కృష్ణ..కృష్ణా!
భద్రత గాలికి..
– స్వయంగా ఎస్పీ సూచనలూ మినిట్స్‌లో చేరని వైనం
– పదే పదే హెచ్చరించినా పట్టించుకోని పరిస్థితి
– ఘటనా స్థలాన్ని పరిశీలించిన జీఎస్‌ఐ టీం
– రక్షణ గోడ, ఐరన్‌మెష్ ఏర్పాటు చేయాలని అభిప్రాయం?
– త్వరలో ప్రభుత్వానికి నివేదిక అందజేసే అవకాశం
సాక్షి ప్రతినిధి, కర్నూలు:
కృష్ణా పుష్కరాల సందర్భంగా భక్తుల భద్రతను గాలికి వదిలేసినట్టు తెలుస్తోంది. స్వయంగా జిల్లా పోలీస్ బాస్(ఎస్‌పీ) చేసిన సూచనలను, ఆదేశాలను అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రధానంగా పాతాళగంగ ఘాట్‌కు వెళ్లే మార్గంలో చేపడుతున్న పనులతో పాటు ఘాట్ల వద్ద భక్తుల సౌకర్యాలు.. ఏదైనా అనుకోని ఘటన జరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో ఆయన చేసిన సూచనలను విస్మరించినట్లు సమాచారం. ఫలితంగా ఇప్పటికే కొండచరియలు విరిగిపడి అదష్టవశాత్తూ ఎవ్వరికీ ప్రమాదం జరగలేదు కానీ.. రానున్న రోజుల్లోనూ ఇదే తరహా పరిస్థితి కొనసాగితే మాత్రం పుష్కర సమయాల్లో తీవ్ర ఇబ్బందులు తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు స్వయంగా ఎస్పీ చేసిన సూచనలను కూడా సమావేశపు వివరాల నమోదు ప్రక్రియ(మినిట్స్)లో చోటు కల్పించలేదంటే అధికారుల నిర్లక్ష్యం ఏ తరహాలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎస్పీ చేసిన సూచనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవడంలోనూ అధికారులు విఫలమవుతున్నారు. మరోవైపు కొండచరియలు విరిగి పడిన ప్రదేశాన్ని డీఐజీ కూడా మంగళవారం సందర్శించారు. ఇక జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్‌ఐ) నుంచి కూడా ప్రత్యేకంగా ఒక నిపుణుల బందం వచ్చి ఘటన స్థలాన్ని పరిశీలించింది.
రక్షణగోడను నిర్మించాల్సిందే..
జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్‌ఐ) నుంచి కూడా నిపుణులతో కూడిన ఒక టీం వచ్చి శ్రీశైలంలోని పాతాళగంగ ఘాట్‌కు వెళ్లే దారిలో కొండచరియలు విరిగి పడిన ప్రదేశాన్ని మంగళవారం సందర్శించింది. ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయి? ఏం చేయాలని అంశాలపై వెంటనే నివేదిక అందజేయనున్నట్టు తెలిసింది. ప్రధానంగా ఈ కొండ చరియల ప్రాంతంలో కొద్ది భాగం వరకు రక్షిత గోడను(వాల్) నిర్మించాలని.. మరికొద్ది ప్రాంతం వరకు ఐరన్‌మెష్ ఏర్పాటు చేయాలని జీఎస్‌ఐ టీం కూడా ప్రాథమికంగా అభిప్రాయపడినట్టు సమాచారం. లేనిపక్షంలో ఇక్కడ ప్రమాదం జరిగే అవకాశం ఉందని జీఎస్‌ఐ ప్రతినిధి బృందం కూడా నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ప్రధానంగా ఆగస్టులో జరిగే పుష్కరాల సందర్భంగా భారీ వర్షాలు వస్తే కొండచరియలు విరిగేపడే ఘటనలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వెంటనే రక్షణగోడ నిర్మాణంతో పాటు ఐరన్‌మెష్ ఏర్పాటు పనులను ప్రారంభించాలని సూచించనున్నట్టు సమాచారం.
ఎస్పీ సూచనలు కొన్ని..
వాస్తవానికి పుష్కరాల సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సుమారు 25 అంశాలను పలు సమావేశాల్లో జిల్లా పోలీసు సూపరింటెండెంట్(ఎస్‌పీ) ఆకే రవికష్ణ పేర్కొన్నారు. ఇందులో ప్రధానంగా..
– కొండచరియలు విరిగిపడకుండా రక్షణగోడ, ఐరన్‌మెష్ ఏర్పాటు చేయాలి.
– పాతాళగంగకు వెళ్లేందుకు ఉపయోగించే రోప్‌వే కండిషన్‌లో ఉందా లేదా అనే అంశాన్ని పరిశీలించాలి. ఇందుకోసం ఏపీ టూరిజం అధికారులకు లేఖ రాసి కండిషన్‌లో ఉన్నట్టు ఒక లేఖను పొందాలి.
– పాతాళగంగ వద్ద అత్యవసరంగా ఎవరైనా భక్తుడికి ఆరోగ్య సమస్యలు తలెత్తితే ఆసుపత్రికి తరలించేందుకు వీలుగా అక్కడ రెండు అంబులెన్సులను ఏర్పాటు చేయాలి.
– ఏదైనా అనుకోని ఘటన జరిగి ప్రమాదం సంభవిస్తే అత్యవసర వైద్యానికి తరలించేందుకు వీలుగా హెలీ అంబులెన్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి లేఖ రాయాలి.
– ఆలయానికి ప్రమాదం పొంచి ఉందని ఇప్పటికే ఇంటెలిజెన్స్ నివేదికలు వచ్చాయి. అందువల్ల ఎక్స్–రే బ్యాగేజీని ఏర్పాటు చేసుకోవాలి.
– అదేవిధంగా ఆలయానికి సమీపంలోనే సామాన్లు భద్రత పరిచే గది ఉంది. దీనిని దూరంగా ఏర్పాటు చేయాలి.
– ఘాట్ల వద్ద పనులను వెంటనే పూర్తి చేసి పోలీసులకు అప్పగించాలి. తద్వారా అక్కడ డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేసి భద్రత ఏర్పాట్లను పూర్తిచేస్తాం.
– శ్రీశైలంలో ఏర్పాటు చేసే 30 పడకల ఆసుపత్రిలో సర్జరీ చేసే సదుపాయంతో పాటు నిపుణులైన డాక్టర్లను ఏర్పాటు చేయాలి.
అధికారుల నిర్లక్ష్యం
భద్రత విషయంలో ఎస్పీ చేసిన అనేక సూచనలను కనీసం సమావేశపు మినిట్స్‌లోనూ సంబంధిత అధికారులు పేర్కొనలేదంటే భద్రత విషయంలో ఎంత నిర్లక్ష్యం ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే తాను సూచించిన అంశాలను మినిట్స్‌లో ఎందుకు పేర్కొనలేదో వివరణ ఇవ్వాలని శ్రీశైలంలో కొద్దిరోజుల క్రితం నిర్వహించిన సమావేశంలో ఎస్పీ రవికృష్ణ సీరియస్ అయ్యారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా పుష్కర భక్తుల భద్రత విషయంలో అధికారులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.