నాటక శిల్పం.. రస రమ్యం
నాటక శిల్పం.. రస రమ్యం
Published Thu, Jan 26 2017 11:18 PM | Last Updated on Tue, Sep 5 2017 2:11 AM
- అలరించిన నందినాటకోత్సవాలు
- ముగిసిన సాంఘిక నాటకాలు
- నేటి నుంచి పద్యనాటికలు మొదలు
కర్నూలు(హాస్పిటల్): నంది నాటకోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు సాంఘిక నాటికలు ప్రేక్షకులను అలరించాయి. సాంఘిక దురాచారాలు, కుటుంబ కలహాలు, డబ్బు వ్యామోహం, గిరిజనులపై జరుగుతున్న దాడులను తెలిపే ఇతివృత్తాలతో నాటకాలు నడిచాయి. ఈ నెల 18వ తేదీ నుంచి గురువారం వరకు సాంఘిక నాటకాలతో అలరించిన నందినాటకోత్సవాలు శుక్రవారం నుంచి పద్యనాటికలతో ఆకట్టుకోనున్నాయి.
డబ్బుకోసం భర్తను కోర్టుకీడ్చే భార్య కథ ‘సైకతశిల్పం’
నంద్యాల కళారాధన వారి ‘సైకతశిల్పం’అనే సాంఘిక నాటికను తాళా బత్తుల వెంకటేశ్వరరావు రచించగా, డాక్టర్ జి. రవికృష్ణ దర్శకత్వం వహించారు. డబ్బుపై వ్యామోహంతో భర్తను, కుటుంబాన్ని కోల్పోయిన ఓ మహిళ కథే ఇది. వరప్రసాద్, సుధాకర్, తాళాబత్తుల వెంకటేశ్వరరావు, ఎస్‌ఎం బాషా, డీసీపీ శర్మ, సురభిప్రభావతి, జ్యోతి, పి. నాగలింగేశ్వరి నటించారు.
ఏకాకిగా బతుకుతున్న వృద్దుడికి కథే ‘ఒయాసిస్’
ప్రొద్దుటూరు కళాభారతి వారి ‘ఒయాసిస్’ సాంఘిక నాటకను.. వైజి ప్రకాశ్ రచించి, దర్శకత్వం వహించారు. వృద్ధాప్యం ఎడారిలో ప్రయాణం లాంటిది. గుక్కెడు నీటి కోసం జానెడు నీడకోసం తల్లడిల్లిపోతూ అన్వేషించడం లాంటిది. అలాంటి పరిస్థితుల్లో ఒయాసిస్సు కనిపిస్తే ఇక అతడు దాన్ని వదిలి వెళ్లగలడా..? అనేదే ఈ నాటిక వృత్తాంతం. కడుపున పుట్టిన కొడుకు నిరాదరణతో ఒంటరిగా బతుకునీడుస్తున్న ఓ వృద్ధుడి జీవిత గాథ ఇది. నవీన, వైజి ప్రకాష్, కె. సుభాష్ చంద్రబోస్, ఎం. నరసింహాచార్లు, ఎ. కృష్ణారావు, కె. శ్రీను నటించారు.
గిరిజనుల దోపిడికి నిదర్శనం ‘రేలపూలు’
హైదరాబాద్ సిరిమువ్వ కల్చరల్స్ వారి రేలపూలు సాంఘిక నాటకంను రావినూతల ప్రేమకిశోర్ రచించగా, ఎం. భజారప్ప దర్శకత్వం వహించారు. ఈ కథంతా గిరిజనుల చుట్టూ సాగుతుంది. అందమైన రేలపూలతో అలరారుతున్న అడవిలో నివసిస్తున్న అమాయక గిరిజనులు సంతోషంగా జీవిస్తుంటారు. ఈ సమయంలో పల్లపోళ్ల రాకతో అడవి సంపద మాయమై ఆ గిరిజన బతుకులు దోపిడికి గురై పరాయీకరణ చెందుతాయి. ఆడకూనల ఉసురు తీస్తున్న నెత్తుటి కోనలో కడుపు పంటలను కబళిస్తున్న వైనాన్ని చక్కగా ప్రదర్శించారు. ఈ రేలపూల గాయాలకు సూత్రదారులెవరు..?, ఈ కమురు వాసనల కాలానికి కారణభూతులెవ్వరు..?, అనే ప్రశ్నలకు సమాధానమే ఈ నాటిక. ఇందులో పాత్రదారులుగా మంజునాథ్, రామశాస్త్రి, రాధాకృష్ణ, రామకృష్ణ, శివరామకృష్ణ, ప్రసాద్, సుసర్ల కామేశ్వరశర్మ,కె. కోటేశ్వరరెడ్డి, కళానవీన్, హరిశ్చంద్రప్రసాద్, సురభిప్రభావతి నటించారు.
