సర్వశిక్షా అభియాన్ నిధులు విడుదల చేయాలి
నల్లగొండ టూటౌన్: రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం సర్వశిక్షా అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక విద్య నిధులు విడుదల చేయలేదని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎ. నర్సిరెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక యూటీఎప్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులు విడుదల చేసిందని, రాష్ట్రం నుంచి 40 శాతం విడుదల చేయాల్సి ఉండగా నేటికి విడుదల చేయకపోవడంతో కేంద్రం నుంచి రావల్సిన రూ.1830 కోట్లు ఆగిపోయాయని తెలిపారు. ప్రభుత్వం నిధులను త్వరగా విడుదల చేసి అవసరమైన పాఠశాలలకు ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. కంప్యూటర్ విద్యకు నిధులు అదనంగా విడుదల చేయాలని కోరారు. జిల్లాలో 700 ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెట్టారని, ఆయా పాఠశాలలు అస్తవ్యస్తంగా ఉన్నాయని తెలిపారు. వచ్చే విద్యాసంవత్సరం కేజీ నుంచి ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టేందుకు ఇప్పటి నుంచే ప్రణాళిక రూపొందించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్ కోసం ప్రత్యేకాధికారిని నియమించాలని కోరారు. మధ్యాహ్నాం భోజన ఏజన్సీలకు పారితోషికం పెంచాలని, విద్యార్థులకు మెస్ చార్జీలను పెంచాలని హైస్కూల్ విద్యార్థులకు రూ.12, ప్రాథమిక విద్యార్థులకు రూ.10లకు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సీహెచ్. రాములు, జిల్లా అధ్యక్షుడు ఎం. రాజశేఖర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎడ్ల సైదులు, వెంకటేశం, ఎం. యాదయ సైదులు, శ్రీనివాసాచారి, అనిల్, మురళయ్య, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.