ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఢీకొట్టిన మరోబస్సు
16 మందికి గాయాలు... స్తంభించిన ట్రాఫిక్
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : కర్నూలు నగర శివారులోని రేడియో స్టేషన్ వద్ద రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్న సంఘంటనలో 16 మంది గాయాలకు గురయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలు నుంచి వెళ్తున్న ఎమ్మిగనూరు డిపో బస్సును కర్నూలు–2 డిపో బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ఎమ్మిగనూరు బస్సు బోల్లా పడగా..కర్నూలు బస్సు ముందు భాగం దెబ్బతింది. ఈ ప్రమాదంలో రెండు బస్సుల్లోని 16 మంది ప్రయాణికులు గాయపడ్డారు. చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎమ్మిగనూరు డిపో బస్సు ఆకస్మికంగా ఆగడంతోనే ప్రమాదం జరిగినట్లు కర్నూలు డిపో బస్సు డ్రైవర్ ఈశ్వరయ్య తెలిపారు. ఈ ప్రమాదంతో ట్రాఫిక్ స్తంభించగా పోలీసులు క్రమబద్ధీకరించారు. ప్రమాదం జరిగిన స్థలాన్ని రాత్రి జిల్లా ఎస్పీ గోపీనాథ్‌జెట్టీ పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు.