- లాభాల్లో అమలాపురం ఆర్టీసీ డిపో
- ఈ ఏడాది రూ.1.32 కోట్లు ఆర్జితం
- జోన్‌లో ప్రథమస్థానం
- రాష్ట్రంలో 4వ స్థానం
కాసుల పంట
Published Sat, Oct 15 2016 10:47 PM | Last Updated on Mon, Sep 4 2017 5:19 PM
అమలాపురం రూరల్ :
రాష్ట్రంలో ఆర్టీసీ సంస్థ నష్టాల్లో ఉన్నా అమలాపురం డిపో మాత్రం కాసులు కురిపిస్తూ లాభాలు గడిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్æనుంచి ఆగస్టు నాటికి రూ.1.32కోట్ల లాభాన్ని ఆర్జించి విజయనగరం జోన్‌లోని 27 డిపోల్లో ప్రథమస్థానంలో నిలిచింది. డిపో నిర్వహణ ఖర్చు తగ్గించి ఆక్యుపెన్సీని 68 శాతం పెంచడానికి అ«ధికారులు, కార్మికులు శ్రమించారు. 2011లో రూ.75.32 లక్షల లాభాల్లో ఉన్న డిపో 2012 మార్చికి రూ. 9.53 లక్షల నష్టాల్లో ఉంది. 2015 ఆగస్టు నాటికి రూ.1 కోటి లాభాన్ని ఆర్జించింది.
రాష్ట్రంలో ఏడు డిపోలు మాత్రమే లాభాల్లో..
రాష్ట్రంలో ఉన్న 126 డిపోల్లో 7 డిపోలు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. అవి... అమలాపురం, విజయవాడ, ఆటోనగర్, తిరుపతి, అలిపిరి, కాకినాడ, కనిగిరి. విజయవాడ, అటోనగర్ డిపోలు, çపల్లెవెలుగు బస్సులు నడపడం లేదు. తిరుపతి, అలిపిరి డిపోలు శ్రీవేంకటేశ్వర స్వామి కొండపైకి బస్సులు నడపడం ద్వారా లాభాలు సాధించాయి.
డిపో కృషి..
అమలాపురం డిపో నుంచి కోనసీమలోని పలు గ్రామాలకు 40 పల్లెవెలుగు బస్సులు నడపడం ద్వారా కిలోమీటర్‌కు రూ. 12 నష్టం వస్తోంది. పెరిగిన జీతాలు రూ.1.80 కోట్లు, డీజిల్, ఇతర ఖర్చులు కలిపి నెలకు రూ. 6 కోట్ల ఖర్చు అవుతోంది. ఈ నష్టాలు భరిస్తూ డిపోని లాభాల బాటలోకి తీసుకు రావడానికి డిపో మేనేజర్ సత్యనారాయణమూర్తి చర్యలు చేపట్టారు. హైదరాబాద్, రాజమండ్రి, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, విజయవాడ రూట్లలో ఆదాయం పెంచడం ద్వారా ఆక్యుపెన్సీ 68 శాతం పెరిగింది. ఏసీ బస్సులను నడుపుతూ ప్రయాణికులకు మెరుగైన సేవలందిస్తోంది. ఆదాయం వచ్చే రూట్లలో అదనపు బస్సులు తిప్పడం ద్వారా లాభాలార్జించారు. 142 బస్సులున్న డిపోలో 600 మంది కార్మికులు పనిచేస్తున్నారు.
సమష్టి కృషి ఫలితం
ఆదాయం వచ్చే రూట్లలో అదనపు బస్సులను తిప్పుతూ డిపోని లాభాల్లోకి తీసుకుని వచ్చాం. నిర్వహణ ఖర్చు తగ్గించడం ద్వారా ఆదాయాన్ని పెంచాం. కార్మికుల సమష్టి కృషితోనే ఇది సాధ్యమైంది. లాభాలు సాధిస్తున్న డిపో మేనేజర్‌లను సంస్థ విదేశాలకు పంపిస్తోంది. అమలాపురం నుంచి నాకు కూడా అవకాశం వస్తుంది.
– సత్యనారాయణమూర్తి, డిపో మేనేజర్
Advertisement