వరకట్న వేదింపులకు సమాధానం ‘తర్జని’
ఉయ్యూరు, కళావర్షిణి వారి తర్జని సాంఘిక నాటిక వరకట్న వేధింపులపై కొనసాగుతుంది. ఈ నాటికను ఇసుకపల్లి మోహన్‌రావు రచించగా, జెట్టి హరిబాబు దర్శకత్వం వహించారు. ఇందులో జీఎస్ చలపతి, జె.హరిబాబు, డి. జార్జి, డి. శివాజీరావు, ఎన్.నవీన నటించారు.
నాటకమే తన జీవితమని చెప్పే ‘రసరాజ్యం’
ఇప్పటికే వందకు పైగా ప్రదర్శనలు పూర్తి చేసుకున్న గుంటూరు శాస్త్రీయం వారి రసరాజ్యం నాటకంలో కిరీటి పాత్రలో ప్రముఖ సినీనటుడు కోట శంకరరావు జీవించారు. ఇతర పాత్రదారులుగా జ్యోతి, జయశ్రీతేజ, రాజర్షి, కార్తీక్ జీవం పోశారు. నాటకరంగానికి తన జీవితాన్ని అంకితం చేసిన ఓ మహానటుడు కిరిటీ పాత్ర చుట్టూ కథ తిరుగుతుంది.
ఆలోచనాత్మకం.. ‘పుట్టలోని చెదలు’
తిరుపతిలోని అక్కల ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘పుట్టలోని చెదలు’ అనే సాంఘిక నాటికను అక్కల తామేశ్వరయ్య రచించగా, టీఎస్‌ఎన్‌విపి మూర్తి దర్శకత్వం వహించారు. తన తండ్రి ఉద్యోగం తనకు వీఆర్‌ఎస్ ద్వారా ఇమ్మని ఒత్తిడి చేసే కొడుకు కథే ఇది. తండ్రి ససేమిరా అనడంతో తండ్రీకొడుకులు ఘర్షణపడతారు. చివరకు తండ్రిని చంపడానికి సైతం కుమారుడు సిద్ధపడతాడు. ఈ నేపథ్యంతో తన కొడుకును పంపిస్తాడు తండ్రి. పాత్రదారులుగా టీఎస్‌ఎన్‌విపి మూర్తిరాజు, యశోద, ఎం. సహాశిత్, అక్కల తామేశ్వరయ్య, ఆనంద్, కె. వాసుదేవాచారి, అడివి శంకరరావు నటించారు.
నేటి నుంచి పద్యనాటికలు
ఇప్పటి వరకు ఎనిమిదిరోజుల పాటు సాంఘిక నాటికలతో అలరించిన నందినాటకోత్సవాల్లో శుక్రవారం నుంచి పద్యనాటికలు ఉర్రూతలూగించనున్నాయి. ఉదయం 9 గంటలకు శ్రీ మైత్రి కళాపరిషత్ వారి శ్రీ కృష్ణాంజనేయయుద్ధం, మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ వంశీ కళాక్షేత్రం వారి రావణబ్రహ్మ, రాత్రి 6.30 గంటలకు మేకా ఆర్ట్స్ వారి హరిశ్చంద్ర పద్య నాటక ప్రదర్శనలు ఉంటాయి.
Advertisement
Advertisement