మల్లన్న సాగర్‌తో జిల్లా సస్యశ్యామలం
- ప్రాజెక్టును అడ్డుకోవడం విపక్షాలకు తగదు
- రైతులను రెచ్చగొట్టడం సరికాదు
- టీఆర్ఎస్ నాయకుల సూచన
చిన్నకోడూరు: కరువు పరిస్థితుల నుంచి మెతుకు సీమ రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం మల్లన్న సాగర్ నిర్మాణం చేపడుతుందని టీఆర్‌ఎస్ నాయకులు స్పష్టం చేశారు. శుక్రవారం సర్పంచ్‌లు ఆంజనేయులు, నీరుగొండ శ్రీనివాస్, ఎంపీటీసీ మల్లేశం, నాయకులు వర్కోలు రాజలింగం, చంద్రమౌళిగౌడ్, మందపల్లి చంద్రం విలేకరులతో మాట్లాడుతూ.. మల్లన్న సాగర్‌ను ప్రతిపక్షాలు అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. మల్లన్న సాగర్ పూర్తయితే ఈ ప్రాంతం సస్యశ్యామలంగా మారుతుందన్నారు.ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతుందన్నారు.
టీడీపీ, కాంగ్రెస్ నాయకులు రైతులను రెచ్చగొడుతూ అడ్డుకోవాలని చూడడం దారుణమన్నారు. సమైక్య రాష్ట్రంలో టీడీపీ, కాంగ్రెస్‌లు తెలంగాణలో ప్రాజెక్టులు కట్టకుండా అన్యాయం చేయడంతోనే ఇక్కడ కరువు పరిస్థితులు నెలకొన్నాయన్నారు. దీంతో ఆత్మహత్యలు పెరిగాయన్నారు. కరువు ప్రాంతాలను సస్యశ్యామలం చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల నిర్మాణానికి పూనుకున్నట్లు తెలిపారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంత రైతులకు మేలు జరుగుతుందన్నారు. ముంపు బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు. ప్రతిపక్షాల మాటలకు మోసపోతే మళ్లీ కరువు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు రైతులకు సూచించారు. బంగారు తెలంగాణ కోసం ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించాలని విపక్ష పార్టీల నాయకులను కోరారు.