Sivvampeta
-
నాసిరకంగా పెద్దచెరువు పనులు
శివ్వంపేట: లక్షలు వెచ్చించి చేపట్టిన మిషన్ కాకతీయ పనుల్లో నాణ్యత లోపిస్తోందని రైతులు నిరసన వ్యక్తం చేశారు. పిల్లుట్లలోని పెద్దచెరువు అభివృద్ది పనులను మిషన్ కాకతీయ ద్వారా రూ.35లక్షలతో చేపట్టారని రైతులు అంజాగౌడ్, రాఘవరెడ్డి, బాలయ్య, దేవయ్య, వెంకట్‌రెడ్డి, కిష్టయ్య పేర్కొన్నారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ గతంలో ఉన్న తూమును తొలగించి నూతనంగా నిర్మించిన తూముకు కూడా పగుళ్లు ఏర్పడ్డాయన్నారు. దీంతో తూము ఒకపక్క కుంగిపోవడంతోపాటు నీరు వృధాగా పోతోందన్నారు. మూడునెలలకె పగుళ్లు ఏర్పడడంతో నాణ్యత లోపించిన విషయాన్ని జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. లింగోజిగూడ పరిధిలో ఉన్న ఎల్మానుకుంట పనులు సైతం సక్రమంగా జరగలేదని ఆయకట్టు రైతులు ఆరోపించారు. ఈ విషయమై పలుమార్లు ఇరిగేషన్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు. -
మొలకెత్తిన మక్కకంకులు
శివ్వంపేట: పదిరోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు మొక్కజొన్న రైతులకు నష్టాన్ని చేకూర్చింది. చేతికి వచ్చిన పంటను చేజారిపోతుండటంతో పెట్టిన పెట్టుడి సైతం చేతికందని పరిస్థితి నెలకొంది. వర్షాధార పంటగా మొక్కజొన్నను సాగుచేశారు. పంటను కోసి జోడు పెట్టిన మొక్కజొన్న కంకులు మొలకెత్తాయి. పిల్లుట్ల పంచాయతీ లింగోజిగూడ తండాలో సుమారు 20 ఎకరాల్లో మొక్కజొన్నను కోసి జోడు ఏర్పాటు చేశారు. రెండు రోజుల నుంచి వాతావరణం అనుకూలిస్తుండడంతో నూర్పిళ్ళకు సిద్ధమైన రైతులకు జోడు నుంచి మక్కలను తీసిన క్రమంలో మొలకెత్తాయని రైతులు చంద్రు, విఠల్, మంగ్య, స్వామి, గెమ్యా, శంకర్లు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులుచేసి పంట సాగుచేసుకున్న తమకు నష్టాలే మిగిలాయని, తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరారు. -
చాకరిమెట్లలో భక్తుల పూజలు
శివ్వంపేట : జిల్లాలో ప్రసిద్ధి చెందిన చాకరిమట్లె శ్రీసహకార ఆంజనేయస్వామి, సత్యనారాయణస్వామి ఆలయాల్లో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. జంట నగరాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు. దంపతులు సత్యనారాయణస్వామి మంటపంలో సామూహిక వ్రతాలు ఆచరించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్, పౌండర్ ఆంజనేయశర్మ, ఈఓ సారశ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు. -
షిఫ్టులవారీ బోధనతో ఇబ్బందులు
శివ్వంపేట: షిఫ్టులవారీ బోధనతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని శివ్వంపేట ఉన్నత పాఠశాల విద్యాకమిటీ చైర్మన్ కల్లూరి పద్మయ్య, విద్యార్థుల తల్లిదండ్రులు లక్ష్మినర్సయ్య, అజీజ్, కొండల్, శ్రీనివాస్ అన్నారు. శివ్వంపేటలోని ఉన్నత పాఠశాలలో ఉదయం వేల పాఠశాల, మధ్యాహ్నం నుంచి జూనియర్ కాలేజీ నిర్వహించాలని ఆదేశాలు వెలువడ్డాయని, దీంతో విద్యార్థుల చదువుకు ఆటంకం ఏర్పడుతోందని అన్నారు. మధ్యాహ్నం వరకు పాఠశాల ముగియడంతో విద్యార్థులు ఇళ్ల వద్ద ఆడుకోవడంతో పాటు వ్యవసాయ పనుల్లో నిమగ్నం కావాల్సి వస్తోందని చెప్పారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని తహసీల్దార్ పర్హీన్‌షేక్‌కు వినతిపత్రం అందజేశారు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా కాలేజీ, పాఠశాల తరగతులు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణానికి రూ.10 కోట్లు సిద్ధంగా ఉన్నాయని, భూమి కేటాయించకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పారు. త్వరలోనే కాలేజీకి భూమి కేటాయిస్తామని చెప్పారు. -
