శభాష్‌పల్లిలో సర్వే చేస్తున్న సిబ్బంది
- 3 గ్రామాల్లో 20 రోజుల పాటు సర్వే
శివ్వంపేట: శాటిలైట్ ద్వారా భూసర్వే చేపట్టేందుకు శివ్వంపేట మండలంలోని మూడు గ్రామాలు ఎంపికయ్యాయి. గజన్ శాటిలైట్ ద్వారా శభాష్‌పల్లి, గంగాయపల్లి , పోతారం గ్రామాల్లో సర్వే చేపట్టనున్నట్లు తహసీల్దార్ పర్హీన్‌షేక్ చెప్పారు. మంగళవారం సర్వే సిబ్బందితో ఆమె సమావేశమయ్యారు.
ప్రభుత్వ, ప్రైవేటు భూములను గుర్తించి సర్వే చేసేందుకు పైలట్ ప్రాజెక్టు కింద జిల్లాలో మొదట శివ్వంపేట మండలం ఎంపికైందన్నారు. అందులో భాగంగా ఈ మూడు గ్రామాల్లో సెంట్రల్ సర్వే ఆఫీస్, ఇస్రో, తెలంగాణ స్టేట్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ బృందాలు భూ సర్వేలో పాల్గొంటాయన్నారు. భూ వివాదాలను పరిష్కరించడంతో పాటు అసలైన పట్టాదారుల గుర్తింపు, ఫ్రభుత్వ భూముల గుర్తింపునకు సర్వే దోహదపడనుంది.
శాటిలైట్ సర్వే ఆధారంగా ఆయా భూములకు హద్దులు ఏర్పాటు చేసి అందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని వెబ్‌ల్యాండ్‌లో అనుసంధానిస్తారు. 20 రోజుల పాటు మూడు గ్రామాల్లో సర్వే కొనసాగుతుందన్నారు. కాగా, మంగళవారం సర్వే సిబ్బంది శభాష్‌పల్లిలో పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్వే అధికారులు సుబ్బారావు, అనంత పద్మనాభ, హరీష్, ఆర్‌ఐ రాజిరెడ్డి సర్వేయర్లు, వీఆర్‌ఓలు పాల్గొన్నారు.