
వెట్టిచాకిరి.. బెత్తెడు శాలరీ !
రైతుబజార్ల సిబ్బంది చాలీచాలని జీతాలతో వెట్టిచాకిరి చేస్తున్నారు.
♦ రైతుబజార్ల సిబ్బందికి అందని కనీస వేతనాలు
♦ జీతాలు పెంచాలని రెండేళ్ల కిందట జీవో జారీ
♦ అయినా అమలు చేయని వైనం
♦ పట్టించుకోని మార్కెటింగ్ శాఖ
♦ కలెక్టర్ దృష్టి సారించాలని వినతి
విజయవాడ : రైతుబజార్ల సిబ్బంది చాలీచాలని జీతాలతో వెట్టిచాకిరి చేస్తున్నారు. రెవెన్యూ, మార్కెటింగ్ శాఖల అధికారులు ఎవరికివారు రైతుబజార్ల సిబ్బందితో పని చేయించుకుంటూనే వేతనాల పెంపుపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రైతుబజార్లలోని సిబ్బందికి వేతనాలు పెంచాలని రెండేళ్ల కిందట ప్రభుత్వం జీవో జారీ చేసింది. అయితే ఆ జీవోను అమలు చేసే నాథుడే కరువయ్యాడు. దీంతో జిల్లాలోని రైతుబజార్లలో పని చేసే సిబ్బంది కనీస వేతనాలకు నోచుకోకుండా ఇబ్బందులు పడుతున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర సరకుల ధరల కారణంగా ఇల్లు గడవక అల్లాడుతున్నారు.
ఆశలు చిగురించి...
జిల్లాలో 18 రైతుబజార్లు ఉన్నాయి. వీటిలో 150మంది వరకు వివిధ కేడర్లలో పని చేస్తున్నారు. ప్రస్తుతం రైతుబజార్లలో పని చేసే ఎస్టేట్ ఆఫీసర్లకు పట్టణాల్లో నెలకు రూ.14వేలు, రూరల్‌లో రూ.12వేలు చొప్పున ఇస్తున్నారు. సబ్ స్టాఫ్, సెక్యూరిటీ గార్డులకు పట్టణాల్లో రూ.6,735, రూరల్‌లో 5,735 చొప్పున ఇస్తున్నారు. జీతాలు పెంచాలని వారు దశాబ్దకాలంగా ప్రభుత్వాన్ని కోరుతూనే ఉన్నారు. ఎట్టకేలకు రెండేళ్ల క్రితం ప్రభుత్వం రైతుబజార్లలో పని చేసే సిబ్బందికి కనీస వేతన చట్టం ప్రకారం జీతాలను సవరిస్తూ జీవో జారీ చేసింది. ఆ జీవో కాపీని మార్కెటింగ్ అధికారులకు పంపింది. ఈ జీవో ప్రకారం ఎస్టేట్ ఆఫీసర్లకు రూ.18వేలు, సబ్ స్టాఫ్‌కు రూ.14వేలు చొప్పున చెల్లించాల్సి ఉంది. దీంతో వేతనాలు పెరుగుతాయని ఆశించిన వారికి నిరాసే మిగిలింది.
మార్కెటింగ్ శాఖ సిబ్బందికి మాత్రమే పెంచి...
అయితే, మార్కెటింగ్ అధికారులు తమ ఆధీనంలో పని చేస్తున్న కాంట్రాక్టు సిబ్బందికి మాత్రమే పెంచారు. రైతు బజార్లలోని సిబ్బందిని గాలికొదిలేశారు. కలెక్టర్ అయినా తమ సమస్యను అర్థం చేసుకుని ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని రైతుబజార్లలోని సిబ్బంది కోరుతున్నారు.