జిల్లాకు రూ.45 కోట్ల ఎన్సీడీసీ రుణాలు
కర్నూలు(అగ్రికల్చర్)/అర్బన్ : గొర్రెల పెంపకాన్ని మరింత ప్రోత్సహించేందుకు జాతీయ సహకార అభివృద్ధి సంస్థ(ఎన్సీడీసీ) ద్వారా జిల్లాకు మూడేళ్లలో రూ.45 కోట్లు వస్తాయని అంధ్రప్రదేశ్ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య అధ్యక్షుడు నాగేశ్వరరావు యాదవ్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని పశుసంవర్ధకశాఖ సమావేశ భవనంలో జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్సీడీసీ నిధుల వినియోగం పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 2018–19లో జిల్లావ్యాప్తంగా రూ.10.58 కోట్లు వ్యయం చేస్తున్నామని తెలిపారు
రుణం మొత్తంలో 20 శాతం సబ్సిడీ, 60శాతం ఎన్సీడీసీ నిధులు పోను 20 శాతం లబ్ధిదారులు భరించాల్సి ఉంటుందన్నారు. 60 శాతం లోన్‌కు పావలావడ్డీ వర్తిస్తుందన్నారు. ఆడిట్, ఎన్నికలు జరిగిన సహకార సంఘాల సభ్యులకే రుణాలు పంపిణీ చేస్తామన్నారు. సమాఖ్య మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో 5,200 గొర్రెల పెంపకందారుల సహకార సంఘాలు ఉన్నాయని, వీటిలో అర్హత కల్గిన సభ్యులకే రుణాలు ఇస్తామని స్పష్టం చేశారు. గొర్రెల పెంపకందారుల సమస్యలను పరిష్కరించేందుకు జీవమిత్రల వ్యవస్థను తీసుకురానున్నట్లు తెలిపారు. పశుసంవర్ధకశాఖ జేడీ డాక్టర్ సుదర్శన్‌కుమార్, జిల్లా గొర్రెల అభివృద్ధి విభాగం ఏడీ డాక్టర్ చంద్రశేఖర్, గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసరావు, డైరెక్టర్లు పాల్గొన్నారు.
అర్హత ఉన్న సొసైటీలకే అందించండి
ఎన్సీడీసీ నిధుల(రూ.45 కోట్ల)ను రాజకీయాలకు తావులేకుండా అర్హత కలిగిన సొసైటీలకే రుణాలుగా అందించాలని ఏపీ గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం నేతలు కోరారు. ఈ మేరకు మంగళవారం జిల్లాకు వచ్చిన గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సంస్థ ఎండీ ఎం శ్రీనివాసరావును సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పీ గోవిందు, నాయకులు జేఎన్ శేషయ్య వినతిపత్రం అందించారు. జీవక్రాంతి, పశుక్రాంతి పథకాల్లో గొర్రెల కాపరుల పిల్లలకు ఉపాధి కల్పించాలని, గడువు ముగిసిన నేపథ్యంలో జిల్లా యూనియన్‌కు ఎన్నికలు నిర్వహించాలని కోరారు. నాయకులు జీ ఆంజనేయులు, కె.మద్దిలేటి, కే రామక్రిష్ణ, జీ రాంమూర్తి, కే రాముడు, చంద్రన్న తదితరులు ఉన్నారు.