కోతకు గురైన కట్ట
శివ్వంపేట: కొద్దిపాటి వర్షానికే చెరువుకట్ట కోతకు గురైంది. మండల పరిధిలోని దొంతి పంచాయతీ పరిధిలో లింగసముద్రం చెరువు మరమ్మతుల కోసం మిషన్‌కాకతీయ ద్వారా రూ. 25.70 లక్షలు మంజూరయ్యాయి. పూడిక, కట్ట వెడల్పు పనులు చేపట్టారు. కొద్దిపాటి వర్షానికే చెరువు కట్టకు పలు చోట్ల పగుళ్లు ఏర్పడ్డాయని రైతులు చెప్పారు. మరమ్మతు పనులు సక్రమంగా చేపట్టకపోవడంతోనే చెరువుకట్ట కోతకు గురైందని ఆరోపించారు. ఈ విషయమై ఇరిగేషన్ ఏఈ ప్రతిప్రెడ్డిని వివరణ కోరగా కోతకు గురైన చెరువు కట్టకు మరమ్మతులు చేయిస్తామని చెప్పారు. -
శివ్వంపేటలో శాటిలైట్ భూసర్వే
3 గ్రామాల్లో 20 రోజుల పాటు సర్వే శివ్వంపేట: శాటిలైట్ ద్వారా భూసర్వే చేపట్టేందుకు శివ్వంపేట మండలంలోని మూడు గ్రామాలు ఎంపికయ్యాయి. గజన్ శాటిలైట్ ద్వారా శభాష్‌పల్లి, గంగాయపల్లి , పోతారం గ్రామాల్లో సర్వే చేపట్టనున్నట్లు తహసీల్దార్ పర్హీన్షేక్ చెప్పారు. మంగళవారం సర్వే సిబ్బందితో ఆమె సమావేశమయ్యారు. ప్రభుత్వ, ప్రైవేటు భూములను గుర్తించి సర్వే చేసేందుకు పైలట్ ప్రాజెక్టు కింద జిల్లాలో మొదట శివ్వంపేట మండలం ఎంపికైందన్నారు. అందులో భాగంగా ఈ మూడు గ్రామాల్లో సెంట్రల్ సర్వే ఆఫీస్, ఇస్రో, తెలంగాణ స్టేట్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ బృందాలు భూ సర్వేలో పాల్గొంటాయన్నారు. భూ వివాదాలను పరిష్కరించడంతో పాటు అసలైన పట్టాదారుల గుర్తింపు, ఫ్రభుత్వ భూముల గుర్తింపునకు సర్వే దోహదపడనుంది. శాటిలైట్ సర్వే ఆధారంగా ఆయా భూములకు హద్దులు ఏర్పాటు చేసి అందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని వెబ్‌ల్యాండ్‌లో అనుసంధానిస్తారు. 20 రోజుల పాటు మూడు గ్రామాల్లో సర్వే కొనసాగుతుందన్నారు. కాగా, మంగళవారం సర్వే సిబ్బంది శభాష్పల్లిలో పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్వే అధికారులు సుబ్బారావు, అనంత పద్మనాభ, హరీష్, ఆర్ఐ రాజిరెడ్డి సర్వేయర్లు, వీఆర్ఓలు పాల్గొన్నారు. -
మల విసర్జన చేశాడని బట్టలూడదీత
బాలుడిని నగ్నంగా ఇంటికి పంపిన ప్రైవేట్ పాఠశాల సిబ్బంది శివ్వంపేట: మెదక్ జిల్లా శివ్వంపేట మండల కేంద్రంలో నాలుగేళ్ల బాలుడిపట్ల ఓ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం అమానవీయంగా ప్రవర్తించింది. తరగతి గదిలో మలవిసర్జన చేసినందుకు గాను సిబ్బంది బాలుడి బట్టలూడదీయించి నగ్నంగా ఇంటికి పంపారు. మండలంలోని రత్నాపూర్‌కు చెందిన మణిదీప్(4) శివ్వంపేట సువిద్య కిట్స్ ప్రైవేటు పాఠశాలలో యూకేజీ చదువుతున్నాడు. మంగళవారం పాఠశాలకు వెళ్లిన విద్యార్థి దుస్తుల్లో మలవిసర్జన చేశాడు. దీంతో పాఠశాల సిబ్బంది ఆ బాలుడి దుస్తులు ఊడదీయించారు. అనంతరం ఆటోలో నగ్నంగా ఇంటికి పంపించారు. దీంతో కుటుంబ సభ్యులు కం గుతిన్నారు. బుధవారం ఉదయం విద్యార్థులను పాఠశాలకు తీసుకెళ్లేందుకు గ్రామానికి వచ్చిన ఆటోను విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు అడ్డుకున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చిన్నారిపట్ల అమానవీయంగా ప్రవర్తించిన పాఠశాలపై చర్యలు తీసుకుంటామని ఎంఈవో చెప్పారు. ఈ విషయమై సదరు పాఠశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ నరేశ్‌ను వివరణ కోరగా.. తాను మంగళవారం పాఠశాలకు వెళ్లలేదని, ఈ ఘటనకు బాధ్యులైనవారిపై చర్యలు తీసుకుంటామన్నారు. -
జెడ్పీ పీఠం కాంగ్రెస్‌దే
