- సంఘానికి రూ.60 వేల లోన్లు
- జిల్లా గొర్రెల పెంపకం సహకార సంఘం ఛైర్మెన్ మల్‌శెట్టియాదవ్
పెద్దశంకరంపేట: ఎన్‌సీడీసీ ద్వారా జిల్లాకు రూ.9 కోట్లు మంజూరైనట్లు జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార సంఘం చైర్మన్ మల్‌శెట్టియాదవ్ అన్నారు. బుధవారం పేటలో మండల గొర్రె కాపరుల సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్‌సీడీసీ ద్వారా దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో రైతులకు లోన్లు ఇస్తున్నారని, దీనిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి గ్రామంలో గొర్రెలకాపరులకు 25 ఎకరాల భూమి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.
ప్రభుత్వం 559 జీఓను అమలు చేయాలన్నారు. ప్రతి సంఘానికి రూ.60 వేల లోన్లు ఇస్తున్నామన్నారు. ఇందులో రూ.20 వేల సబ్సిడీ ఉంటుందన్నారు. ప్రతి గ్రామంలో ఎస్సీ, ఎస్టీలకు ఇస్తున్నట్లుగా గొర్రెలకాపరులకు కూడా 100 శాతం సబ్సిడీపై షెడ్లు నిర్మించుకునేందుకు అవకాశం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో మండల గొర్రెల కాపరుల సంఘం అధ్యక్షుడు గోరుగంటి గంగారాం, శేఖర్, సాయిలు, బుచ్చయ్య, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.