ పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వాల్సి ఉండగా రూ.3 చొప్పున వడ్డీ ఇచ్చి డబ్బు తన వద్దనే ఉంచుకుంటూ వస్తున్నాడు. స్థానికులకు నమ్మకం ఏర్పడడంతో శివాజీ వారితోపాటు ఉద్యోగులనూ నమ్మించి మోసం చేయడమే పనిగా పెట్టుకున్నాడు. బాలానగర్‌లోని లోకేష్ కంపెనీకి చెందిన పలువురు ఉద్యోగులు ఇతడి వలలో పడి సుమారు రూ. 2 కోట్లకు చీటీలు వేశారు.
పది రోజులనుంచి శివాజీ ఆచూకీ లభించకపోవడంతో సుమారు 160 మంది వేట ప్రారంభించి అతడి సొంత గ్రామానికి వెళ్లారు. అయినా ఫలితం లేకపోవడంతో సోమవారం ప్రసూననగర్ కమ్యూనిటీ హాలులో బాధితులంతా సమావేశమై తాము మోసపోయిన డబ్బుల వివరాలను ఒక్కొక్కటిగా రాసుకున్నారు. అక్కడికి హాజరైన 73 మందికి రూ.5 కోట్లకు పైగానే డబ్బులు ఇవ్వాల్సి ఉందని లెక్క తేలింది. ఈ విషయంపై పలువురు ‘న్యూస్‌లైన్’ను ఆశ్రయించి తాము మోసపోయిన విధానాన్ని వివరించారు.
సుధాకర్, రామచౌదరి అనే వ్యక్తులకు ఒకరికి రూ.20 లక్షలు, మరొకరికి రూ.13 లక్షలు టోకారా ఇచ్చాడు. కేవలం వడ్డీ ఆశ చూపే వీరందరికీ మస్కా కొట్టడం గమనార్హం. శివాజీ జీడిమెట్ల డివిజన్ టీడీపీ కోశాధికారిగా కొనసాగుతూ ప్రసూననగర్ స్థానిక సంక్షేమ సంఘం అడ్వైజర్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు. బాధితులంతా సోమవారం రాత్రి జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రూ. 5 కోట్లతో టీడీపీ నేత పరారీ
Published Tue, Aug 6 2013 12:47 AM | Last Updated on Fri, Sep 1 2017 9:40 PM
Advertisement