శివ్వంపేట, న్యూస్‌లైన్: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించి ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ పదవిని హస్తగతం చేసుకుంటామని మాజీ మంత్రి సునీతారెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగం గా మండల పరిధి దొంతి గ్రామంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో ఆమె పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించారు. ఉదయాన్నే ఆలయానికి వచ్చిన మాజీ మంత్రి ప్రత్యేక పూజల అనంతరం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. దొంతి, గుండ్లపల్లి, కొంతాన్‌పల్లి, దంతాన్పల్లి, పోతులబోగూడ, పాంబండ, ఉసిరికపల్లి, చెంది, గంగాయిపల్లి, శేభాష్పల్లి గ్రామాల్లో పర్యటించి కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వే యాలని కోరారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి పనులను వివరిస్తూ గ్రామాలు మరింత అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్‌తోనే సాధ్యమని, పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాలు మరింతగా అభివృద్ధి చెందుతాయన్నారు. ఈ సందర్భంగా కొంతాన్‌పల్లి పంచాయతీ టీఆర్ఎస్కు చెందిన మాజీ ఉప సర్పంచ్ కొండల్రావు ఆమె సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఆమె వెంట కాంగ్రెస్ నాయకులు, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఉన్నారు. -
బ్యాంక్ దోపిడీకి విఫలయత్నం
శివ్వంపేట, న్యూస్‌లైన్ : మండల పరిధిలోని గ్రామీణ వికాస్ బ్యాంక్ గోమారం శాఖ కార్యాలయంలో శుక్రవారం అర్ధరాత్రి దొంగలు దోపిడీకి విఫలయత్నం చేశారు. తుప్రాన్ సీఐ రవీందర్‌రెడ్డి కథనం మేరకు.. గుర్తు తెలియని వ్యక్తులు బ్యాం క్ ప్రధాన ద్వారం తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించారు. బ్యాంక్ లోపల మూడు సీసీ కెమెరాలు ఉండగా అందు లో ఒకదాని కనెక్షన్ తొలగించి మరో దా న్ని గోడ వైపునకు తిప్పారు. అనంతరం లాకర్లు ఉన్న అల్మరాను ధ్వంసం చేసి తలుపులు తెరిచారు. అందులో డబ్బు లేకపోవడంతో పక్కనే ఉన్న లాకర్లను తెరిచేందుకు విశ్వప్రయత్నం చేశారు. అవి తెరుచుకోక పోవడంతో దుండగులకు డబ్బు, నగలు లభ్యం కాలేదు. చోరీ యత్నానికి సంబంధించిన వివరాలను బ్యాంక్ సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను ఈ సందర్భంగా పరిశీలించాం. బ్యాంక్ లోనికి చొరవడిన ఇద్దరు వ్యక్తులు మొహానికి మాస్కులు, చేతులకు గ్లౌజులు ధరించారు. ఇదిలా ఉండగా సంఘటనా స్థలాన్ని గ్రామీణ వికాస్ బ్యాంక్ డివిజనల్ మేనేజర్ పీవీ కృష్ణారెడ్డి పరిశీలించారు. బ్యాంక్‌లో ఎలాంటి సొమ్మూ పోలేదని శాఖ మేనేజర్ ఎం ప్రభాకర్‌రావు తెలిపారు. బ్యాంక్ చోరీకి ప్రయత్నించిన దుండగులను త్వరలోనే పట్టుకుంటామని సీఐ రవీందర్‌రెడ్డి తెలిపారు. పలు ఆధారాల కోసం క్లూస్ టీం సిబ్బంది ఆధారాలు సేకరించారు. ప్రారంభించిన ఐదు నెలలకే చోరీ గ్రామంలో గ్రామీణ వికాస్ బ్యాంక్ శాఖను ఐదు నెలల క్రితం రాష్ట్ర మంత్రి సునీతారెడ్డి ప్రారంభించారు. పదిహేను సంవత్సరాల క్రితం గ్రామంలో ఉన్న బ్యాంక్‌లో లావాదేవీలు సక్రమంగా జరగకపోవడం, అదే సమయంలో చోరీ కూడా జరిగింది. దీంతో సంబంధిత అధికారులు బ్యాంక్‌ను నర్సాపూర్‌కు తరలించారు. అయితే గ్రామస్తుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మం త్రి చొరవతో తిరిగి శాఖను ఇటీవల ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో బ్యాం క్ దోపిడీకి యత్నించడం గమనార్హం.