
సేవ్ డెమోక్రసీసేవ్ డెమోక్రసీ
- ఫిరాయింపులను నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ ధర్నాలు
- సంఘీభావం తెలిపిన వామపక్షాలు
అనంతపురం : తమ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను టీడీపీలోకి తీసుకోవడంతో పాటు వారికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని వైఎస్సార్‌సీపీ నాయకులు మండిపడ్డారు. ‘ఒకపార్టీ ఎమ్మెల్యేలు మరో పార్టీలోకి వెళ్లినప్పుడు రాజీనామా చేయాలి. ఇది జరగకుండానే మంత్రివర్గంలో చోటు కల్పించడం అనైతికం, అప్రజాస్వామికం. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ముఖ్యమంత్రే ఇలా వ్యవహరించడం దారుణమ’ని ఆక్షేపించారు. వెంటనే కేంద్రం జోక్యం చేసుకుని ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజలే చంద్రబాబును బర్తరఫ్ చేసే రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నాయకులు, కార్యకర్తలు ధర్నాలు చేపట్టారు.
అనంతపురం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగిన ధర్నాలో ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్, సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్, వైఎస్సార్‌సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు నదీంఅహ్మద్ తదితరులు పాల్గొన్నారు. ఉరవకొండ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు. చంద్రబాబు అనైతికంగా, అప్రజాస్వామికంగా వ్యవహరించి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను టీడీపీలోకి పిలుచుకుని ఫిరాయింపుల చట్టానికి తూట్లు పొడిచారని ఆయన మండిపడ్డారు. ఫిరాయించిన వారిపై చర్యలు తీసుకోవాలని తాము అసెంబ్లీ స్పీకర్‌కు అనేక మార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. పెనుకొండ ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో పార్టీ జిల్లా అధ్యక్షులు శంకరనారాయణ మాట్లాడారు.
చంద్రబాబుది నీచ సంస్కృతి అని దుయ్యబట్టారు. రాయదుర్గం పట్టణంలో మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వరకు బైకు ర్యాలీ చేపట్టి.. అక్కడ ధర్నాకు దిగారు. సీఎం చంద్రబాబు ఫిరాయింపులను ప్రోత్సహించి వారికి మంత్రి పదవులిచ్చి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని, రాజకీయ వ్యభిచారిలా మారారని మండిపడ్డారు. తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికి తహసీల్దార్ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నాలో సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి పాల్గొన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడం సిగ్గుమాలిన చర్య అన్నారు. గుంతకల్లు తహసీల్దార్ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నాలో సమన్వయకర్త వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అనైతిక చర్యలకు పాల్పడుతోందన్నారు. రాప్తాడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నాలో సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మాట్లాడారు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీని బంగాళా ఖాతంలో కలపడం ఖాయమని హెచ్చరించారు. శింగనమల తహసీల్దార్ కార్యాలయం ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఆలూరి సాంబశివారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన నడుస్తోందన్నారు. కళ్యాణదుర్గం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాలో సమన్వయకర్త ఉషాశ్రీచరణ్ మాట్లాడుతూ చంద్రబాబుకు దమ్ముంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, మళ్లీ ఎన్నికలకు వెళ్లాలన్నారు. కదిరి పట్టణంలో సమన్వయకర్త డాక్టర్ సిద్దారెడ్డి ఆధ్వర్యంలో బైకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. మడకశిర తహసీల్దార్ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నాలో సమన్వయకర్త డాక్టర్ తిప్పేస్వామి పాల్గొన్నారు.
పుట్టపర్తి తహసీల్దార్ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నాలో సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి మాట్లాడారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలను సిగ్గు లేకుండా టీడీపీలోకి చేర్చుకొన్న చంద్రబాబు.. వారికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మవరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట పార్టీ జిల్లాఅధికార ప్రతినిధి గుర్రం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. హిందూపురంలో నియోజకవర్గ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కాగా.. పోలీసులు ఎన్నికల్ కోడ్‌ను సాకుగా చూపి నవీన్‌నిశ్చల్‌తో పాటు కార్యకర్తలను అరెస్టు చేశారు. అనంతరం సొంతపూచీకత్తుపై విడుదల చేశారు.