వెంకటాచలం: సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రొటోకాల్ ఉల్లంఘన నిత్యకృత్యమైంది. తాజాగా వెంకటాచలం మండలంలో ఈ తంతు జరిగింది. అనికేపల్లి పంచాయతీలో రెండు రజక సంఘాలకు మంజూరైన సబ్సిడీ రుణాల విషయంలో ప్రతిపక్ష పార్టీ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా పంపిణీ చేయడం వివాదా స్పదమైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులైన రజక సంఘంలోని 15 మంది ఎమ్మెల్సీ సోమిరెడ్డి చేతుల మీదుగా చెక్కులను తీసుకునేందుకు నిరాకరించారు. ఈ క్రమంలో చెక్కుల పంపిణీ మంగళవారం పోటాపోటీగా జరిగింది.
వివరాలు.. అనికేపల్లి పంచాయతీలో రెండు రజక సంఘాలకు బీసీ కార్పొరేషన్ ద్వారా రూ.15 లక్షల రుణాలను మంజూరు చేశారు. ఒక్కో గ్రూపులో 15 మంది సభ్యులు ఉండగా ప్రభుత్వ రాయితీ రూ.25 వేలు, గొలగమూడి సిండికేట్ బ్యాంక్ నుంచి రుణం రూ.25 వేలు మొత్తం కలిపి రూ.50 వేల చొప్పున మంజూరయ్యాయి. ఈ రుణాలు దుర్వినియోగమవుతుండటంతో గ్రూపు సభ్యులు వ్యతిరేకించడంతో తిరిగి బ్యాంక్‌లో జమ చేశారు. తాజాగా రుణాలకు సంబంధించిన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసిన ఎంపీడీఓ అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు మాత్రమే సమాచారమిచ్చారు.
దీంతో ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, సర్పంచ్ రాజాయాదవ్, ఎంపీటీసీ పద్మాగౌడ్, పలువురు అధికారులు అక్కడికి వచ్చిన 15 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ప్రతిపక్ష పార్టీ ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వకపోవడంతో గొలగమూడిలో నిర్వహించిన కార్యక్రమానికి మిగిలిన 15 మంది లబ్ధిదారులు రాలేదు. ఎమ్మెల్సీ చేతుల మీదుగా తీసుకునేందుకు ఇష్టంలేక సాయంత్రం ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లి ఎంపీడీఓ సుగుణమ్మతో వాగ్వాదానికి దిగారు. తాము ఎప్పడు పంపిణీ చేస్తారని ప్రశ్నిస్తే కలెక్టర్ విచారణలో ఉందని ఎందుకు చెప్పారని ప్రశ్నించారు. లబ్ధిదారులకు జెడ్పీటీసీ సర్దిచెప్పారు. దీంతో మిగిలిన 15 మందికి బీసీ కార్పొరేషన్ ఈడీ వెంకటస్వామి, ఎంపీడీఓ సుగుణమ్మ, ఈఓపీఆర్డీ సమక్షంలో జెడ్పీటీసీ చెక్కులను పంపిణీ చేశారు.
ప్రొటోకాల్ ఉల్లంఘన
Published Wed, Jul 13 2016 3:00 AM | Last Updated on Mon, Sep 4 2017 4:42 AM
Advertisement
Advertisement