
రాష్ట్రంలో దోపిడీ పాలన
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో కె.లక్ష్మణ్
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం దోపిడీ పాలన సాగిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఆరోపించారు. మహబూబ్‌నగర్‌లో రెండు రోజులపాటు జరగనున్న ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మాటలతో కాలం వెళ్లదీస్తోందని, మిషన్ కాకతీయ, భగీరథల పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనం లూటీ చేస్తోందని ఆరోపించారు. ప్రజల ముందు వాస్తవాలను ఉంచి ప్రభుత్వాన్ని దోషిగా నిలబె డతామన్నారు.
అభివృద్ధి పనులు చేపట్టకుండా గత ప్రభుత్వాల పాపమేనంటూ తప్పించుకుంటున్నారని విమర్శించారు. పాపాత్ములను మీపంచన చేర్చుకున్నంత మాత్రాన పుణ్యాత్ములెలా అవుతారని ఆయన ప్రశ్నించారు. బంగారు తెలంగాణ అంటూ పేదలను వంచిస్తున్నారని మండిపడ్డారు. అసలు బంగారు తెలంగాణ వస్తుందో రాదో కానీ, అవినీతి, అక్రమాలకు తెలంగాణను నిలయంగా మార్చుతున్నారని దుయ్యబట్టారు. టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే శక్తి బీజేపీకే ఉందని, అందుకోసం 2019లో రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా పార్టీని పటిష్టం చేయనున్నట్లు లక్ష్మణ్ తెలిపారు.
రాబోయే ఆరు నెలలు పంచముఖ వ్యూహాన్ని అమలు చేసి ప్రభుత్వం కళ్లు తెరిపిస్తామని చెప్పారు. సమావేశంలో పార్టీ శాసన సభాపక్ష నేత జి.కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీ రామచందర్‌రావు, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, జాతీయ కార్యనిర్వాహక కార్యదర్శి సాధాన్‌సింగ్, జాతీయ కార్యవర్గ సభ్యుడు నాగం జనార్దన్‌రెడ్డి, నాయకులు ఇంద్రసేనారెడ్డి, బద్దం బాల్‌రెడ్డి పాల్గొన్నారు.