ఉత్సాహభరితంగా నాటిక ప్రదర్శనలు
కర్నూలు(కల్చరల్): కర్నూలులో తొలిసారిగా నిర్వహించిన తెలుగు నాటిక పోటీలు ఉత్సాహ భరితంగా సాగినట్లు లలిత కళాసమితి అధ్యక్షులు పత్తి ఓబులయ్య తెలిపారు. స్థానిక టీజీవీ కళాక్షేత్రంలో శనివారం ఉదయం 10 గంటలకు తానా జాతీయ స్థాయి నాటిక పోటీల మూడో రోజు ప్రదర్శనలను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఈ పోటీలకు విశేష స్పందన లభించిందన్నారు. కరీంనగర్, నిజామాబాద్, హైదరాబాద్, గుంటూరు, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి నాటిక సమాజాలు తరలివచ్చాయన్నారు.
ఉల్లాసం నింపిన నాటికలు
శనివారం ఉదయం స్థానిక టీజీవీ కళాక్షేత్రంలో ఉదయం 10 గంటలకు సాయి ఆర్ట్స్ కొలకలూరు కళాకారులు ప్రదర్శించిన ఒక్క మాటే చాలు నాటిక ప్రేక్షకుల్లో ఉల్లాసం నింపింది. మాటలతో బంధాలను పంచుకోవాలే కానీ తెంచుకోకూడదు అనే సందేశాన్నిచ్చిన ఈ నాటికను భవానీ ప్రసాద్ రచించగా గోపరాజు విజయ్ దర్శకత్వం వహించారు. అనంతరం నంద్యాల కళారాధన సంస్థ కళాకారులు ప్రదర్శించిన సైకత శిల్పం నాటిక ప్రేక్షకులను ఆకట్టుకుంది. భార్యాభర్తల బంధాలు ఆర్థిక, వ్యాపార సంబంధాలుగా మారితే అది కుటుంబాలకు ఎంత ప్రమాదకరమో ఈ నాటిక కళ్లకు కట్టింది. మురళీకృష్ణ నిలయం నిజామాబాద్ కళాకారులు ప్రదర్శించిన పొద్దు పొడిచింది నాటిక ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆద్యంతం తెలంగాణ మాండలికంలో సాగిన ఈ నాటిక అలనాటి నిజాం పాలనలో పటేళ్ల దౌర్జన్యాలను తూర్పారపట్టింది. దొర పెత్తనాలు, దౌర్జన్యాలకు దొరసానే తిరగబడి పేదల పక్షాన నిలబడి, పేదలకు మంచి రోజులు వచ్చే 'పొద్దు పొడిచింది' అనే సందేశంతో అంతమైన ఈ నాటకం ప్రేక్షకుల్లో ఉత్సాహం నింపింది. కార్యక్రమంలో లలిత కళాసమితి కార్యదర్శి మహమ్మద్ మియా, సహాయ కార్యదర్శి ఇనాయతుల్లా, కోశాధికారి బాలవెంకటేశ్వర్లు, కార్యవర్గ సభ్యులు యాగంటీశ్వరప్ప తదితరులు పాల్గొన్నారు.