
ఆమెదో అందమైన లక్ష్యం
సాక్షి, వీకెండ్: బ్యూటీషియన్ అనే ప్రొఫెషన్ ఎంతో గొప్పది అంటారామె. అంతేకాదు ఏకంగా లక్షమందిని ఈ రంగంలో స్థిరపడేలా చేయడమే తన జీవిత లక్ష్యం అని కూడా అంటున్నారు. చిన్ననాటి కలను సాకారం చేసుకోవడమే కాకుండా మరెందరికో సౌందర్యపోషణ రంగంలో కళాకారులుగా తీర్చిదిద్దుతున్న ఆమె పరిచయం
ఈ వారం... – శిరీష చల్లపల్లి
‘గుంపుగా ఎందరో అమ్మాయిలు ఉన్నారు. అంతా ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. ఆ గుంపు మధ్యలో నుంచి ఏదో పింక్ కలర్ మెరుస్తూ ఉండేది. ఆ కల చిన్నప్పటిది. అయితే అదేంటో తెలిసేది కాదు. ఇప్పుడే నా కల గురించి అర్థమైంది’ అంటారు రుబీనా పర్వీన్.
అందమే పల్స్.. బ్యూటీవీల్స్...
నగరంలో సౌందర్యపోషణ ఎంతో ప్రాధాన్యత కలిగిన అంశంగా మారిందో... తదనుగుణంగానే ఆ రంగంలో నిపుణులకు డిమాండ్ కూడా అంతే పెరిగింది. పార్లర్స్‌లో మాత్రమే కాదు ఇంటికి వచ్చి కూడా సేవలు అందించే బ్యూటీషియన్స్ సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది.
అయితే ఇలాంటి మొబైల్ బ్యూటీషియన్‌లు ఒకప్పుడు వ్యక్తిగతంగా తమకున్న పరిచయాలతో మాత్రమే ఆర్డర్లు పొందేవారు. అయితే వ్యక్తిగతంగా కంటే ఇలా ఒక సంస్థ తరపున పనిచేయడం అనేది మహిళలకు సురక్షితం.. అంతే కాదు వారికి ఆదాయపరంగానూ మేలు చేస్తుందంటూ దీన్ని వ్యవస్థీకృతం చేశారు రుబీనా. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే...
ఉతమివ్వడం ద్వారా ఉత్సాహం...
16 ఏళ్లుగా సిటీలో ఉంటున్న రుబీనా జన్మతః ఖమ్మం వాసి. ‘జర్నలిజంలో కొంత కాలం ఉన్నా. దాదాపు 500కిపైగా డాక్యుమెంట్రీ ఫిలిమ్స్ తీశా. 300కిపైగా యాడ్ ఫిలిమ్స్, వేల సంఖ్యలో టెలివిజన్ ఎపిసోడ్స్ తీశాను. ఫిలింమేకర్‌గా స్థిరపడ్డాను. అయితే వీటన్నింటికన్నా మహిళలకు ఉపాధిని అందించే విధంగా ఏదైనా చేయాలని, అందులోనే నాకు తృప్తి దొరుకుతుందని అనిపించేది. అదే సమయంలో నాకు తెలిసిన ఎంతో మంది సంపన్న, మధ్య తరగతి మహిళలు సైతం పార్లర్‌కి వెళ్లి బ్యూటీ ట్రీట్‌మెంట్స్ పొందడానికి సంశయించడం చూశాను.
అలా సంశయించేవారికి ఇంటికే పార్లర్ సేవలు అందిచగలిగితే... అనే ఆలోచన వచ్చింది. దీనిమీద తగినంత రీసెర్చ్ చేశాను. ‘బ్యూటీవీల్స్ డాట్‌కామ్’ ఆలోచనను నా భర్తతో చెప్పినప్పుడు ఆయన అభినందించడంతో పాటు అవసరమైన ఆర్థిక సాయం కూడా చేశారు. సరిపడా చదువు వున్నా లేకున్నా తగిన సంభాషణా చాతుర్యం ఉన్న మహిళలెందరో ఉన్నారు. అలాగే చదువుకుని, సరైన ఉపాధి దొరక్క ఖాళీగా ఉంటున్నవాళ్లూ ఉన్నారు.
వీరికి ఒక వేదికగా బ్యూటీ వీల్స్ డాట్‌కామ్‌ను నెలకొల్పాను. బంజారాహిల్స్ రోడ్‌నెం.12లో 4 బెడ్రూమ్ ఫ్లాట్‌లో వీరికి నిపుణుల చేత వీరికి బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ ఇప్పిస్తున్నాను. కోర్సు చేసే సమయంలోనే సంపాదన సైతం మొదలయ్యేలా శిక్షణానంతరం నెలవారీగా స్థిరమైన ఆదాయం వచ్చేలా కాన్సెప్ట్ డిజైన్ చేశాను. సోషల్ మీడియా సహకారంతో దీనికి మంచి ప్రాచుర్యం కల్పించాను. ఏడాది తిరగకుండానే దాదాపు 200 మంది మా సంస్థలో పనిచేస్తున్నారంటే అంతకంటే నాకు కావాల్సిన తృప్తి ఏముంటుంది.
భవిష్యత్తు ‘భద్రం’..
మా సంస్థలో శిక్షణ తరగతులు నిర్విరామంగా సాగుతుంటాయి. ప్రొఫెషనల్ అప్‌డేట్స్‌తో పాటు పర్సనాలిటీ డెవలప్‌మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్ సైతం నేర్పిస్తాం. కస్టమర్ల కోసం ఉదయం 6గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ బ్యూటీషియన్ సేవలు అందుబాటులో ఉంటాయి.
బ్యూటీ సర్వీసెస్‌ను ఇంటికే పంపుతున్నా పార్లర్‌తో సమానంగా లేదా అంతకన్నా తక్కువే తప్ప ఎక్కువ ఛార్జ్ చేయం. భద్రతా పరంగానూ ఇబ్బందులు రాకుండా సొంత క్యాబ్‌్సలో తీసుకెళ్లి తీసుకొస్తాం. ఇక ట్రీట్‌మెంట్స్ కోసం నేచురల్‌గా తయారైన కాస్మొటిక్స్ మాత్రమే వినియోగిస్తాం. మా కస్టమర్ల కోసం మొబైల్ యాప్ సైతం అందుబాటులోకి తీసుకువచ్చాం.
రుబీనా పర్వీన్