తొలిరోజు వెలవెల
- 58 మండలాల్లో విత్తన వేరుశనగ పంపిణీ
- రైతులు రాకపోవడంతో బోసిపోయిన కౌంటర్లు
- 2,335 క్వింటాళ్లు మాత్రమే విక్రయం
- 5 మండలాలకు చేరని విత్తనకాయలు
- కళ్యాణదుర్గంలో ‘అధికార’ జోక్యంతో పంపిణీ నిలిపివేత
అనంతపురం సెంట్రల్ : ప్రభుత్వం రాయితీపై పంపిణీ చేస్తున్న విత్తన వేరుశనగ కొనుగోలుకు రైతులు తొలిరోజు పెద్దగా ఆసక్తి చూపలేదు. మొత్తం 58 మండలాల్లో పంపిణీ చేపట్టగా.. 2,335 క్వింటాళ్ల విత్తనకాయలు మాత్రమే తీసుకెళ్లారు. కరువు ప్రభావంతో రైతుల చేతుల్లో చిల్లిగవ్వ లేకపోవడంతో వేరుశనగ కొనుగోలుకు ముందుకు రాలేదు. బుధవారం రాయదుర్గంలో రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి, సమాచారశాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు విత్తన పంపిణీ ప్రారంభించారు. మిగిలిన నియోజకవర్గాల్లో ఆయా ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా పంపిణీ మొదలుపెట్టారు. విత్తన పంపిణీపై వ్యవసాయ శాఖ వద్ద ముందస్తు ప్రణాళికలు లేవన్న విషయం కొట్టొచ్చినట్లు కన్పించింది. ఇతర కార్యక్రమాల నిమిత్తం మంగళవారం జిల్లాకు వచ్చిన ఇన్‌చార్జ్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా కళ్యాణదుర్గంలో లాంఛనంగా ప్రారంభించిన అధికారులు.. రాత్రికి రాత్రే ధరలు ఖరారు చేసి బుధవారం నుంచి జిల్లా వ్యాప్తంగా పంపిణీ మొదలుపెట్టారు.
దీంతో పంపిణీ విషయం చాలామంది రైతులకు చేరలేదు. కొంతమందికి చేరినా చేతిలో డబ్బు లేక విత్తనం తీసుకోవడానికి రాలేదు. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా అన్ని విత్తన పంపిణీ కేంద్రాలు వెలవెలబోయాయి. అరకొరగా వచ్చిన రైతులు ప్రశాంతంగా విత్తనకాయలు తీసుకొని వెళ్లారు. ఒక్కో రైతుకు గరిష్టంగా నాలుగు బస్తాల చొప్పున అందించారు. తొలిరోజు 2,132 మంది రైతులు వేరుశనగ కొనుగోలు చేశారు. అధికార పార్టీ నేతలు చెప్పిన ఏజెన్సీలకు పంపిణీ బాధ్యతలు కట్టబెట్టలేదనే ఉద్దేశంతో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో విత్తన పంపిణీ నిలుపుదల చేయించారు. దీంతో ఆయా మండలాల్లో విత్తన పంపిణీ కేంద్రాల వద్దకు వచ్చిన రైతులు నిరాశతో వెనుదిరిగారు. కనగానపల్లిలో పంపిణీని బంద్ నేపథ్యంలో వామపక్ష నాయకులు అడ్డుకున్నారు. బుక్కరాయసముద్రంలో పరిశీలనకు వచ్చిన అనంతపురం ఆర్డీఓ మలోలను వామపక్ష నాయకులు ఘెరావ్ చేశారు.
ముందస్తు ప్రణాళికల్లో వ్యవసాయ శాఖ విఫలం
వ్యవసాయ శాఖ ప్రణాళికాలోపం వల్ల మండల స్టాకు పాయింట్లకు సరిపడా విత్తనకాయలు చేరలేదు. ధర్మవరం, తాడిమర్రి, బత్తలపల్లి, వజ్రకరూరు, తనకల్లు మండలాలకు ఇప్పటికీ బస్తా కూడా విత్తనకాయలు అందలేదు. మిగిలిన వాటికీ అరకొరగానే చేరాయి. జిల్లాకు 4.59 లక్షల క్వింటాళ్ల విత్తన కాయలు అవసరం. ఇప్పటి వరకూ 1.80 లక్షల క్వింటాళ్లు మాత్రమే చేరాయి. అధికారులు మాత్రం 3.79 లక్షల క్వింటాళ్లు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు.అయితే.. ఆ మేరకు స్టాకు పాయింట్లకు చేరలేదు. హడావుడిగా నిర్ణయించడంతో పాటు రైతుల వద్ద సమయానికి డబ్బు సమకూరకపోవడంతో తొలిరోజు పెద్దగా రాలేదు. రెండు, మూడురోజుల్లో విత్తన పంపిణీ పుంజుకునే అవకాశముంది. బుధవారం పంపిణీ మొదలుకాని ఐదు మండలాల్లో గురువారం నుంచి ప్రారంభిస్తున్నట్లు వ్యవసాయ సంయుక్త సంచాలకుడు (జేడీఏ) శ్రీరామమూర్తి తెలిపారు. అన్ని మండలాలకు సరిపడా విత్తనకాయలు అందుబాటులో ఉన్నాయని, రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.